Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SR Kalyana Mandapam Review: కల్యాణ మండపం కాసులు కురిపిస్తుందా?

SR Kalyanamandapam Movie Review: థియేటర్లకు జనాలు రాక వెలవెలా పోతున్న ఈ టైమ్‌లో క్రౌడ్‌ పుల్లర్‌గా ఎస్‌ ఆర్‌ కల్యాణమండపం నిలుస్తుందా?

SR Kalyana Mandapam Review: కల్యాణ మండపం కాసులు కురిపిస్తుందా?
SR Kalyana Mandapam
Follow us
Janardhan Veluru

|

Updated on: Aug 06, 2021 | 2:47 PM

(- డా. చల్లా భాగ్యలక్ష్మి, టీవీ9 తెలుగు, ET డెస్క్)

సినిమా: ఎస్‌ ఆర్‌ కల్యాణమండపం నటీనటులు: కిరణ్‌ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సాయికుమార్‌, తులసి, సుధ, తనికెళ్ల భరణి తదితరులు దర్శకత్వం: శ్రీధర్‌ గాదె సంగీతం: చైతన్య భరద్వాజ్‌ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: కిరణ్‌ అబ్బవరం నిర్మాతలు: ప్రమోద్‌, రాజు

బాగా బతికిన కుటుంబం… తినడానికి తిండికి తక్కువుండదు. కానీ చుట్టూ అప్పులుంటాయి, చుట్టాల చూపులో చులకన ఉంటుంది. దాన్నుంచి బయటపడాలంటే ఆ ఇంట్లో ఎవరో ఒకరు ముందుకు రావాలి. ముందుకొచ్చిన వ్యక్తి హీరో అవుతాడు. ఎస్‌ ఆర్‌ కల్యాణమండపం సినిమాలో కల్యాణ్‌లాగా! ఈ శుక్రవారం టాలీవుడ్‌లో ఏకంగా ఏడు సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. వాటిలో బజ్‌ తెచ్చుకున్న సినిమా ఒక్కటే… ఎస్‌ ఆర్‌ కల్యాణమండపం. థియేటర్లకు జనాలు రాక వెలవెలా పోతున్న ఈ టైమ్‌లో క్రౌడ్‌ పుల్లర్‌గా ఎస్‌ ఆర్‌ కల్యాణమండపం నిలుస్తుందా?

కథ కడపలో బాగా బతికిన కుటుంబం ఎస్‌ ఆర్‌ కల్యాణమండపం యజమానులది. ఆ ఇంటి పెద్దాయన చనిపోతాడు. ఆయన కొడుకు ధర్మ (సాయికుమార్‌) పెద్దగా బాధ్యత తెలిసిన వ్యక్తి కాదు. పైగా తాగుడుకు బానిసవుతాడు. ధర్మ భార్య శాంతి (తులసి)కి ఈ విషయంలో ఆయన మీద కోపం ఉంటుంది. వాళ్లబ్బాయి కల్యాణ్‌ (కిరణ్‌ అబ్బవరం) బీటెక్‌ చదువుతుంటాడు. తల్లి మాట మీద గురి ఉన్న అబ్బాయి. అయితే తండ్రితో మాట్లాడడు. కల్యాణ్‌, ధర్మ ఎందుకు మాట్లాడుకోరన్న విషయం ఎవరికీ తెలియదు. అదే ఊరికి చెందిన సింధు (ప్రియాంక జవాల్కర్‌) ని ఇష్టపడతాడు కల్యాణ్‌. ఆమె తండ్రి (శ్రీకాంత్‌ అయ్యంగార్‌) వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ధర్మకి కొంత డబ్బు ఇచ్చి ఎస్‌ ఆర్‌ కల్యాణమండపం కాగితాలు తీసుకుంటాడు అతను. ఆ తర్వాత ఏమైంది? తండ్రి కల్యాణ మండపాన్ని తాకట్టు పెట్టిన విషయం కల్యాణ్‌కి తెలిసిందా? కల్యాణ్‌ టేకప్‌ చేసిన ప్రాజెక్ట్ ఏంటి? దానికి దారి తీసిన తల్లి కోరిక ఏంటి? కన్న తండ్రితో కల్యాణ్‌ మాట్లాడకపోవడం వెనుక రీజన్‌ ఏంటి? అనేది మిగిలిన కథ.

