ఆ హీరోయిన్ డెడ్ బాడీకి తల లేదు.. ఆమెను చూస్తే జీవితం అంటే ఇంతేనా అనిపించింది
నటి ప్రేమ తన సినీ రంగ ప్రవేశం, తొలినాళ్లలో ఎదుర్కొన్న కష్టాలు, విష్ణువర్ధన్‌తో కలిసి పని చేయడంపై మాట్లాడారు. అలాగే ఓ హీరోయిన్ తో తనకున్న స్నేహం, ఆమె వ్యక్తిత్వం, సినిమా రంగంలోఆమె ప్రభావం, ఆమె అకాల మరణంపై భావోద్వేగ జ్ఞాపకాలను పంచుకున్నారు.

నటి ప్రేమ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ప్రేమ ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు.కాగా గతంలో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కెరీర్‌లోని కీలక ఘట్టాలను, దివంగత నటి సౌందర్యతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. సౌందర్యతో తన అనుబంధం గురించి ప్రస్తావిస్తూ, అప్పట్లో తెలుగులో సౌందర్య, రాశి వంటి అగ్రతారలు ఉన్నప్పటికీ, తనకు ఎప్పుడూ సౌందర్యతో పోటీ అనే భావన కలగలేదని ప్రేమ స్పష్టం చేశారు. సౌందర్య కన్నడలో తక్కువ సినిమాలు చేసినప్పటికీ, తెలుగులో ఎక్కువ చిత్రాలు చేసి తెలుగు అమ్మాయిగా గుర్తింపు పొందారని ఆమె అన్నారు. సౌందర్య ముఖం, సావిత్రి గారి ముఖంలా సహజంగా అందంగా ఉంటుందని పోల్చారు. మహానటి సావిత్రి బయోపిక్‌లు వచ్చినట్టే, సౌందర్య లాంటి గొప్ప నటి బయోపిక్ తీయడానికి దర్శకులు ఎందుకు భయపడుతున్నారో తెలియడం లేదని ప్రేమ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సౌందర్య బయోపిక్ తీస్తే అది పెద్ద హిట్ అవుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రేమ, సౌందర్యల మధ్య స్నేహం చాలా అందంగా ఉండేదని, ఇప్పటికీ సౌందర్య జ్ఞాపకాలు తన మదిలో మెదులుతూ ఉంటాయని ప్రేమ భావోద్వేగంగా చెప్పారు. ముఖ్యంగా ఆమె కళ్లు, ఆమె మాట్లాడే తీరు తనకు చాలా ఇష్టమని తెలిపారు. ఇద్దరూ కలిసి నాలుగు సినిమాలలో నటించారని వెల్లడించారు. రాజకీయాలపై సౌందర్యకు ఆసక్తి ఉండేదని, తాను క్యాన్వాసింగ్ చేయాలని ఆమె కోరగా, తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పానని ప్రేమ వివరించారు. సౌందర్య తెరపై ఎంత హోమ్లీగా, సహజంగా ఉంటారో, తెర వెనుక కూడా అదే విధంగా ఉండేవారని ప్రేమ తెలిపారు. ఆమె మేకప్, హెయిర్ స్టైల్ విషయంలో ఎంతో పర్ఫెక్షనిస్ట్‌గా ఉండేవారని, ప్రతి షాట్ తర్వాత తనను తాను సరిచూసుకునేవారని అన్నారు. గ్లామర్ చూపించకుండానే స్టార్ హీరోయిన్‌గా నిలదొక్కుకోవచ్చని సౌందర్య నిరూపించారని, కేవలం ముఖ కవళికలే ప్రధానమని ఆమె చాటిచెప్పారని ప్రేమ కొనియాడారు. సౌందర్య ఆహారపు అలవాట్లను వివరిస్తూ, ఆమె చాలా తక్కువ తినేవారని, నెయ్యి వేసిన పప్పు తినడం ఆమె నుండే నేర్చుకున్నానని ప్రేమ గుర్తు చేసుకున్నారు.
సౌందర్య అకాల మరణం తనను ఎంతగానో కలిచివేసిందని ప్రేమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మృతదేహాన్ని చూడటానికి వెళ్లినప్పుడు, బాక్స్‌లో పెట్టారు, తల లేదు, ఆమె తల్లి బాధను చూసి తట్టుకోలేకపోయానని తెలిపారు. మరణం తర్వాత పేరు ప్రఖ్యాతులు, స్టార్ వాల్యూ అన్నీ ఇక్కడే వదిలి వెళ్లాల్సి వస్తుందనే జీవిత సత్యాన్ని ఆ రోజు గ్రహించానని ప్రేమ అన్నారు. మనం తీసుకెళ్లేవి కర్మ, గౌరవం మాత్రమే అని చెప్పారు. సౌందర్య మరణం తర్వాత ఆమె తల్లి రెండు సంవత్సరాల క్రితం మరణించారని, బెంగళూరులోని ఆర్టీ నగర్‌లో నివాసం ఉండేవారని తెలిపారు. సౌందర్య భర్త రఘు (రఘునాథ్) ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్నారని, తిరిగి వివాహం చేసుకొని ఇద్దరు కూతుర్లకు తండ్రి అయ్యారని ప్రేమ వెల్లడించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




