MS Narayana: ‘నాన్న రెండు పెగ్గులు వేస్తారు.. కానీ.! ఆ సమయంలో మాత్రం..’

ఎం.ఎస్. నారాయణ కుమార్తె శశి కిరణ్ నారాయణ తన తండ్రి కెరీర్ మొదట్లో ఎదుర్కున్న ఇబ్బందులు, మా నాన్నకు పెళ్లి సినిమాతో వచ్చిన గుర్తింపు లాంటి విషయాలను పంచుకుంది. తన అన్న సినిమా కోసం తండ్రి ఎం.ఎస్. నారాయణ తన ఆస్తులన్నింటినీ అమ్మేశారని చెప్పుకొచ్చింది.

MS Narayana: నాన్న రెండు పెగ్గులు వేస్తారు.. కానీ.! ఆ సమయంలో మాత్రం..
Sasi Kiran Narayana

Updated on: Jan 29, 2026 | 12:41 PM

దివంగత టాలీవుడ్ హాస్యనటుడు ఎం.ఎస్. నారాయణ కుమార్తె శశి కిరణ్ నారాయణ తన తండ్రి కెరీర్, వ్యక్తిగత జీవితం, ఆర్థిక త్యాగాల గురించి సంచలన విషయాలను పంచుకుంది. ఎం.ఎస్. నారాయణ కెరీర్‌లో ‘మా నాన్నకు పెళ్లి’ సినిమా ఓ మైలురాయి అని, ఈ సినిమా విడుదలైన తర్వాత నంది అవార్డు రావడంతో ఆయన జీవితం మారిపోయిందని శశి కిరణ్ వెల్లడించింది. అప్పటి వరకు ఒక సాధారణ జీవితాన్ని గడిపిన తమ కుటుంబానికి, ఆ క్షణం అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చిందని ఆమె గుర్తు చేసుకుంది. ఈ విజయం తర్వాత ఎం.ఎస్. నారాయణ కెరీర్ అమాంతం పెరిగిందని, ఒక సంవత్సరంలోనే 56 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారని, ఇది తన కళ్ల ముందు జరిగిన ఒక డ్రీమ్ లాంటిదని ఆమె చెప్పుకొచ్చింది.

ఇది చదవండి: మటన్ బోటీ ఇలా తింటున్నారా.! అయితే విషంతో సమానం..

ఇవి కూడా చదవండి

ఎం.ఎస్. నారాయణ అనేక తాగుబోతు పాత్రలలో అద్భుతంగా నటించడం వల్ల, నిజ జీవితంలో కూడా ఆయన మద్యపానం చేస్తారనే ఒక తప్పుడు రూమర్ ఇండస్ట్రీలో ఉందని శశి కిరణ్ అన్నారు. ఆయన తనకిచ్చిన పాత్రల్లో జీవించేవారని, అందుకే ప్రేక్షకులు ఆయన్ని నిజంగానే తాగుతారని నమ్మేవారని ఆమె వివరించింది. అన్నవరంలో ‘నువ్వే నువ్వే’ షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ, తన తండ్రిని చూసి ఒక అభిమాని బెల్ట్ షాప్‌కు లాక్కెళ్లడానికి ప్రయత్నించాడని, అలాంటి సంఘటనలు చాలా జరిగాయని తెలిపింది. అయితే, ఎం.ఎస్. నారాయణ పని చేస్తున్నప్పుడు ఎప్పుడూ మద్యం ముట్టేవారు కాదని, సరస్వతిని గౌరవించే వ్యక్తి అని స్పష్టం చేసింది. పని పూర్తయిన తర్వాత మాత్రమే, స్నేహితులతో కలిసి ఒక చిన్న సర్కిల్‌లో విశ్రాంతి కోసం రెండు పెగ్గులు సేవించి ఇంటికి వచ్చి తల్లి చేతితో అన్నం తిని పడుకునేవారని తెలిపింది. తాగడం తప్పు కాదు, తాగి ఇతరులను ఇబ్బంది పెట్టడం తప్పు అనే ఆయన నినాదం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొంది.

ఎం.ఎస్. నారాయణ ఎంత పెద్ద నటుడైనా, తమ కుటుంబాన్ని లోయర్ మిడిల్ క్లాస్ జీవితాన్ని గడిపేలా పెంచారని శశి కిరణ్ తెలిపారు. తమకు ఎప్పుడూ క్లబ్ మెంబర్‌షిప్‌లు లేవని, ఆయన ఉన్నప్పుడు ఒక్క విదేశీ పర్యటనకు కూడా వెళ్లలేదని అన్నారు. డబ్బు పట్ల ఆయనకు విలువ లేదని, ఒకసారి తన కుమారుడి సినిమా సుబ్రహ్మణ్యం విడుదల విషయంలో నిర్మాతలతో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు, సినిమాను తానే హ్యాండోవర్ చేసుకుంటానని మాట ఇచ్చి, ఆ మాట నిలబెట్టుకోవడం కోసం తన వద్ద ఉన్న ఒక ఫ్లాట్ మినహా మిగతా ఆస్తులన్నింటినీ అమ్మేశారని ఆమె గుర్తు చేసుకున్నారు. రెండు జతల బట్టలతో హైదరాబాద్ వచ్చాను, ఒక ఇల్లు ఉంది చాలు కదా అని ఆయన అన్నారని తెలిపారు. ఆయన తీసుకున్న ఆ నిర్ణయం ఆ సమయంలో భారీ నష్టంగా కనిపించినప్పటికీ, ఒకరి మాట నిలబెట్టుకోవడానికి ఆయన చేసిన త్యాగం అది అని వివరించారు.

ఇది చదవండి: జబర్దస్త్‌లో సుధీర్, హైపర్ ఆది కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నది అతడే..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..