Vyooham Movie: ఆర్టీవి ‘వ్యూహం’ సినిమాకు బ్రేక్.. విడుదల చేయొద్దు.. హైకోర్టు..

|

Dec 23, 2023 | 10:50 AM

డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రిలీజ్ కాకుండానే ఈ సినిమా చుట్టూ రచ్చ రచ్చ జరుగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో ఎదురైన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన వ్యూహం చిత్రాన్ని..ఈ నెల 29న విడదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది మూవీ యూనిట్‌. అయితే ఈ చిత్రానికి ఇచ్చిన సెన్సార్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది

Vyooham Movie: ఆర్టీవి వ్యూహం సినిమాకు బ్రేక్.. విడుదల చేయొద్దు.. హైకోర్టు..
Vyooham Movie
Follow us on

దర్శకుడు రాంగోపాల్‌వర్మ రూపొందించిన “వ్యూహం” మూవీకి షాక్‌ ఇచ్చింది కోర్టు. ఈ సినిమాను ఓటీటీతో పాటు ఇతర ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నేడు విజయవాడలో గ్రాండ్‌గా ప్లాన్‌ చేసింది చిత్ర యూనిట్‌. డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రిలీజ్ కాకుండానే ఈ సినిమా చుట్టూ రచ్చ రచ్చ జరుగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో ఎదురైన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన వ్యూహం చిత్రాన్ని..ఈ నెల 29న విడదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది మూవీ యూనిట్‌. అయితే ఈ చిత్రానికి ఇచ్చిన సెన్సార్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది హైదరాబాద్‌ సిటీ సివిల్ కోర్టు. ‘వ్యూహం’ సినిమా విడుదలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ చిత్రాన్ని ఓటీటీ, ఆన్‌లైన్‌, ఇంటర్నెట్ వేదికల్లో ఎక్కడా విడుదల చేయొద్దని ఆదేశించింది. చిత్రాన్ని నిర్మించిన రామదూత క్రియోషన్స్‌తో పాటు దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది. మరోవైపు వ్యూహం సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నేడు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గ్రాండ్‌ నిర్వహిస్తోంది మూవీ యూనిట్‌. ఈ కార్యక్రమానికి పలువురు వైసీపీ నేతలతో పాటు ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారని ఆర్జీవీ తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను డైరెక్టర్‌ ఆర్జీవీ పరిశీలించారు. రాజకీయ నేతలు నిత్యం చేసుకునే ఆరోపణలనే తాను ఈ సినిమాలో చూపించానన్నారు ఆర్జీవీ. సినిమాలో కచ్చితంగా రాజకీయాల ప్రస్థావన ఉంటుందన్నారు.

వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత నుంచి మొదలుకుని.. జగన్ మోహన్‌ రెడ్డి ఓదార్పు యాత్ర.. ఆ తర్వాత జగన్ సీఎం అయ్యే వరకు జరిగిన పరిణామాలను ఈ మూవీలో చూపించానని చెబుతున్నారు ఆర్జీవీ. సినిమా పోస్టర్ దగ్గర నుంచి టీజర్, ట్రైలర్ వరకూ అన్నీ సంచలనంగా మారాయి. సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు, డైలాగులు రాజకీయాల్లో కాకరేపాయి. దీంతో ఈ సినిమా అటు సినీ ప్రేక్షకులతో పాటు, రాజకీయ నాయకుల్లో కూడా ఆసక్తి పెంచేసింది. అదే సమయంలో వివాదాలకు కేరాఫ్‌గా కూడా మారింది. చంద్రబాబును కించపరిచేలా.. టీడీపీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందంటూ టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాత్రను తమిళ నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా.. జగన్ సతీమణి వైఎస్ భారతి పాత్రలో మానస రామకృష్ణ కనిపించనుంది. రామదూత బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి సినిమా రిలీజ్‌పై ఈ నెల 27 కోర్టు ఏం తీర్పు చెబుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.