నటీనటులు కిరణ్‌ అబ్బవరం గత సినిమాలతో పోలిస్తే స్క్రీన్‌ మీద ఎమోషన్స్ ని బాగానే పలికించారు. సింధు కేరక్టర్‌లో ప్రియాంక జవాల్కర్‌ అక్కడక్కడా గ్లామర్‌ మెరుపులు కురిపించినా, నటనకు స్కోప్‌ ఉన్న సీన్స్ కూడా ఉన్నాయి. ధర్మ కేరక్టర్‌లో సాయికుమార్‌ ఈజ్‌తో చేశారు. శాంతి కేరక్టర్‌కి తులసి యాప్ట్. బాధ్యతలున్న ఇల్లాలిగా, బాగా బతికిన కోడలిగా ఆమె నటన మెప్పిస్తుంది. కల్యాణ్‌ ఫ్రెండ్స్ కేరక్టర్లు చేసిన వారిలో కూడా ఈజ్‌ ఉంది. చాన్నాళ్ల తర్వాత సాయికుమార్‌ సిస్టర్‌ కేరక్టర్‌లో సుధ మెప్పించారు. కాసేపు మాత్రమే తెరమీద కనిపించినా, తనికెళ్ల భరణి డైలాగులు మనసును తాకుతాయి. టి.ఎన్‌.ఆర్‌ చనిపోయిన తర్వాత రిలీజ్‌ అయిన సినిమాల్లో ఇది ఒకటి.

Sr Kalyana Mandapam

Sr Kalyana Mandapam

ఎలా ఉందంటే…? పుష్ప సినిమా రాయలసీమ యాసలో ఎంత మెప్పిస్తుందో ఏమోగానీ, ఆ సినిమా కన్నా ముందే రాయలసీమ యాసలో వచ్చే సినిమాల సంఖ్య పెరుగుతోంది. లేటెస్ట్ ఎస్‌ ఆర్‌ కల్యాణ మండపం కూడా రాయలసీమ నేపథ్యంలోనే సాగుతుంది. అన్నని నా అనడం, చెప్పుని మెట్టు అనడం, ఫ్రెండ్స్ ని మచ్చా అనడం… ఇలా పదాలు మాత్రమే కాదు.. యాసని కూడా బాగానే క్యారీ చేసే ప్రయత్నం చేశారు. రాయలసీమ యాసను కిరణ్‌ బాగానే పట్టుకున్నారు. మిగిలిన కేరక్టర్లు చేసిన వారు కూడా ఫర్వాలేదనిపించారు. కథ తెలిసిందే అయినా, స్క్రీన్‌ మీద ఫ్రెష్‌గానే అనిపించడానికి నేటివిటీ కూడా ఓ కారణం. హీరో ఇంట్రడక్షన్‌ సీన్‌లోనూ, బార్‌ సీనుల్లోనూ వాడిన సాంగ్స్ బావున్నాయి. ఖుషీ నడుము డైలాగుల్ని, పవన్‌ కల్యాణ్‌ కటౌట్‌ని సందర్భానికి తగ్గట్టు బాగానే వాడుకున్నారు. నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి… ఇలా సీనియర్‌ హీరోలందరి ఫ్యాన్స్ నీ మెప్పించేలా పాత పాటలను వాడిన తీరు బావుంది. అన్నిటినీ మించి తండ్రీ కొడుకుల మధ్య కాన్‌ఫ్లిక్ట్ ని క్రియేట్‌ చేసి, అసలు ఏం జరిగి ఉంటుందనే క్యూరియాసిటీని క్రియేట్‌ చేశారు. ఓవరాల్‌గా తండ్రీ కొడుకుల సినిమాగా క్లైమాక్స్ లో ఫీల్‌ క్రియేట్‌ చేశారు. మా తాత రాజ్యాన్ని కాపాడాడు కానీ, రాజులాంటి కొడుకును వదిలేశాడు. పనోళ్ల మధ్య పెరిగిన వ్యక్తికి నాలుగు పైసలు కూడబెట్టడం ఎలా తెలుస్తుంది? పది రూపాయలు ఖర్చుపెట్టడం తప్ప.

మా నాయన పదిరూపాయలు పెట్టినోడే కానీ, అద్దురూపాయి కూడా ఎవరిదీ తిన్నోడు కాదు.. వంటి డైలాగులు బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు తగ్గట్టే ఉంది. ఒరిజినల్‌ కంటెంట్‌కీ, నేటివిటీ ఉన్న సబ్జెక్టులకీ ఆదరణ పెరుగుతున్న ట్రెండ్‌ ఇది. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలను ఓపిగ్గా చూడగలిగితే, ఎస్‌ ఆర్‌ కల్యాణమండపం మంచి ఫీల్‌నే కలిగిస్తుంది.

Also Read..

Maha Samudram: మహా సముద్రం నుంచి ‘హే రంభ’ సాంగ్ రిలీజ్.. మాస్ స్టెప్పులతో అదరగొట్టిన శర్వానంద్..

Mahesh Babu: అభిమానులకు మహేష్ విజ్ఞప్తి.. పుట్టిన రోజు బృహత్తర కార్యక్రమం చేపట్టాలని..