
తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అలనాటి నటి గిరిజ జీవితం ఎన్నో మలుపులు, వైభవం, చివరికి విషాదంతో నిండిన ఒక సుదీర్ఘ ప్రస్థానం. ఆమె నట ప్రస్థానం మొదలై నేటికి 75 సంవత్సరాలు కావస్తుంది. 1950లో అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) సరసన పరమానందయ్య శిష్యులు చిత్రంలో కథానాయికగా తెరంగేట్రం చేసిన గిరిజ, ఆ తర్వాత పలు చిత్రాలలో ప్రధాన అలాగే సహాయ నటిగా నటించినా, ఆమెను చాలా మంది హాస్య నటిగానే గుర్తు పెట్టుకున్నారు. ముఖ్యంగా హాస్య నటుడు రేలంగి గారితో ఆమె జోడీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. గిరిజ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో, రేలంగి గారు అప్పటికే ఒక సీనియర్ అలాగే అగ్రశ్రేణి హాస్య నటుడు. వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం గిరిజకు సినిమా అవకాశాలను తెచ్చిపెట్టింది. క్రమంగా ఆమె తనకంటూ ఒక స్టార్‌డమ్‌ను సంపాదించుకుని, సినిమాల మీద సినిమాలు చేస్తూ, ఆర్థికంగా బలపడ్డారు. ఆమె స్వతహాగా ఆడంబరంగా జీవించాలని కోరుకునే స్వభావం. ఈ క్రమంలో ఆమె విలువైన ఆస్తులు, ఖరీదైన కార్లు, చెన్నైలోని పోయస్ గార్డెన్‌లో ఒక విలాసవంతమైన ఇల్లు, బంగారం, నగానట్రా సమకూర్చుకున్నారు. పోయస్ గార్డెన్‌లో ఇల్లు ఉండటం అనేది అప్పట్లో సూపర్ స్టార్ రజనీకాంత్, జయలలిత వంటి వారికి మాత్రమే సాధ్యం. దీనిని బట్టి గిరిజ సంపద, స్టార్‌డమ్ ఏ స్థాయిలో ఉండేవో అంచనా వేసుకోవచ్చు. ఆమె ఇల్లు ఏసీలతో, బంగారు తివాచీల మాదిరి అలంకరణతో, ఖరీదైన వస్తువులతో ఒక మహారాణి నివాసంలా ఉండేది.
గిరిజ, రేలంగి కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు పండగే. వీరిద్దరూ కలిసి నటించిన సన్నివేశాలు, పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచేవి. కులగోత్రాలు సినిమాలో కాశీకి పోయాను రామా హరి వంటి పాటలు వీరి హాస్యాన్ని, కెమిస్ట్రీని స్పష్టం చేస్తాయి. రేలంగి పాడుతుంటే గిరిజ ఆటపట్టించడం, ఇంగ్లీషులోన మ్యారేజీ అంటూ రేలంగి స్టెప్పులేస్తే వెనుక ఉండి నవ్వించడం వంటివి వీరి కాంబినేషన్‌లో సాధారణం. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఆమె నట ప్రస్థానం సాగింది. ఆత్మ బంధువు, జగదేక వీరుని కథ, పాతాళ భైరవి, కులగోత్రాలు, ఇల్లరికం, నమ్మిన బంటు, వెలుగునీడలు, ఆరాధన, ప్రేమించి చూడు వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలలో ఆమె తన నటనతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు.
సినిమాల్లో పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు, గిరిజ, రేలంగి మధ్య సాన్నిహిత్యం చాలా ఎక్కువగా ఉండేది. అయితే గిరిజ మరొక వ్యక్తిని ఇష్టపడి, అసిస్టెంట్ డైరెక్టర్ సన్యాసిరాజును పెళ్లి చేసుకున్నారు. వారికి పుట్టిన పాపే సలీమా. మొదట్లో కలకత్తా కాళీ మీద భక్తితో కాళేశ్వరి దేవి అని పేరు పెట్టినా, తర్వాత చెన్నై మౌంట్ రోడ్‌లోని దర్గాపై ఉన్న అభిమానంతో ఆ పేరు సలీమాగా మారింది. గిరిజ జీవితం వైభవంగా సాగుతున్న సమయంలో, ఆమె వివాహం చేసుకున్న సన్యాసిరాజు ఆమె జీవితాన్ని తారుమారు చేశాడు. అతను గిరిజ ఆస్తులతో జూదం ఆడటం, మద్యపానం, స్నేహితులతో పేకాట, గుర్రపు పందేలు వంటి వ్యసనాలకు బానిసయ్యాడు. అంతేకాక, సినిమాలు నిర్మించి భారీ నష్టాలు తెచ్చాడు. చివరికి మిగిలిన సొమ్మంతా తీసుకుని గిరిజను నట్టేట ముంచి అక్కడి నుంచి జారుకున్నాడు. దాంతో గిరిజ అప్పుల బాధలు భరించలేక తన ఖరీదైన భవంతిని కూడా అమ్మి, కూతురు సలీమాతో కలిసి ఒక చిన్న అపార్ట్‌మెంట్‌కు మారాల్సి వచ్చింది. ఆమె కూతురు కూడా పలు సినిమాల్లో నటించింది. సినిమాల్లో ఎంతో వైభవంగా సాగిన ఆమె జీవితం చివరిలో మాత్రం డబ్బును పోగొట్టుకొని సాధారణ జీవితం గడిపి చనిపోయారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి