
నటుడు జయప్రకాష్ రెడ్డి గుర్తున్నారా.? ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు జయప్రకాష్ రెడ్డి . విలన్ గా కెరీర్ మొదలుపెట్టి ఆతర్వాత తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. గతంలో జేపీ ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి అనేక విషయాలను పంచుకున్నారు. జయప్రకాష్ రెడ్డి తొలి ఇన్నింగ్స్‌లో సుమారు 25-30 సినిమాలు చేశారు. అయితే, ఆ సినిమాల వల్ల ఆయనకు పెద్దగా డబ్బులు రాలేదట. దాంతో కొంత ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకోవాల్సి వచ్చింది అని అన్నారు. తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆయన తన భార్యాపిల్లలను పోషించడానికి, అప్పులు తీర్చడానికి సినిమా పరిశ్రమ నుండి ఐదేళ్ల పాటు విరామం తీసుకోవాల్సి వచ్చిందట. ప్రభుత్వ ఉద్యోగంలో తొమ్మిది సంవత్సరాలు జీతం లేకుండా పని చేసి, అప్పులు చేసి కుటుంబాన్ని పోషించినట్లు ఆయన తెలిపారు. ఈ విరామ సమయంలో, ఉదయం నుండి రాత్రి వరకు ట్యూషన్లు చెబుతూ, వచ్చిన డబ్బుతో అప్పుల్లో 40-45 శాతం తీర్చగలిగారట.
ఈ ఐదేళ్ల విరామం చివరిలో, ఒక స్నేహితునితో కలిసి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవడానికి వెళ్లారట. అక్కడ అనుకోకుండా డీ. రామానాయుడును కలిశారట. రామానాయుడు ఆయనను గుర్తుపట్టి, “ఏమైపోయావయ్యా.? అంతు లేకుండా పోయావ్. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? మంచి ఆర్టిస్టువి, ఏమైపోయావ్?” అని అడిగారు. తన ఆర్థిక ఇబ్బందులను వివరించగా, రామానాయుడు “కొత్త సినిమా ప్రారంభించబోతున్నాం. సురేష్ బాబు చూసుకుంటున్నాడు. వెళ్లి కలవండి, చాలా మంచి క్యారెక్టర్ ఉంది, నువ్వు చేస్తే బాగుంటుంది” అని చెప్పారట. ఒకవేళ కలవకుండా వెళ్తే ఊరుకోనని సరదాగా హెచ్చరించారట.
రామానాయుడు స్టూడియోలో ఫోటో షూట్ జరిపినప్పటికీ, సురేష్ బాబు మొదట్లో ఈ పాత్ర కోసం అమ్రీష్ పురి, నానా పటేకర్ వంటి ప్రముఖ నటులను పరిశీలించారు. కానీ, వారి అధిక పారితోషికం బడ్జెట్‌కు సరిపోదని భావించారు. చివరికి జయప్రకాష్ రెడ్డి ఫోటోలను చూసి ఎంపిక చేశారట. దర్శకుడు జయంత్ పరాంజి ఈ పాత్రను హాస్యం లేకుండా, అవుట్ అండ్ అవుట్ సీరియస్‌గా ఉండాలని కోరాని తెలిపారు. రాయలసీమ యాసలో మాట్లాడే ఐడియా తననే ఇచ్చానని, చిన్ననాటి నుంచి తనకు రాయలసీమ భాషపై పట్టు ఉండడంతో, పది రోజులు కర్నూలు, నంద్యాల ప్రాంతాల్లో పర్యటించి, టేప్ రికార్డర్‌తో స్థానిక యాస, పదజాలం సేకరించారని తెలిపాడు. పరుచూరి వెంకటేశ్వరరావు ఈ ఆలోచనను ఎంతగానో ప్రోత్సహించారట ఈ నిర్ణయం సినిమాకు భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. ప్రేమించుకుందాం రా 25 వారాలు విజయవంతంగా నడిచి, జయప్రకాష్ రెడ్డికి “సెకండ్ టర్నింగ్ పాయింట్” అయింది. రాయలసీమ ప్రజలు ఆయన్ను తమవాడిగా భావించారు. ప్రేమించుకుందాం రా విజయం తర్వాత, రెండేళ్లకే సమరసింహా రెడ్డి వంటి బ్లాక్‌బస్టర్ చిత్రంలో నటించి, తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అప్పటికి హెడ్‌మాస్టర్‌గా ప్రమోషన్ పొందిన ఆయన, సినిమాలపై పూర్తి నమ్మకంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారట జయప్రకాష్ రెడ్డి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.