RRR Movie Review: రాజమౌళి మార్క్ సినిమా ట్రిపుల్‌ ఆర్‌!

| Edited By: Rajeev Rayala

Mar 25, 2022 | 1:20 PM

RRR Movie Review: ప్యాన్‌ ఇండియా రేంజ్‌లోనే కాదు, ప్యాన్‌ వరల్డ్ రేంజ్‌లో జనాలు వెయిట్‌ చేసిన సినిమా ట్రిపుల్‌ ఆర్‌. బాహుబలి తీసిన డైరక్టర్‌, ఇద్దరు పెద్ద ఫ్యామిలీల స్టార్‌ హీరోలు చేసిన మల్టీస్టారర్‌..

RRR Movie Review: రాజమౌళి మార్క్ సినిమా ట్రిపుల్‌ ఆర్‌!
Rrr
Follow us on

ప్యాన్‌ ఇండియా రేంజ్‌లోనే కాదు, ప్యాన్‌ వరల్డ్ రేంజ్‌లో జనాలు వెయిట్‌ చేసిన సినిమా ట్రిపుల్‌ ఆర్‌. బాహుబలి తీసిన డైరక్టర్‌, ఇద్దరు పెద్ద ఫ్యామిలీల స్టార్‌ హీరోలు చేసిన మల్టీస్టారర్‌, 500 కోట్లకు పైగా బడ్జెట్‌, అందులోనూ చారిత్రక పురుషుల పేర్లతో అల్లుకున్న ఫిక్షనల్‌ స్టోరీ.. ఎన్నో, ఎన్నెన్నో అంచనాల మధ్య విడుదలైంది ట్రిపుల్‌ ఆర్‌.

సినిమా: ఆర్‌ ఆర్‌ ఆర్‌

నటీనటులు: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, ఆలియా, ఒలివియామోరిస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని, యాలిసన్‌ డూడీ, రే స్టీవన్‌సన్‌, ఛత్రపతి శేఖర్‌, రాజీవ్‌ కనకాల, రాహుల్‌ రామకృష్ణ తదితరులు

స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రాజమౌళి

కథ: విజయేంద్రప్రసాద్‌

మాటలు: సాయిమాధవ్‌ బుర్రా

కెమెరా: కె.కె.సెంథిల్‌కుమార్‌

ఎడిటింగ్‌: ఎ.శ్రీకర్‌ ప్రసాద్‌

ప్రొడక్షన్‌ కంపెనీ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్

నిర్మాత: డి.వి.వి.దానయ్య

రిలీజ్‌ డేట్‌: మార్చి 25, 2022

రాజమౌళి విడుదల చేసిన ట్రైలర్‌ని, పాటల్లోని పదాలను గమనిస్తే ట్రిపుల్‌ ఆర్‌ కథ గురించి ఎవరైనా ఇట్టే ఓ ఐడియాకి వచ్చేయొచ్చు.
స్కాట్‌ దొర భార్య ముచ్చటపడి తీసుకెళ్లిన పిల్ల మల్లి. ఆ పిల్ల గోండ్ల పిల్ల. వాళ్లకి కాపలా భీమ్‌ (ఎన్టీఆర్‌). ఎలాగైనా మల్లిని కాపాడుకుని తీసుకొచ్చుకోవాలన్నది భీమ్‌ ఆశయం. అదే ఆశయంతో ఢిల్లీలో అడుగుపెడతాడు. అక్కడ బ్రిటిష్‌ వారి దగ్గర పోలీస్‌గా పనిచేస్తుంటాడు రాజు. భీమ్‌ని పట్టుకుంటే ప్రమోషన్‌ దక్కుతుందన్నది రాజు కోరిక. భీమ్‌ ఎలా ఉంటాడో తెలియదు. ఆ తెలియని తనానికి తోడు, రాజుకి, భీమ్‌కి మధ్య స్నేహం కుదురుతుంది. తీరా తను వెతుకుతున్న భీమ్‌ ఇతనే అని తెలియగానే రాజు పరిస్థితి ఏంటి? తండ్రి దగ్గర శిక్షణ పొందిన రామ్… రాజుగా ఎలా మారాడు? అతనికి ధైర్యంగా నిలిచిన సీత… భీమ్‌కి ఎలా పరిచయమైంది? మల్లి కోసం భీమ్‌, మట్టికోసం రామ్‌ చేసిన పోరాటానికి క్లైమాక్స్ ఏంటి? నక్కల వేట ఎంత సేపు, కుంభస్థలాన్ని కొట్టాలనుకున్న వారి కల నెరవేరిందా? ఆదిలాబాద్‌ అడవుల నుంచి భీమ్‌, మన్యం నుంచి రామ్‌ వెళ్లి యమునా తీరంలో చేసిన సోపతి సంగతులు ఎలా ఉన్నాయి… అనేది స్క్రీన్‌ మీద చూడాల్సిందే.

ప్రతి షాట్‌నీ, ప్రతి సీన్‌నీ ఇంట్రడక్షన్‌ సీన్‌లా తీయాలనే ఉత్సుకత ఈ మధ్య మన స్క్రీన్స్ మీద చాలా గట్టిగా కనిపిస్తోంది. ట్రిపుల్‌ ఆర్‌ లో కనిపించింది కూడా అదే. సినిమా మొదలయ్యీ కాగానే ట్రిపుల్‌ ఆర్‌కి ఇచ్చిన ఎక్స్ ప్లనేషన్‌ బావుంది. కథ, నిప్పు, నీరూ… అంటూ చెప్ప దలచుకున్న విషయాన్ని మూడు అధ్యాయాలుగా విడదీసుకుని, ఒకదానితో ఒకదానికి లింకు కలుపుతూ, ఎక్కడికక్కడ ఇచ్చిన క్లారిటీ మెప్పిస్తుంది.

