
బెంగళూరు రేవ్ పార్టీ.. టాలీవుడ్‌ని షేక్ చేస్తోంది. డ్రగ్స్ తీసుకున్న వారిలో 86 మంది తెలుగు వాళ్లే ఉండటం… అందులోను సినిమా ఇండస్ట్రీ వారు ఎక్కువగా ఉండటంతో సాధారణంగానే ఈ కేసుపై ఇండస్ట్రీ పెద్దలు ఒక కన్నేసి ఉంచారు. అయితే ఈసారి ఇండస్ట్రీ డ్రగ్స్ లింకులు బెంగళూరు వరకు వెళ్లాయి. రాష్ట్ర పోలీసులు కూడా బెంగుళూరు పార్టీని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో పోలీసుల నెక్స్ట్ స్టెప్ చాలా కీలకంగా మారనుంది. ఇలాంటి కేసులలో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే వారిని బాధితులుగా మాత్రమే పరిగణిస్తారు. కానీ బెంగళూరు లాంటి ప్రాంతాల్లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన సినిమా తారలను ఆ రాష్ట్ర పోలీసులు గతంలో ఎన్నోసార్లు అరెస్టులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు ఎలా ముందుకు వెళతారన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన కోసం ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చర్యలు చేపడుతుంది. ఇండస్ట్రీలోని వారి పేర్లు ఎప్పుడు తెరమీదకి వచ్చినా, వారికి కేవలం నోటీసుల వరకు మాత్రమే విచారణ పరిమితమవుతుంది. అయితే తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పట్టుదలగా ఉండటంతో ఈసారి జరిగే విచారణ పకడ్భందీగా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా నమోదైన డ్రగ్స్ కేసులో బెంగళూరు పోలీసులు నటి హేమతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన మరికొందరికి నోటీసులు ఇవ్వనున్నారు. నోటీసులు అందుకున్న వారు తప్పనిసరిగా బెంగళూరుకు వెళ్లి పోలీస్ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇదే ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ హేమ పోలీసు విచారణ హాజరైతే ఆమె ఎలాంటి విషయాలు బయటపెడతారనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. హేమ వ్యవహరంలో ఆమెకు ఎవరు డ్రగ్స్ అలవాటు చేశారు ? ఆమె ఎప్పటి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఆమె బ్యాచ్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే అంశాలపై బెంగుళూరు పోలీసులు కూపీ లాగుతున్నారు. దీంతో హేమ విచారణపై ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై తెలంగాణ నార్కోటిక్ పోలీసులు దృష్టిసారించారు. సాధారణంగా తెలంగాణలో నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఏర్పడిన తర్వాత ఎక్కడ డ్రగ్స్ మూలాలు దొరికిన వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఈ సమయంలో బెంగళూరు రేవ్ పార్టీలోనూ ఎక్కడి నుండి డ్రగ్స్ ఆ పార్టీకి వెళ్లాయనే వ్యవహారంలో హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు ఆరాతీస్తున్నారు. ఈ పార్టీలో దొరికింది తెలుగు వారు ఎక్కువగా ఉండటంతో వారి వివరాలను సైతం నార్కోటిక్ పోలీసులు సేకరిస్తున్నారు. ఇలా ఒక్క కేసుతో ఎన్నో చిక్కుముడులు వీడే అవకాశం ఉండటంతో.. తెలంగాణ నార్కోటిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ పార్టీకి హాజరైన డ్రగ్ కన్జ్యూమర్ల వివరాలు నార్కోటిక్ పోలీసుల చేతికి రానున్నాయి. దీంతోపాటు ఈ పార్టీకి డ్రగ్స్ సప్లై చేసిన పెడ్లర్లపైనా దృష్టి పెట్టనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.