తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు చంద్రమోహన్ శనివారం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 9.45 గంటలకు హృద్రోగంతో కన్నుమూశారు. చంద్రమోహన్ వయసు 82 ఏళ్ళు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్‌లోనే చంద్రమోహన్ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
హీరోగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక పాత్రల్లో ఆయన వెండితెరపై వెలిగారు. తెలుగులో ఒకప్పుడు గొప్ప హీరోయిన్లు వెలిగిన వారందరూ తొలుత చంద్రమోహన్ సరసన నటించిన వారే. ఆయన పక్కన హీరోయిన్‌గా నటిస్తే తిరుగు ఉండదనే భావన చాలా మంది హీరోయిన్లలో ఉంది. అది నిజం కూడా. జయసుధ, జయప్రద మొదలు సుహాసిని వరకు అందరూ తొలినాళ్లలో ఆయన పక్కన నటించినవారే.
1942 మే 23న కృష్ణాజిల్లా పమిడిముక్కలలో జన్మించారు చంద్రమోహన్. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్. 932 పైగా సినిమాల్లో నటించిన చంద్రమోహన్.. 1966లో రంగులరాట్నం చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఎన్నో విలక్షణమైన పాత్రలతో తెలుగు ప్రజల మనసులో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నారు.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయమైన చంద్రమోహన్… తెలుగు చిత్రసీమపై చెరగని ముద్ర వేశారు. దాదాపు వెయ్యి సినిమాల్లో కనిపించారు చంద్రమోహన్. ఆయన నటించిన కుటుంబ కథా చిత్రాలు.. పెద్దపెద్ద కమర్షియల్ సినిమాలక్కూడా పోటీనిచ్చేవి.
చంద్రమోహన్…. దాదాపు ప్రతీ టాప్ హీరోయిన్‌తోనూ నటించారు. చంద్రమోహన్ కథానాయకుడిగా చేసిన సినిమాల్లో నటించి తెరంగేట్రం చేసిన నటులు అనేకమంది. ఆయన సినిమాల్లో ఆయనే హీరో, ఆయనే కమెడియన్. అప్పట్లోనే ఫ్యామిలీ హీరోగా, స్టార్ కమెడియన్‌గా డబుల్ షేడ్స్‌తో పాపులారిటీ తెచ్చుకున్నారు.
సహజ నటనతో, సింపుల్ పెర్ఫామెన్స్‌తో ఆడియన్స్‌ను కడుపుబ్బ నవ్విస్తారు, కంటతడి పెట్టిస్తారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకుడికి ఆరాధ్యుడయ్యారు. ఇటీవలి సినిమాల్లో తాను చేసిన క్యారెక్టర్లతో పక్కింటి అంకుల్‌గా నిన్నటిదాకా యూత్ ఆడియన్స్‌కి దగ్గరగానే ఉన్నారు చంద్రమోహన్.
అనారోగ్య కారణాలతో సినిమాలకు బ్రేక్ ఇస్తూ ఇచ్చినా.. అడపాదడపా చిన్నచిన్న పాత్రలు వేస్తూనే ఉన్నారు. కానీ… నాలుగైదేళ్లుగా తెరపై కనిపించలేదు చంద్రమోహన్. ఇంటి దగ్గరే ఉంటూ ప్రశాంతమైన జీవితం గడిపేవారు. ఆయన భార్య జలంధర ప్రముఖ రచయిత్రి.
ఆయన చెయ్యి మంచిదని, ఆయన చేత్తో ఒక్క రూపాయి తీసుకుని ఏ కార్యక్రమం ప్రారంభించినా శుభప్రదమని ఒక సెంటిమెంట్ ఉంది. ఆవిధంగా ఇవ్వడం మొదలుపెట్టి… వంద కోట్ల దాకా పోగొట్టుకున్నానని ఒక సందర్భంలో చంద్రమోహనే చెప్పుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..