గురి తప్పని పోలీసుగా రామ్‌చరణ్‌ ఇంట్రడక్షన్‌, తోడేలు కోసం ఎర వేసి పులిని పట్టిన తెగువ ఉన్న వ్యక్తిగా భీమ్‌ ఇంట్రడక్షన్ సీన్లు అద్భుతంగా ఉన్నాయి. చుట్టూ ఎంత మంది ఉన్నా ఫోకస్‌ తప్పని వ్యక్తిగా రామ్‌చరణ్‌ ఇంటెన్స్ లుక్స్ ఆకట్టుకుంటాయి. అలాగే ఎదురుగా నిలుచుంది పులే అయినా, దానికన్నా వేగంగా పరుగులు తీసి స్క్రీన్‌ మీద స్పీడుతో పాటు ప్రేక్షకుల గుండె దడ పెరిగేలా చేశాడు తారక్‌.

అర్థం చేసుకునే మనుషుల మధ్య మాటలు అక్కర్లేదు, మౌనం కూడా అందంగానే విషయాన్ని కన్వే చేస్తుందన్న థీమ్‌తో వాళ్లిద్దరి పరిచయాన్ని అందంగా చూపించారు. అక్కడి నుంచి ఇద్దరు హీరోల మధ్య వచ్చే సన్నివేశాలు, జెన్నికి భీమ్‌ దగ్గర కావడానికి రాజు చేసే సాయం.. ఇలా ప్రతిదీ బావుంటుంది. ముఖ్యంగా మల్లిని రెస్క్యూ చేయడానికి భీమ్‌ క్రూరమృగాలను తీసుకుని రావడం, పార్టీలో వాటితో దాడి చేయించే ఎపిసోడ్‌ హైలైట్‌ అవుతుంది.
అజయ్‌ దేవ్‌గణ్‌ ఎపిసోడ్‌ కాసేపే ఉన్నా, సింహాద్రి సినిమా థీమ్‌ని గుర్తు చేస్తుంది. పది మంది బాగుకోసం చనిపోవడానికి సిద్ధపడే బాబా పాత్రలో అజయ్‌ దేవ్‌గణ్‌ నటించారు.
ఆలియా సీత పాత్రకు న్యాయం చేశారు. శ్రియ కాసేపే కనిపించినా స్క్రీన్‌ మీద ప్లెజెంట్‌గా కనిపించారు. సముద్రఖని రోల్‌ కన్విన్సింగ్‌గా ఉంది.
యాక్షన్‌ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌. ఎక్కడికక్కడ షాట్‌ మూడ్‌ని ఎలివేట్‌ చేసేలా సెట్లు, వాటికి తగ్గ రంగులు బావున్నాయి.

ఈ సినిమాకు అతి పెద్ద ఎసెట్‌ కీరవాణి సంగీతం. పాటల్లోనూ, నేపథ్యసంగీతంతోనూ సినిమాకు ఊపిరిపోశారు.
పేరుకు చారిత్రక పురుషుల పేర్లు వాడుకున్నప్పటికీ ఎక్కడా చరిత్ర జోలికి పోలేదు మేకర్స్. ఆద్యంతం కల్పిత కథతో సినిమాను నడిపించారు. భీమ్‌ ముస్లిం గెటప్‌ ఎందుకు వేసినట్టు? రామరాజు పోలీసుగా ఎందుకు ఉన్నట్టు, ఒకరు బండి మీద, ఇంకొకరు గుర్రం మీద వెళ్లడానికి రీజన్‌ ఏంటి? ఇలాంటి విషయాలను అతికించినట్టు కాకుండా, జాగ్రత్తగా కథలో చొప్పించారు. క్లైమాక్స్ ఫైట్‌ మెప్పిస్తుంది.

లొకేషన్లు, కెమెరా యాంగిల్స్, కాస్ట్యూమ్స్, సాయిమాధవ్‌ బుర్రా డైలాగులు అన్నీ కథకు తగ్గట్టున్నాయి.
ఇద్దరు హీరోలున్నప్పుడు, ఇద్దరికీ పర్ఫెక్ట్ స్క్రీన్‌ స్పేస్‌ ఇవ్వాల్సినప్పుడు.. చాలా సందర్భాల్లో కథ డిమాండ్‌ మేరకే రాజమౌళి మొగ్గు చూపినట్టు అర్థమవుతుంది. హీరోలు ఇద్దరి మధ్య నిజ జీవితంలో ఉన్న స్నేహం స్క్రీన్‌ మీద ఎలివేషన్‌ కూడా కూడా బాగానే ఉపయోగపడింది. లోతుల్లోకెళ్లి లాజిక్కులు తీయకుండా, ఎమోషన్స్ లేవని కంప్లయింట్‌ చేయకుండా, సరదాగా కల్పిత కథను చూస్తున్నామనే భావనతో చూస్తే పక్కా కమర్షియల్‌ సినిమా ట్రిపుల్‌ ఆర్‌. ఎన్ని హంగులున్నా, ఒక్క మాటలో చెప్పాలంటే రాజమౌళి మార్క్ సినిమా ట్రిపుల్‌ ఆర్‌.

– డా. చల్లా భాగ్యలక్ష్మి

మరిన్ని ఇక్కడ చదవండి :

RRR Movie Release Live: సత్తా చాటుతున్న ఆర్ఆర్ఆర్.. బాక్సాఫీస్ పై కొనసాగుతోన్న దండయాత్ర