కరోనా మహామ్మారి కారణంగా గత రెండేళ్లుగా చిత్రపరిశ్రమ తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే థియేటర్లకు పూర్వ వైభవం వస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టిస్తోది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో థియేటర్లలో టికెట్స్ ను ఆన్ లైన్ లో విక్రయించాలని చట్ట సవరణ చేసిన ప్రభుత్వం.. నిర్ణయించిన ధరలకే టికెట్స్ అమ్మాలని.. బెనిఫిట్స్ షోస్ వేయకూడదని కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ టికెటింగ్ విధానంపై సంతోషం వ్యక్తం చేసినప్పటికీ టికెట్ ధరలు తగ్గింపుపై సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పారు. తాజాగా ప్రముఖ నిర్మాత సీ. కళ్యాణ్ టికెట్ ధరలపై స్పందించారు.
ప్రభుత్వం నిర్ణయంపై సినీ ప్రముఖులు సంతోషంగా లేరని తెలిపారు. ఈరోజు సీ. కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సీ. కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలపై స్పందించారు. సీ. కళ్యాణ్ మాట్లాడుతూ.. టికెట్ ధరలు తగ్గించి ప్రజలకు ప్రభుత్వం మేలు చేస్తున్నట్లుగా భావించవచ్చు. మరీ ఇంతగా తగ్గించడం భావ్యం కాదు. ఒక వస్తువుకు తయారు చేసుకున్న వ్యక్తిగా దాని ధరను నిర్ణయించుకుంటాను. సినిమా చూడాలా.. వద్దా అనేది ప్రేక్షకుల ఇష్టం. దానిపై ఎవరూ బలవంతం చేయడం లేదని.. దీనిపై మరోసారి ప్రభుత్వానికి విన్నవించే ప్రయత్నంచ చేస్తామన్నారు. ప్రస్తుతం సీ. కళ్యాణ్.. హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో గాడ్సే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 26న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే చదువుకున్న యూత్.. ఏదో చేయాలని అనుకుని ఏమి చేయలేక సతమతమయ్యే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఓ నిర్మాతగా ఇలాంటి సినిమాను నిర్మించినందుకు గర్వంగా ఉందన్నారు సీ. కళ్యాణ్. ఈ సినిమా తర్వాత బ్లఫ్ మాస్టర్ డైరెక్టర్ గోపి గణేష్ తో ఓ సినిమా చేయబోతున్నట్లుగా చెప్పారు.
Also Read: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ మృతి.. రోడ్డు పక్కన అనాథ శవంలా..