మేము పనికిరామా.. డ్రైవర్, పనిమనిషిల పాత్రలే ఇస్తారా.. సీరియల్ నటుడి ఆవేదన

తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో తెలుగు నటులకు అవకాశాలు దొరకడం లేదు అని సీరియల్ నటుడు కౌశిక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యారు. ఎక్కువ శాతం ఇతరభాషల నటులనే తీసుకుంటున్నారని. తెలుగు నటులకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మేము పనికిరామా.. డ్రైవర్, పనిమనిషిల పాత్రలే ఇస్తారా.. సీరియల్ నటుడి ఆవేదన
Koushik

Updated on: Dec 21, 2025 | 6:56 PM

ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి మెప్పించిన నటుడు కౌశిక్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కౌశిక్ మాట్లాడుతూ.. సీరియల్ పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కన్నడ నటుల ఆధిపత్యం, తెలుగు నటులకు అవకాశాల కొరత గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ తాను మంచి ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందానని, అయితే తనలాగే ప్రాంప్టింగ్ లేకుండా నటించగలిగే, ప్రొడ్యూసర్లకు సహకరించే మంచి తెలుగు నటులు చాలా మంది ఉన్నారని, కానీ అవకాశాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు కౌశిక్. నాన్-తెలుగు నటులు తెలుగు సీరియల్స్‌లోకి రావడాన్ని తాను వ్యతిరేకించడం లేదని కౌశిక్ స్పష్టం చేశారు. అయితే దానికి ఒక పరిమితి ఉండాలని ఆయన తెలిపారు.

ఒక సీరియల్‌కు ఇద్దరు లేదా ముగ్గురు నాన్-తెలుగు నటులుంటే అభ్యంతరం లేదని, కానీ పది మంది నటుల్లో తొమ్మిది మంది ఇతర భాషల వారే ఉండడం తెలుగు నటుల ఉపాధి లేకుండా చేస్తుందని అన్నారు. “గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్” అనే సూత్రాన్ని ఆయన ప్రస్తావించారు. తెలుగు నటులకు కన్నడ సీరియల్స్‌లో అవకాశాలు దక్కనప్పుడు, కన్నడ నటులు తెలుగు సీరియల్స్‌లో ఆధిపత్యం చెలాయించడం తగదని ఆయన అన్నారు. కన్నడ సీరియల్స్‌లో సింక్ సౌండ్ పద్ధతి వల్ల, తెలుగు నటులకు అక్కడ అవకాశాలు లభించడం లేదని, చాలా మంది తెలుగు నటులకు ప్రాంప్టింగ్ అలవాటు ఉందని, అయితే నీరజ, భరణి, శేఖర్ చంద్రశేఖర్ వంటి కొద్ది మంది మాత్రమే ప్రాంప్టింగ్ లేకుండా నటించగలరని కౌశిక్ వివరించారు.

తెలుగు సీరియల్స్ తెలుగు సంస్కృతిని, నేటివిటీని ప్రతిబింబించాలని కౌశిక్ కోరారు. నాన్-తెలుగు నటులు అధిక సంఖ్యలో ఉండడం వల్ల ప్రేక్షకులు తెలుగు నేటివిటీని కోల్పోతున్నారని భావిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రధాన పాత్రల వరకైనా తెలుగు నటులను తీసుకోవాలని, డ్రైవర్, పనిమనిషి వంటి చిన్న పాత్రలకు మాత్రమే తెలుగువారిని పరిమితం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యకు ఛానెళ్లు, ప్రొడ్యూసర్లు బాధ్యులని, వీరిద్దరూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ, ఆర్టిస్టుల జీవితాలతో ఆడుకుంటున్నారని కౌశిక్ ఆరోపించారు. అంతేకాకుండా, సీరియల్ నిర్మాణం వెనుక ఉన్న సవాళ్లను కౌశిక్ తెలిపాడు. షెడ్యూల్‌లో ఎక్కువ సీన్లు ఓకే కాకపోవడం, ఆర్టిస్టుల డేట్స్ వృథా కావడం వంటివి ప్రొడ్యూసర్‌లకు, నటులకు ఇబ్బందులు కలిగిస్తాయన్నారు. ఒక సీరియల్ వల్ల దాదాపు 70 కుటుంబాలు జీవిస్తాయని, నిర్మాతలకు అన్ని వేళలా అండగా ఉండాలని తాను కోరుకుంటానని చెప్పారు. తన ఒకే ఒక లక్ష్యం, భవిష్యత్తులో తాను ఏదైనా కీలక స్థానంలోకి వస్తే, తెలుగు నటులకు అవకాశాలు కల్పించడం. నాన్-తెలుగు నటుల సంఖ్యను ఒక్క సీరియల్‌కు ఇద్దరు లేదా ముగ్గురికి పరిమితం చేయడం అని ఆయన వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.