
సినీ ప్రపంచం బయట నుండి చూసేవారికి ఓ స్వర్గలోకంలా కనిపిస్తుంది. అయితే, అది మాయాలోకం అని, తెర వెనుక ఎన్నో కఠిన వాస్తవాలు దాగి ఉంటాయని చాలా కొద్దిమందికే తెలుసు. నటనలో, కీర్తిలో ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికీ, వారి వ్యక్తిగత జీవితాల్లో అశాంతి, అసంతృప్తి నిండి ఉంటాయి. అలాంటి విషాద గాథల్లో ఒకటి వెటరన్ హీరోయిన్ అశ్వినిది. అశ్విని అసలు పేరు వాణి. ఆమె స్వస్థలం నెల్లూరు. ఇంటర్ వరకు చదువుకున్న అశ్విని, డాన్స్ నేర్చుకున్నారు. వాస్తవానికి ఆమెకు మెడిసిన్ చదవాలనే కోరిక ఉండేది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఒకసారి చెన్నైలో ఒక బట్టల షాపునకు వెళ్లినప్పుడు, నిర్మాత వాకాడ అప్పారావు ఆమెను చూసి అవకాశం కల్పించారు. మొదట కోడి రామకృష్ణ దర్శకత్వంలో మా ఇంటికి రండి చిత్రంలో అవకాశం వచ్చినా, అది కుదరలేదు. ఆ తర్వాత దర్శకుడు ధవళ సత్యం తీసిన గుడిగంటలు మోగాయి చిత్రంతో ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు. ధవళ సత్యమే ఆమె పేరును వాణి నుండి అశ్వినిగా మార్చారు. గుడిగంటలు మోగాయి చిత్రం విడుదల ఆలస్యం కావడంతో, ఆనంద కుమ్మి అనే తమిళ చిత్రం ఆమె తొలి చిత్రంగా విడుదలైంది. ఆ తర్వాత రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా నటించిన భారతంలో శంఖారావం చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అక్కడి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 150 చిత్రాల్లో నటించి అగ్ర తారగా రాణించారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే, 1991లో అశ్విని మద్రాసులో వీడియో స్టూడియో నిర్వహించే రవీంద్రనాథన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సాంప్రదాయ పద్ధతిలో కాకుండా దండలు మార్చుకొని, ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో వివాహం నమోదు చేసుకున్నారు. వారి వైవాహిక జీవితం కొంతకాలం బాగానే సాగింది. వారికి కార్తీక్ అనే కొడుకు కూడా జన్మించాడు. అయితే, అనుకోని కారణాలతో రవీంద్రనాథన్ అశ్వినిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. భర్త దూరం కావడం, సినీ అవకాశాలు తగ్గడం, ఆర్థిక ఇబ్బందులు అశ్విని జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఆరోగ్యం క్షీణించి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు గురయ్యారు. వైద్యం చేయించుకోవడానికి కూడా కష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆమె సంపాదించిన ఆస్తి మొత్తం చికిత్సకే కరిగిపోయింది. రోజు గడవడమే కష్టమైంది. ఈ సమయంలో తమిళ నటుడు పార్థిబన్ అశ్విని కుటుంబానికి అడపాదడపా ఆర్థిక సహాయం అందించేవారు. పార్థిబన్ కొడుకు రాధాకృష్ణన్, అశ్విని కొడుకు కార్తీక్ క్లాస్‌మేట్స్ కావడం, కార్తీక్ తన కష్టాలను స్నేహితుడికి చెప్పడంతో పార్థిబన్‌కు విషయం తెలిసింది. క్యాన్సర్ ముదిరి 2012 సెప్టెంబర్ 24న అశ్విని కన్నుమూశారు. అప్పటికి ఆమె వయస్సు కేవలం 36 సంవత్సరాలే. తన అంత్యక్రియలు సొంతూరు నెల్లూరులో జరగాలన్నది అశ్విని చివరి కోరిక. అయితే, అందుకు కూడా డబ్బు లేని నిస్సహాయ స్థితిలో పార్థిబన్ ముందుకు వచ్చి సొంత ఖర్చులతో ఆమె పార్థివ దేహాన్ని నెల్లూరుకు పంపించారు. అంతేకాకుండా, ఆమె తనయుడు కార్తీక్‌ను చదివించే బాధ్యతను కూడా ఆయన స్వీకరించారు. వెండితెరపై మెరిసిన తార, వ్యక్తిగత జీవితంలో అనుభవించిన కష్టాలు, అనాథ మరణం సినీ ప్రపంచంలోని ఒక చీకటి కోణాన్ని, కీర్తి వెనుక దాగి ఉన్న విషాదాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి.