శరత్ మరణం టాలీవుడ్ లో విషాదాన్ని నింపింది. హీరో టు విలన్ గా మారారు శరత్ బాబు. పాత్ర ఏదైనా పర్ఫెక్ట్ గా చేయగల నటుడు ఆయన . ఆముదాలవలసలో పుట్టి పెరిగినా అబ్రాడ్ నుంచి దిగాడా అన్నట్టుండే అందగాడు. ఆరు భాషల్లో అవలీలగా మాట్లాడి మెప్పించిన ఘనుడు శరత్ బాబు. తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌కి తరలి వచ్చినప్పుడు ఇక్కడికి రాలేదు శరత్‌బాబు. తెలుగును మించి తమిళంలో సినిమా, టీవీ అవకాశాలు ఉండటంతో చెన్నైలోనే స్థిరపడ్డారు. కెరీర్ స్టార్టింగ్‌లో ఉన్నప్పుడే రమాప్రభను వివాహం చేసుకున్నారు శరత్‌బాబు. అప్పటికే రమాప్రభ హాస్యనటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నంబియార్ కుమార్తె స్నేహను పెళ్లాడారు. పెళ్లయిన పదకొండేళ్ల తర్వాత ఆమెకు కూడా విడాకులు ఇచ్చారు.
స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడతాననే శరత్‌బాబు ఏడు పదుల వయసులోనూ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ మీద మక్కువతో ఈ రంగంలోకి అడుగుపెట్టకపోయినా, చేసిన ప్రతి పాత్రనూ ప్రేమించే చేశానని అనేవారు శరత్‌బాబు. శరత్‌బాబు నటనను మెచ్చుకున్నవాళ్లందరూ సహజ నటుడు అని అంటారు. కానీ ఆయన మాత్రం పేరుకు ముందూ వెనుకా ఏమీ ఉండకూడదని అనుకునేవారు. ఎవరైనా సహజనటుడు అని పిలిచినప్పుడు మాత్రం ఆయన ముఖంపై వెలుగు కనిపించేది.
ఇండస్ట్రీకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చినవారు రిటైర్‌మెంట్ ఏజ్ వచ్చినా పక్క పాత్రల జోలికి వెళ్లాలనుకోరు. ఒక్కసారి క్యారక్టర్ ఆర్టిస్టుగా చేస్తే అవకాశాలు తగ్గిపోతాయన్న భయం ఆయనలో ఎప్పుడూ లేదట. తన నటన మీద నమ్మకం ఉంది కాబట్టే అన్ని ప్రయోగాలు చేశానని చెప్పేవారు శరత్‌బాబు. టీవీ ఆర్టిస్టుగానూ మంచి పేరే ఉంది ఈ నటుడికి. ఇండస్ట్రీలో ఎవరూ తనకు అవకాశాలు ఇప్పించలేదని, రికమండేషన్లతో నాలుగున్నర దశాబ్దాలు ఏ వ్యక్తీ నటుడిగా కొనసాగలేడన్నది శరత్ విశ్వాసం. సాంఘిక సినిమాల్లో మాత్రమే కాదు పౌరాణిక జానపద చారిత్రక, భక్తి చిత్రాల్లో నటించిన క్రెడిట్ ఉంది శరత్‌బాబుకి.