నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసి ఇప్పుడు పెద్ద దర్శకుడు అయ్యాడు.. కలవడానికి వెళ్తే..
శుభలేఖ సుధాకర్ ఓ ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలో తనకు ఎదురైన వ్యక్తిగత అనుభవాలను, కెరీర్ ఒడిదుడుకులను పంచుకున్నారు. అలాగే ఓ పెద్ద దర్శకుడు గతంతో తనతో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడని.. అతనిని కలవడానికి వెళ్తే ఊహించని సంఘటన ఎదురైందని తెలిపారు.

ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ సినీ పరిశ్రమలో తన అనుభవాలను, సవాళ్లను, వాటి నుంచి తాను నేర్చుకున్న పాఠాలను ఓ ఇంటర్వ్యూ వివరించారు. ఒక టీవీ సీరియల్ షూటింగ్ సమయంలో, ఒకప్పుడు తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అయ్యాడని తెలిసి, మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్లారట. అయితే, ఆ డైరెక్టర్ బిజీగా ఉన్నారని, “సినిమా షూటింగ్ అంతా అయిపోయింది, వేషాలు ఏమీ లేవు” అని చెప్పారంటూ ఒక వక్తి వచ్చి సుధాకర్‌కు తెలియజేశాడట. ఈ సంఘటనపై సుధాకర్ అసలు బాధపడలేదని, పైగా దానిని అర్థం చేసుకున్నానని చెప్పారు. “ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకోవడం” అనేది ముఖ్యమని ఆయన నొక్కిచెప్పారు. రోజువారీగా ఎంతో మంది నటులు అవకాశాల కోసం వస్తుంటారు కాబట్టి, ఆ డైరెక్టర్‌కు విసుగు వచ్చి ఉండవచ్చని, భోజనం చేసే సమయంలో ఇలాంటి సంభాషణ వచ్చిందని ఆయన వివరించారు.
ఇటువంటి సంఘటనలను తప్పుగా చూడకుండా, వాటిని ఒక పాఠంగా స్వీకరించాలని సుధాకర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అలాగే, ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సోదరి శైలజ గారు, శుభలేఖ సుధాకర్ దంపతులు సినీ రంగంలో అవకాశాల కోసం ఏడున్నర సంవత్సరాల పాటు పడిన కష్టాలను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో దిగ్గజ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారు పరిశ్రమలో ఉన్నప్పటికీ, శైలజ గారికి అవకాశాలు ఎందుకు రాలేదని చాలా మంది ప్రశ్నిస్తారు. దీనికి సమాధానంగా, బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరికీ సిఫార్సులు చేయరని, తన సోదరుడు చరణ్ విషయంలో కూడా ఎప్పుడూ పాడమని చెప్పలేదని తెలిపారు. కేవలం ప్రతిభ ఉన్న వారికే అవకాశాలు వస్తాయని ఆయన నమ్మేవారని, తన సోదరిని తన సంగీత బృందాలలో, కచేరీలలో భాగంగా చేసుకుని మద్దతు ఇచ్చారని సుధాకర్ వివరించారు. కష్టాల కాలంలో తాము ఎలా నెట్టుకొచ్చామో కూడా శుభలేఖ సుధాకర్ పంచుకున్నారు.
ఆ సమయంలో ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులను, కొనుక్కున్న వాటిని ఒకటి తర్వాత ఒకటి అమ్ముకుంటూ జీవితాన్ని కొనసాగించామని తెలిపారు. పనిలేకుండా గడిపిన ఆ ఏడున్నర సంవత్సరాలు తమ ఇద్దరి మధ్య బంధాన్ని, అవగాహనను మరింత పటిష్టం చేసిందని సుధాకర్ అభిప్రాయపడ్డారు. “మనుషులకు అంతా సజావుగా ఉన్నప్పుడు సమస్య ఉండదు. కష్టాలు వచ్చినప్పుడే నిజ స్వరూపాలు బయటికి వస్తాయి,” అని ఆయన అన్నారు. బహుశా తమ ఇద్దరి మధ్య ఈ అవగాహన కోసమే భగవంతుడు ఆ కష్టాలను ఇచ్చాడేమోనని తాను భావిస్తున్నట్లు శుభలేఖ సుధాకర్ పేర్కొన్నారు. ఈ అనుభవాలు తమ జీవితంలో ఎంతో నేర్పాయని ఆయన అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
