
సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే నెల రోజుల ముందు నుంచే బజ్ కనిపిస్తుంది.. హంగామా మొదలవుతుంది.. కానీ బ్రో రిలీజ్‌కు ఇంకా రెండు వారాలు కూడా లేదు.. కానీ ఇప్పటి వరకు అంత సందడి కూడా కనిపించడం లేదు. అసలు బ్రో మేకర్స్ ప్లాన్ ఏంటి..? ఈ సినిమా సైలెంట్ కిల్లర్ కాబోతుందా..?లో ఎక్స్‌పెక్టేషన్స్ ఈ సినిమాకు వరంగా మారబోతుందా..? పవన్ కళ్యాణ్ సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాలా..? ఆ బజ్‌కు బాక్సాఫీస్ మోతెక్కిపోతుందంతే..! ఆయన రీ ఎంట్రీ ఇచ్చిన వకీల్ సాబ్ కానీ.. కరోనా టైమ్‌లో వచ్చిన భీమ్లా నాయక్ గానీ ఓ రేంజ్ అంచనాలతో విడుదలయ్యాయి. కనీసం నెల రోజుల ముందు నుంచే వీటి హంగామా షురూ అయింది. కానీ బ్రో విషయంలో మాత్రం అది జరగట్లేదు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ టూర్‌లో బిజీగా ఉన్నారు. పైగా దీన్ని పవన్ సినిమాలా కాకుండా.. సాయి ధరమ్ తేజ్ సినిమాలా ప్రమోట్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. అలా చేస్తేనే అంచనాలు అదుపులో ఉంటాయి. అందుకే ప్రమోషన్స్‌లోనూ సాయి ధరమ్ తేజ్ కనిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని రెండో పాటను తిరుపతిలో అభిమానుల సమక్షంలో విడుదల చేసారు తేజ్.
సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాయడంతో అంచనాలు బాగా పెరిగిపోయాయి. పైగా పవన్ ఉన్నారు కాబట్టి బిజినెస్‌కు కూడా రెక్కలొస్తున్నాయి. నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను 30 కోట్లకు కొన్నట్లు తెలుస్తుంది. అలాగే ఆంధ్రాలోనూ 50 కోట్లకు పైగానే బిజినెస్ జరుగుతుంది. కానీ పవన్ ముందు సినిమాల రేంజ్‌లో దీనికి ప్రమోషన్స్ జరగట్లేదనేది వాస్తవం. పవన్ సినిమా అంటే కచ్చితంగా ఏపీలో తంటాలు తప్పవు. దీనివల్లే గతంలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ నష్టపోయాయి. ఇప్పుడు బ్రో సినిమాకు తప్పకపోవచ్చనే సంకేతాలే ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఒక్కటి మాత్రం నిజం.. అంచనాలు ఎంత తక్కువగా ఉంటే.. బ్రోకు అంత లాభం.