ఫ్రాన్స్ వేదికపై మెరిసిన తొలి తెలుగు టీజర్.. విడుదలకు ముందే చరిత్ర సృష్టించిన సూపర్‌‌స్టార్!

భారతీయ చలనచిత్ర స్థాయిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన ఆ దిగ్గజ దర్శకుడు, ఇప్పుడు మరో విజువల్ వండర్‌తో మన ముందుకు వస్తున్నారు. ఈసారి ఆయనకు తోడుగా ఉన్నారు టాలీవుడ్ సూపర్ స్టార్. వీరిద్దరి కలయికలో సినిమా వస్తోందంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి.

ఫ్రాన్స్ వేదికపై మెరిసిన తొలి తెలుగు టీజర్.. విడుదలకు ముందే చరిత్ర సృష్టించిన సూపర్‌‌స్టార్!
Star Hero And Director

Updated on: Jan 08, 2026 | 7:00 AM

ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నా, అప్పుడే రికార్డుల వేట మొదలుపెట్టింది. అసలు సినిమా విడుదల కాకముందే, ఏకంగా పారిస్ వంటి అంతర్జాతీయ వేదికపై ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. యూరప్ ఖండంలోనే అతిపెద్దదిగా పేరుగాంచిన ఒక చారిత్రాత్మక థియేటర్‌లో ఈ సినిమా టీజర్ ప్రదర్శితమై సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ సినిమా మరెవరో కాదు.. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’. ఈ సినిమా టీజర్ సృష్టించిన ఆ సంచలనం ఏంటో తెలుసుకుందాం..

పారిస్ వేదికగా అరుదైన గౌరవం..

రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ టీజర్ తాజాగా పారిస్‌లోని ప్రతిష్టాత్మకమైన ‘లే గ్రాండ్ రెక్స్’ థియేటర్‌లో ప్రదర్శితమైంది. ఇది యూరప్‌లోనే అత్యంత భారీ, ప్రసిద్ధ థియేటర్. ఇలాంటి ఒక చారిత్రాత్మక స్క్రీన్‌పై టీజర్ ప్రదర్శితమైన తొలి భారతీయ సినిమాగా ‘వారణాసి’ అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ గౌరవం దక్కడంపై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తూ ఫ్రాన్స్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఘనతతో రాజమౌళి క్రేజ్ కేవలం భారత్‌కే పరిమితం కాదని, ప్రపంచవ్యాప్తంగా ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారని మరోసారి నిరూపితమైంది.

Maheshbabu N Rajamouli

రికార్డుల వేట మొదలు..

రాజమౌళి సినిమా అంటేనే రికార్డులు తిరగరాయడం ఖాయం. ‘వారణాసి’ విషయంలో ఇది షూటింగ్ ప్రారంభంలోనే రుజువవుతోంది. ఇటీవలే విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఇప్పుడు అంతర్జాతీయంగా దక్కిన ఈ గుర్తింపు సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. మహేష్ బాబు అభిమానులు ఈ అప్డేట్‌తో పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబును గతంలో ఎన్నడూ చూడని విధంగా, ఒక సరికొత్త మేకోవర్‌లో రాజమౌళి చూపించబోతున్నారని టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. విమర్శలు ఎలా ఉన్నా, సినిమా అవుట్‌పుట్ మాత్రం అద్భుతంగా ఉండబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Varanasi Poster

శ్రీరామ నవమి కానుకగా..

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి, భారీ ఎత్తున ప్రమోషన్లు నిర్వహించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ సినిమాను 2027 ఏప్రిల్ 9న శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రకు ఆధ్యాత్మిక అంశాల జోడింపు ఉండటంతో, ఆ రోజున విడుదల చేయడం వల్ల సినిమాకు మరింత ఆధ్యాత్మిక బలం చేకూరుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

రాజమౌళి ఇప్పటివరకు తీసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో, ఈ సినిమా కూడా మరోసారి వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తుందని జనాలు అభిప్రాయపడుతున్నారు. ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పే దిశగా ‘వారణాసి’ అడుగులు వేస్తోంది. కేవలం టీజర్‌తోనే పారిస్ వరకు వెళ్లిన ఈ సినిమా, ఇక థియేటర్లలోకి వస్తే ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.