
ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ చనిపోయి ఇంతకాలం అవుతున్న ఆయనను ప్రేక్షకులు నిత్యం గుర్తు చేసుకుంటున్నారు. గతంలో వేణుమాధవ్ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం, రాజకీయ అనుబంధాలకు సంబంధించిన అనేక వివరాలను పంచుకున్నారు. సాంప్రదాయం సినిమాతో కెరీర్ ప్రారంభించి, పలు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి, హంగుమా, భూకైలాస్, ప్రేమాభిషేకం వంటి సినిమాల్లో హీరోగా కూడా మెప్పించిన వేణు మాధవ్, తన ఆస్తులు, పుకార్లు, సినీ పరిశ్రమలో తన స్థానం గురించి నిర్మొహమాటంగా మాట్లాడారు. తనకు ఒక పెద్ద ఇల్లుతో పాటు పది చిన్న అద్దె ఇళ్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ ఇళ్లన్నిటికీ “అచ్చి వచ్చిన కృష్ణ నిలయం” అనే పేరు పెట్టానని, తన తల్లిదండ్రుల పేర్లతో పాటు ఈ పేరును ఇంటింటికీ పెట్టడం వెనుక ఉన్న ఆసక్తికర నేపథ్యాన్ని తెలియజేశారు. తన తల్లిదండ్రులు లేకుంటే తాను లేనని, ఇది వారు పెట్టిన భిక్ష అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రెంట్ల మీద జీవించగలనని, అయితే హౌసింగ్ లోన్లు ఉన్నాయని తెలిపారు.
సినీ పరిశ్రమలో తనకు అత్యంత సన్నిహితులు ఎవరూ లేరని, స్నేహ, త్రిష, శ్రియా వంటి హీరోయిన్లతో పాటు చిరంజీవి వంటి స్టార్స్‌తో తనకు మంచి స్నేహం ఉందని, కానీ అది వ్యక్తిగత సమస్యలను పంచుకునేంత సన్నిహితం కాదని చెప్పారు. తన కెరీర్‌లో వచ్చిన విరామం గురించి వేణు మాధవ్ మాట్లాడుతూ, బూతులున్న సినిమాలు చేయనని తాను ఒక నిర్ణయం తీసుకోవడం వల్లే కొంత గ్యాప్ వచ్చిందని పేర్కొన్నారు. “ఎవరూ ఎవరినీ తొక్కరు, వాడిని వాడే తొక్కోవడమే తప్ప” అని సినీ పరిశ్రమ స్వభావాన్ని వివరించారు. టాలెంట్ ఉంటే ఎవరూ ఎవరినీ తొక్కలేరని, బ్యాడ్ బిహేవియర్ లేదా సరైన సమయం పాటించకపోవడం వంటి కారణాల వల్లనే ఎవరికి వారే తమను తాము తొక్కేసుకుంటారని అభిప్రాయపడ్డారు.
తాను ప్రస్తుతం సంపాదించకపోయినా, తన వద్ద ఉన్న సంపాదన అద్భుతంగా ఉందని, 10 ఎకరాల పొలం ఉన్నందున తనకు ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవని తెలిపారు. మానసిక సమస్యలు కూడా ఎవరితోనైనా మాట్లాడితే క్లియర్ అవుతాయని ఆయన పేర్కొన్నారు. తాను నటించిన చిత్రాలు తన వల్ల విజయవంతం కాలేదని వేణు మాధవ్ తెలిపారు. సినిమాలు విజయవంతం కావడానికి రైటర్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలే కారణమని, తన పాత్రల కోసం రైటర్లు తనను ఎంచుకోవడం వల్లనే ఆ సినిమాలు నడిచాయని అన్నారు. 500కు పైగా సినిమాలు చేసినా, తన వల్ల ఒక్క సినిమా కూడా నడవలేదని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.