
మూవీ రివ్యూ: హనుమాన్
నటీనటులు: తేజ సజ్జ, అమృత అయ్యర్, వినయ్ రాయ్ , వరలక్ష్మి శరత్ కుమార్ , గెటప్ శీను , వెన్నెల కిషోర్, సముద్రఖని తదితరులు
సంగీతం: హరి గౌర – అనుదీప్ దేవ్ – కృష్ణ సౌరభ్
సినిమాటోగ్రాఫర్: శివేంద్ర దాశరథి
కథ – స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్ విల్
నిర్మాత: కె.నిరంజన్ రెడ్డి
రచన- దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన సినిమా హనుమాన్. ఈ సంక్రాంతికి చాలా చర్చకు దారి తీసిన సినిమా ఇది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..
కథ:
అంజనాంద్రి అనే ఊర్లో హనుమంతు (తేజా సజ్జా) అల్లరి చిల్లరిగా తిరిగే అబ్బాయి. చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేస్తుంటాడు. అదే ఊళ్లో మాస్టర్ కూతురు మీనాక్షిని (అమృత అయ్యర్) చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు. మరోవైపు హనుమంతు అక్క అంజనమ్మ (వరలక్ష్మి శరత్ కుమార్) తమ్ముడుతో పాటు అదే ఊర్లో ఉంటుంది. ఆ ఊరిపై పాలెగాళ్లు దౌర్జన్యం చేస్తుంటారు. వాళ్లని ఎదిరించడానికి ఎవరికి ధైర్యం ఉండదు. ఆ సమయంలో బలహీనంగా ఉండే హనుమంతు పాలెగాళ్లను ఎదిరించే క్రమంలో సముద్రంలో పడిపోతాడు. సముద్రంలో పడిన హనుమంతుకు దివ్యమైన రుధిరమణి లభిస్తుంది. ఆ తర్వాత ఊహించిన విధంగా అద్బుత శక్తి అతడికి లభిస్తుంది. అయితే అతనికి ఉన్నట్టుండి అన్ని శక్తులు ఎలా వచ్చాయని తెలుసుకోవడానికి సూపర్ మాన్ అవ్వాలనుకుంటున్న మైఖేల్ (వినయ్ రాయ్) ఆ గ్రామానికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ..
కథనం:
ఒక చిన్న సినిమా చేయడం కాదు.. దాని గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునేలా చేయడం గొప్ప. ఈ విషయంలో ప్రశాంత్ వర్మ సూపర్ సక్సెస్ అయ్యాడు. హనుమాన్ గురించి ఇండస్ట్రీ అంతా మాట్లాడుకునేలా చేసాడు. సినిమా చూసిన తర్వాత వాళ్లు ఇచ్చిన హైప్ కరెక్టే అనిపించింది.. 400 ప్రీమియర్స్ ఏ ధైర్యంతో వేస్తున్నారు అనుకున్నారు.. సినిమా చూశాక వాళ్ళ ధైర్యం హనుమాన్ అని అర్థమైంది. కథగా చూసుకుంటే చాలా సింపుల్. ఊళ్లో ఒక మామూలు కుర్రాడికి అనుకోకుండా అతీత శక్తులు వస్తాయి.. ఆ తర్వాత వాడు ఏం చేశాడు అనేది కథ. దీన్ని స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు ప్రశాంత్ వర్మ. తొలి అరగంట కథలోకి వెళ్లడానికి కాస్త టైం తీసుకున్నాడు. కానీ ఒకసారి హీరోకి శక్తులు వచ్చిన తర్వాత ఎక్కడా ఆగలేదు. అక్కడ హీరో ఏం చేస్తున్నా కూడా వెనకాల హనుమాన్ కనిపిస్తుంటాడు. ఫస్ట్ హాఫ్ లో విలన్లను కొట్టి వాళ్లందరి మీద తేజ కూర్చునే హనుమాన్ రిఫరెన్స్ సీన్ సూపర్. సెకండ్ హాఫ్ కూడా చాలా వరకు సన్నివేశాలు బాగానే కనెక్ట్ అయ్యాయి. క్లైమాక్స్ 20 నిమిషాలు థియేటర్లలో పూనకాలు ఖాయం. హనుమంతుల వారు దర్శనమిచ్చినప్పుడు థియేటర్ అంతా జై శ్రీరామ్ కేకలతో మారుమోగిపోయింది. హనుమంతుడి శక్తులను ప్రశాంత్ వర్మ చూపించిన తీరు నిజంగానే అభినందనీయం. ఆయనను స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానంతో యావరేజ్ అనుకున్న సినిమా కాస్త బ్లాక్ బస్టర్ రేంజ్ కి వెళ్ళిపోయింది. మన హనుమంతుడి కంటే పెద్ద సూపర్ హీరో ప్రపంచంలో లేడు అనేది అద్భుతంగా చూపించాడు. కథ రొటీన్ గానే ఉన్నా ప్రశాంత్ సక్సెస్ అయ్యింది హనుమాన్ ను ప్రజెంట్ చేసిన విధానంలోనే.
నటీనటులు:
తేజ సజ్జా తన వరకు పూర్తి న్యాయం చేశాడు. తనకు ఉన్నంతవరకు కథకు సాయం చేశాడు.అమృత అయ్యర్ పర్లేదు.. వరలక్ష్మీ శరత్ కుమార్ ఓకే. గెటప్ శ్రీను క్యారెక్టర్ బాగుంది. అలాగే వినయ్ రాయ్ కూడావిలన్ గా మెప్పించాడు. దివంగత రాకేష్ మాస్టర్ కామెడీ చాలా బాగుంది. ఆయనకు ఉన్న అద్భుతంగా పేలాయి.
టెక్నికల్ టీం:
హనుమాన్ సినిమాకు నూటికి నూరు మార్కులు వేయాల్సింది టెక్నికల్ టీంకే. మ్యూజిక్ చాలా బాగుంది. పాటలు కూడా ఆకట్టుకుంటాయి. ఆర్ఆర్ అదిరిపోయింది. ఎడిటింగ్ కూడా చాలావరకు వేగంగానే వెళ్ళిపోయింది. అక్కడక్కడ కొన్ని స్లో సన్నివేశాలు ఇబ్బంది పెడతాయి. సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. దర్శకుడిగా ప్రశాంత్ వర్మ మేకింగ్ హనుమాన్ సినిమాకు ప్రధాన హైలెట్.
పంచ్ లైన్:
ఓవరాల్ గా హనుమాన్.. మన సూపర్ మాన్..