Family Drama: క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా టర్న్ అయ్యాడు సుహాస్. హీరో ఫ్రెండ్‌గా చాలా సినిమాల్లో కనిపించి ఆకట్టుకున్న సుహాస్.. కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారాడు. ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. నేచురల్ యాక్టింగ్‌తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు సుహాస్. ఇప్పుడు హీరోగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు. మొదటి సినిమా మంచి లవ్ స్టోరీతో వచ్చిన సుహాస్ ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ తో భయపెట్టడానికి సిద్దమయ్యాడు. ఆ చిత్రమే సుహాస్ హీరోగా నటించిన “ఫ్యామిలీ డ్రామా”. ఈ సినిమా ఈ నెల 29న ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. మెహెర్ తేజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. “ఫ్యామిలీ డ్రామా” చిత్ర ట్రైలర్ ను ‘సోని లివ్’ రిలీజ్ చేసింది. ఆ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే..
బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆసక్తికరంగా సాగింది ఫ్యామిలీ డ్రామా ట్రైలర్. ‘ఈత రానివాడు సముద్రాన్ని తిట్టుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుందో.. వినడం రానివాడు సంగీతం గురించి మాట్లాడినా అంతే అసహ్యంగా ఉంటుంది’ అని సుహాస్ చెప్పిన డైలాగ్ మెప్పిస్తుంది. సుహాస్ హత్యలు చేసే సన్నివేశాలు ఉత్కంఠ పెంచాయి. ప్రతి చిన్న విషయానికి తండ్రి బూతులు తిడుతున్నాడనే కారణంగా ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఓ అబ్బాయి, తన ఇంట్లో పరిస్థితులు నచ్చక బయటకి వచ్చేసిన ఓ అమ్మాయి.. ఈ ఇద్దరూ ఎలా కలిశారు? వీరికి సుహాస్ ఎలా సాయపడ్డాడు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. టెక్నికల్ అంశాలతో పాటు ఆర్టిస్టుల పర్మార్మెన్స్ లు ఇంటెన్స్ గా ఉన్నాయి. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో తేజా కాసరపుతో కలిసి మెహెర్ తేజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తేజ కాసరపు, పూజా కిరణ్, అనూష నూతుల, శ్రుతి మెహర్, సంజయ్ రథా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :