
నటుడు, రచయిత జనార్ధన్ రావు ఉరఫ్ జెన్నీ.. ఈ పేరు చెప్తే చాలా మంది గుర్తిపట్టలేకపోవచ్చు కానీ ఆయనను చూస్తే.. మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు ఆయన. చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ నవ్వులు పూయించారు జనార్ధన్ రావు. ఆయన స్క్రీన్ మీద కనిపించేది కొంత సేపే అయినా.. నవ్వులు పూయించి ప్రేక్షకులను అలరించే వారు జనార్ధన్ రావు. వందల సినిమాల్లో కనిపించి ఆకట్టుకున్నారు జనార్ధన్ రావు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. జంధ్యాల గారి అహ నా పెళ్ళంట చిత్రంతో ఆయన సినీ రంగ ప్రవేశం జరిగిందని తెలిపారు. ఈ పాత్ర తొలుత గుండు హనుమంతరావుకు కోసం అనుకున్నారని, స్క్రిప్ట్ సిద్ధంగా లేకపోవడం వల్ల తనకు ఆ అవకాశం దక్కిందని తెలిపారు జనార్ధన్ రావు.
జంధ్యాల గారి మిత్రుడు బి.వి.పట్టాభిరాం ద్వారా జెన్నీని సంప్రదించి, ఆ పాత్రకు ఎంపిక చేశారట. పరుచూరి వెంకటేశ్వర రావు గారి కుమారుడు పరుచూరి రఘుబాబు స్మారకార్థం ఏర్పాటు చేసిన నాటక పోటీలు జెన్నీ కెరీర్‌లో కీలక మలుపు. 30 ఏళ్ల క్రితం జరిగిన ఈ పోటీలలో, ఉత్తమ నటుడు, దర్శకుడు వంటివి కాకుండా, ఆరుగురికి సినీ అవకాశాలు ఇస్తామని ప్రకటించారట. జె.వి.సోమయాజులు, ఎర్రమనేని వీరేంద్రనాథ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఈ పోటీలలో, తల్లావజ్జల సుందరం దర్శకత్వం వహించిన దొంగల బండి నాటకంలో నటించిన జెన్నీని ఆ ఆరుగురిలో ఒకడిగా ఎంపిక చేశారట. ఆ తర్వాత మోహన్ గాంధీ దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావుతో ప్రాణదాత చిత్రంలో కామెడీ ట్రాక్‌లో బ్రహ్మానందం మామగారిగా నటించే అవకాశం వచ్చిందని తెలిపారు. ఈ చిత్రం విజయం సాధించకపోయినా, ఈ పాత్ర ద్వారా ఎందరో సినీ ప్రముఖులతో పరిచయం ఏర్పడి, తనకు సుమారు 50 చిత్రాలలో అవకాశాలు లభించాయని తెలిపారు.
ఇక బి.గోపాల్ దర్శకత్వంలో నాగార్జున నటించిన విజయ్ చిత్రంలో డిఫెన్స్ లాయర్ పాత్రలో కూడా జెన్నీ నటించారు. ఈ.వి.వి.సత్యనారాయణ గారు కూడా జెన్నీ నాటకాలను చూసి, తన చిత్రాలలో అవకాశాలు కల్పించారు. స్టూడియోలు హైదరాబాద్‌కు మారడంతో స్థానిక నటులకు లభించిన అవకాశాలను జెన్నీ అందిపుచ్చుకున్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. దాసరి నారాయణరావు గారితో సూర్యగాడు చిత్రంలో కలిసి పనిచేశానని తెలిపారు. దాసరి గారి పుట్టినరోజున అందరూ ఆయన కాళ్లు మొక్కగా, తాను మాత్రం మొక్కలేదని జెన్నీ తెలిపారు. నాకంటే చిన్నవారని, మీకు దండం పెడితే ఆయుక్షీణం అవుతుందని చెప్పినప్పుడు దాసరి గారు “నాకంటే పెద్దవాడివా నువ్వు.? అని నవ్వుతూ ప్రశ్నించారని ఆ మధుర జ్ఞాపకాన్ని పంచుకున్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..