Chiranjeevi: చిరంజీవికి అదిరిపోయే కథ చెప్పా.. విన్న తర్వాత ఆయన ఏమన్నారంటే

దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Chiranjeevi: చిరంజీవికి అదిరిపోయే కథ చెప్పా.. విన్న తర్వాత ఆయన ఏమన్నారంటే
Sv Krishna Reddy

Updated on: Jun 01, 2026 | 6:54 PM

సుప్రసిద్ధ తెలుగు చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్, సంగీత దర్శకుడు, నటుడు ఎస్.వి. కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు. ఎస్.వి. కృష్ణారెడ్డి కొన్ని హాలీవుడ్ సినిమాల నుంచి ప్రేరణ పొంది తాను కూడా అలాంటి కథలను రూపొందించడానికి ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే, తన తెలుగు చిత్రం ఆహ్వానం కథను డైవర్స్ ఇన్విటేషన్ పేరుతో హాలీవుడ్ లో సినిమా చేశా అని వెల్లడించారు. ఆహ్వానంలోని వివాహ నేపథ్యాన్ని మార్చి, పుట్టబోయే బిడ్డ హక్కులు, తల్లిదండ్రుల నుంచి ఆప్యాయత ఆవశ్యకత అనే కొత్త కోణంలో కథను తీర్చిదిద్దినట్లు వివరించారు. ఈ ప్రయోగానికి తనకు మూడు సంవత్సరాలు పట్టిందని ఆయన పేర్కొన్నారు.

అనంతరం, డైరెక్టర్స్ అసోసియేషన్‌లో తన సభ్యత్వ అనుభవాలను పంచుకున్నారు. ఐదుగురు పర్మనెంట్ ఆర్టిస్టులు సిఫార్సు చేస్తే తప్ప సభ్యత్వం లభించదని, అయితే అప్పటికే 30కి పైగా చిత్రాలు తీసిన తన సామర్థ్యాన్ని గుర్తించి, తోటి సభ్యులు తన అప్లికేషన్‌ను ఆమోదింపజేసినట్లు తెలిపారు. సినీ నిర్మాణ ప్రక్రియలో అసోసియేషన్ పాటించే కఠినమైన నిబంధనలను ఆయన వివరించారు. షూటింగ్ జరిగే ప్రదేశం, ఐదు విభాగాల పనితీరు, ఏ డిపార్ట్‌మెంట్ పనిని మరొకరు చేయకూడదనే నియమాలు, అలాగే దర్శకుడు, నటులు, కెమెరామెన్ మధ్య సమన్వయం వంటి విషయాలను ఆయన స్పష్టం చేశారు.

మెగాస్టార్ చిరంజీవితో ఒక ప్రాజెక్ట్ ఎందుకు కార్యరూపం దాల్చలేదో కూడా ఎస్.వి. కృష్ణారెడ్డి వెల్లడించారు. చిరంజీవి గారిపై తనకు గౌరవం ఉన్నప్పటికీ, తమ ఇద్దరి ఆలోచనలలో తేడాలున్నాయని, తాను ఎల్లప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటానని ఆయన తెలిపారు. చిరంజీవి గారికి తాను చెప్పిన కథ చాలా అద్భుతంగా ఉందని, అది అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్‌తో కూడినదని అన్నారు కృష్ణారెడ్డి. ఆ కథలో, చిరంజీవి కుటుంబంతో కలిసి టీవీలో ఒక కామిక్ కార్టూన్ సినిమా చూస్తూ ఉంటారు. ఒక అందమైన కార్టూన్ అమ్మాయిని ఒక రాక్షసుడికి బలవంతంగా పెళ్లి చేస్తుండగా, ఆమె “సేవ్ మీ” అని అరుస్తుంది. ఈ అరుపు విని చిరంజీవి టీవీలో నుండి తన చేయి పెట్టి ఆ అమ్మాయిని బయటికి లాగుతారు. ఆ అమ్మాయి రిమోట్ తీసుకుని టీవీని ఆపగానే, కార్టూన్ విలన్స్ వివిధ టీవీలలో ఆమెను వెతకడం మొదలుపెడతారు. ఆ కార్టూన్ అమ్మాయి కథలో ఒక హీరోయిన్‌గా మారుతుందని, ఈ కథ చాలా వినూత్నంగా, అడ్వాన్స్‌డ్‌గా ఉందని ఎస్.వి. కృష్ణారెడ్డి వివరించారు. అయితే ఈ కథ విన్న తర్వాత చిరంజీవి కథ చాలా అడ్వాన్స్డ్ గా ఉంది చూద్దాం అన్నారు. కానీ ఆతర్వాత అది పట్టాలెక్కలేదు అని కృష్ణారెడ్డి తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us