South Heroines: బాలీవుడ్ కోటలో సౌత్ జెండా..! అక్కడ కూడా మనోళ్లదే డామినేషన్..
బాలీవుడ్‌లో సౌత్ హీరోయిన్స్ సందడి చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు దక్షిణాది టాప్ హీరోయిన్లు నయనతార, తమన్నా, సమంత, రష్మిక అక్కడ సత్తా చూపించారు. నెక్ట్స్ జనరేషన్ హీరోయిన్లు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూకడుతున్నారు. ఇప్పుడు సాయి పల్లవి, సారా అర్జున్, శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే, కళ్యాణి ప్రియదర్శన్ కూడా అక్కడ దుమ్ము దులిపేస్తున్నారు..

అక్కడ కూడా మన డామినేషనే అంటావారా? అంటూ బ్రహ్మానందం అదుర్స్‌లో చెప్తాడు కదా..? సేమ్ టూ సేమ్ ఇప్పుడు బాలీవుడ్‌లో సీన్ అదే జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ దక్షిణాది హీరోయిన్ల హవా నడుస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్లను సౌత్‌కు తీసుకురావడానికి మన నిర్మాతలు క్యూ కట్టేవారు.. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. పాన్ ఇండియా ట్రెండ్ పుణ్యమా అని ముంబై మేకర్స్ కళ్లు ఇప్పుడు మన సౌత్ బ్యూటీలపైనే ఉన్నాయి. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, భారీ బడ్జెట్ చిత్రాల్లో స్టార్ హీరోల సరసన మెయిన్ లీడ్స్‌గా మనవారే ఎంపికవుతున్నారు. ఉత్తరాది ఆడియన్స్‌లో మన హీరోయిన్లకు పెరిగిన క్రేజ్, వాళ్ల అద్భుతమైన నటన వల్లే అక్కడి దర్శక నిర్మాతలు దక్షిణాది భామలకు రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ సినిమాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మొన్నటికి మొన్న బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ధురంధర్ సినిమాలో రణ్‌వీర్ సింగ్‌కు జోడీగా సారా అర్జున్ నటించి మెప్పించారు.
ఇప్పుడు రణ్‌వీర్ నెక్ట్స్ చేయబోయే ప్రతిష్టాత్మక చిత్రం ప్రళయ్‌లో కూడా సౌత్ హీరోయిన్ల సందడే ఎక్కువగా ఉండబోతోంది. జై మెహతా దర్శకత్వంలో దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కళ్యాణి ప్రియదర్శన్ ఒక హీరోయిన్‌గా ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారు. ఇక రెండో హీరోయిన్ పాత్ర కోసం కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ లేదా టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లూ మన సౌత్ అమ్మాయిలే కావడం విశేషం.
మరోవైపు లేడీ పవర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి, మహానటి కీర్తి సురేష్ లాంటి అగ్ర హీరోయిన్లు కూడా బాలీవుడ్‌లో చక్రం తిప్పుతున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణలో సీతమ్మగా సాయి పల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.
అంతేకాకుండా అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ నటిస్తున్న సినిమాలోనూ సాయి పల్లవే హీరోయిన్. ఇక నేచురల్ బ్యూటీ కీర్తి సురేష్ సైతం బాలీవుడ్‌లో వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతూ తన మార్కెట్‌ను విస్తరించుకునే పనిలో బిజీగా ఉన్నారు. బేబీ జాన్ సినిమాతో పరిచయమైన కీర్తి.. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా వరస అవకాశాలు అందుకుంటున్నారు.
యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న డ్యాన్సింగ్ డాల్ శ్రీలీల కూడా బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైపోయారు. చాక్లెట్ బాయ్ కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న సినిమాతో శ్రీలీల హిందీలో అరంగేట్రం చేస్తున్నారు. విశేషం ఏమిటంటే.. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే అక్కడ మరో రెండు మూడు బడా ప్రాజెక్ట్స్ శ్రీలీల తలుపు తడుతున్నాయి. దీన్ని బట్టి అక్కడ మన హీరోయిన్లకు ఉన్న డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఇక మిస్టర్ బచ్చన్‌తో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన భాగ్యశ్రీ బోర్సే.. వాస్తవానికి బాలీవుడ్ నుంచే సౌత్‌కు వచ్చారు. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన క్రేజ్‌తో మళ్లీ హిందీలో వరుస అవకాశాలను దక్కించుకుంటూ రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఇప్పటికే బాలీవుడ్‌లో జెండా పాతేసిన రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యానిమల్, ఛావా లాంటి సినిమాలతో నేషనల్ క్రష్‌గా మారిపోయిన రష్మిక.. ఇప్పుడు అక్కడ లేడీ సూపర్ స్టార్ రేంజ్‌లో దూసుకుపోతున్నారు. ఆమెతో పాటు సమంత, తమన్నా లాంటి సీనియర్ స్టార్స్ కూడా వెబ్ సిరీస్‌లు, సినిమాలతో హిందీ ప్రేక్షకులను అలరిస్తూ తమ సత్తా చాటుతున్నారు. నయనతార సైతం జవాన్ సినిమాతో బాలీవుడ్‌ను మడతపెట్టేసారు. మొత్తానికి భాషా బేధాలు చెరిగిపోయి, ఇండియన్ సినిమా అంతా ఒక్కటిగా మారుతున్న ఈ తరుణంలో.. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మన సౌత్ హీరోయిన్ల డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది.
