అందంగా లేనని సినిమాల్లో నుంచి తీసేశారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన సీనియర్ హీరోయిన్
ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో కథానాయికగా తనదైన ముద్ర వేసింది హీరోయిన్ ఆమని. ముఖ్యంగా జగపతి బాబు, ఆమని కాంబోలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. అప్పట్లో గ్లామర్ పాత్రలకు దూరంగా హోమ్లీ హీరోయిన్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఆమని రాణించారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాలతోపాటు సీరియల్స్ లోనూ నటిస్తున్నారు ఆమని. ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లు, ఆరంభంలో పరిశ్రమలో రంగు కారణంగా ఎదుర్కున్న వివక్షను గురించి పంచుకున్నారు. కేవలం సంపాదన కోసమే కాకుండా, సినిమా పట్ల ఉన్న అపారమైన ప్రేమ, అభిరుచి వల్లే ఈ రంగంలోకి వచ్చానని ఆమె స్పష్టం చేశారు. చిన్నతనం నుంచే సినిమాల్లో నటించి, ఆర్టిస్ట్ లేదా హీరోయిన్ కావాలనే దృఢ సంకల్పంతో ఇంట్లో తీవ్రంగా పోరాడి, “నేను హీరోయిన్ కాకపోతే చనిపోతాను” అనే స్థాయికి వెళ్ళినట్టు ఆమని గుర్తుచేసుకున్నారు. రాధ, శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయశాంతి వంటి అప్పటి తరం హీరోయిన్ల స్ఫూర్తితోనే తాను నటి కావాలని కలలు కన్నట్లు ఆమె వెల్లడించారు. పరిశ్రమకు వచ్చినప్పుడు మొదట ఒక కలల ప్రపంచంలో ఉన్నట్లు భావించినా, వాస్తవంలో అది అంత సులభం కాదని ఆమెకు తక్కువ టైంలోనే అర్థమైంది.
తాను వచ్చిన రోజుల్లో హీరోయిన్, సిస్టర్ రోల్, ఫ్రెండ్స్ రోల్ మినహా వేరే అవకాశాలు పెద్దగా ఉండేవి కావని, ఇప్పుడైతే యాంకర్, సీరియల్స్, మోడలింగ్ వంటి అనేక ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయని ఆమె అప్పటి పరిస్థితులను వివరించారు. ఆమని తన కెరీర్ ఆరంభంలో ఎక్కువగా తమిళ చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించారు. అక్కడే ఆమెకు తీవ్రమైన కష్టాలు ఎదురయ్యాయని, అయితే తెలుగులో మాత్రం నేరుగా హీరోయిన్ అవకాశాలు దక్కాయని ఆమె తెలిపారు. తమిళంలో హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చినా, 100శాతం విజయం లభించలేదని, తెలుగులోనే తన ప్రయత్నాలు ఫలించాయని అన్నారు. తమిళంలో ఆమె ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు రంగు వివక్ష. ఫోటోలు చూసి వెంటనే పిలిచేవారు, కానీ ఆమెను డైరెక్ట్ గా చూసిన తర్వాత వారి ఎక్స్ ప్రెషన్స్ మారిపోయేవి. అంత అందంగా లేరు అని ఆమెను పక్కన పెట్టేవారు. అలాగే, ఆమె రిజర్వ్‌డ్ స్వభావం కూడా ఒక అడ్డంకిగా మారిందని ఆమె అన్నారు. మూడీ గర్ల్ అని భావించి అవకాశాలు దూరం చేసుకున్నారని చెప్పారు.
పాత తరం నటీమణులు సావిత్రి, వాణిశ్రీ వంటివారు రంగు గురించి పట్టించుకోకుండా, కేవలం ముఖ సౌందర్యం, నటన, హావభావాలకు ప్రాధాన్యత ఇచ్చేవారని, అయితే తాను వచ్చే నాటికి ట్రెండ్ పూర్తిగా మారిపోయిందని ఆమని అన్నారు. శ్రీదేవి తరం నాటికే ఫిట్ నెస్, అందం ప్రాధాన్యత పెరిగిపోయిందని, తన టైంకి నగ్మా, ఖుష్బూ వంటి నార్త్ ఇండియన్ నటీమణులు పరిశ్రమలో రాజ్యం ఏలుతున్నారని, అప్పుడు తమలాంటి వారికి అవకాశాలు దక్కడం కష్టంగా ఉండేదని ఆమె తెలిపారు. “డస్కీ కలర్”ని అప్పుడు బ్లాక్ అని తీసిపడేసేవారు, కానీ ఇప్పుడు దీపికా పదుకోణె వంటి నటీమణులు డస్కీ కలర్‌తోనే ఫేమస్ అవుతున్నారని, ఇది కాలం తెచ్చిన మార్పు అని ఆమె అభిప్రాయపడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
