
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు నటుడు శివాజీ రాజా. కేవలం సహాయక నటుడిగానే కాదు హీరోగానూ సినిమాలు చేశారు శివాజీ రాజా.. ఓ వైపు వెండి తెరపై సినిమాలతో బిజీగా ఉంటూనే అమృతం సీరియల్ తో బుల్లితెరపై కూడా నవ్వులు పూయించారు. ఇక ఇప్పుడు శివాజీ రాజా హీరో, హీరోయిన్స్ కు తండ్రిగా నటిస్తూ మెప్పిస్తున్నారు. అలాగే పలు ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు ఆయన.. గతంలో శివాజీ రాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈక్రమంలోనే టాలీవుడ్ నటుడు దివంగత శ్రీహరి మరణం, దివంగత దాసరి నారాయణరావుతో తన బంధం, అలాగే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో ఎదురైన అనుభవాలపై అనేక కీలక విషయాలను పంచుకున్నారు. డిస్కో శాంతి శ్రీహరి మరణానికి స్నేహితులే కారణమని చేసిన వ్యాఖ్యలపై శివాజీ రాజా స్పందించారు.
శ్రీహరి మరణానికి స్నేహితులు కారణమన్న డిస్కో శాంతి వ్యాఖ్యలను శివాజీ రాజా ఖండించారు. శ్రీహరి వంటి వ్యక్తికి ఒకరిద్దరు కాదు, ఎంతో మంది స్నేహితులు ఉన్నారని తెలిపారు. తామిద్దరం కెరీర్‌లో కేవలం ఐదారుసార్లు మాత్రమే కలిసి మందు తాగి ఉంటామని పేర్కొన్నారు. తాను శ్రీహరికి పాన్ పరాగ్ మానేయమని సలహా ఇచ్చినా, ఆయన స్టార్‌గా తనకున్న ఒత్తిడి, టెన్షన్ల వల్ల అలవాటు పడి ఉండవచ్చని అన్నారు శివాజీ రాజా. వ్యసనాన్ని మానేయాలనే నిర్ణయం ఆ వ్యక్తిదే కావాలని, లేదా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, గురువులు చెప్పాలని ఆయన అన్నారు. తాను కూడా ధూమపానాన్ని చాలాసార్లు మానేయాలని ప్రయత్నించి చిరంజీవి గారికి మాట ఇచ్చిన తర్వాతే పూర్తిగా మానేసినట్లు వెల్లడించారు.
అలాగే దాసరి నారాయణరావు చివరి రోజుల్లో తనతో మాట్లాడుతూ, శివాజీ లాంటి వాడిని ఇన్ని రోజులు దూరం పెట్టాను” అని బాధపడ్డారని శివాజీ రాజా వెల్లడించారు. తన షార్ట్ టెంపర్ స్వభావం, తనపై వచ్చిన కొన్ని ఫిర్యాదుల కారణంగా దాసరి తనను దూరం పెట్టారని శివాజీ రాజా అన్నారు. తాను దాసరిని గురువుగారు అని పిలుస్తుంటా, తమ బంధం తండ్రీ కొడుకుల అనుబంధంగా ఉంటుంది. దాసరి నారాయణరావు చివరి రోజుల్లో తనను అర్థం చేసుకున్నారని శివాజీ రాజా చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.