
సమంత, రాజ్ నిడిమోరు భూతశుద్ధి వివాహం చేసుకున్నారని ప్రకటించారు ఈషా నిర్వాహకులు. దీంతో ఈ భూతశుద్ధి వివాహం అంటే ఏంటనే ఆసక్తి అందరిలోను నెలకుంది. భూతశుద్ధి వివాహం అంటే వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేయటం అని వివరించారు ఈ వివాహం జరిపించిన ఈషా టీమ్. ఈ పద్దతిలో జరిగే వివాహం వల్ల దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరిస్తుందని విశ్వాసం. భూతశుద్ధి వివాహం అనేది పారంపరిక హిందూ ధర్మంలోని ఒక ప్రత్యేక పద్ధతి. ముఖ్యంగా ఆధ్యాత్మిక శుద్ధి, పూర్వజన్మ బంధాలు, లేదా గ్రహదోషాలు వంటి కారణాలను నివారించడానికి చేసే ఒక ఆచారం. శరీరం, మనసు, పరిసరాలను ప్రతికూల శక్తుల నుంచి శుద్ధి చేయడం అనమాట. లింగ భైరవి ఆలయాల్లో లేదా ఈశా ఫౌండేషన్ ఎంపిక చేసిన పవిత్ర ప్రదేశాల్లో ఈ పద్దతిలో వివాహం చేసుకుంటే.. దంపతుల దాంపత్య జీవితం సామరస్యంగా, శాంతియుతంగా, శ్రేయస్సుతో సాగుతుందని నమ్ముతారు.
ఇక ఈషా ఫౌండేషన్‌లోని లింగభైరవి ఆలయం స్త్రీ శక్తికి సంబంధించిన ఉగ్ర, కారుణ్య రూపాల కలయిక అని జగ్గీవాసుదేవ్ చెప్పారు. ప్రతీ ఏడాది దసరా సంబరాల్లో భాగంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా సమంత లింగ భైరవి ఉపాసన చేస్తున్నారు. అందుకే తాను ఇష్టపడ్డ రాజ్‌ను అక్కడే అగ్నిహోత్రం సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. ఇక సామ్-రాజ్ వివాహంలో మరో ప్రత్యేకత వివాహ క్రతువును మహిళా పూజారి నిర్వహించటం.
మొత్తానికి రెండోసారి కూడా తెలుగింటి కోడలయ్యింది సమంత. రాజ్ నిడుమూరు తిరుపతి జిల్లాకు చెంది వ్యక్తి. SV యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. కొంతకాలం విదేశాల్లో పనిచేసి.. తర్వాత బాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. మరో డైరెక్టర్ DKతో కలిసి రాజ్-DKగా ఫేమస్ అయ్యారు. ఫ్యామిలీ మేన్ వెబ్‌సిరీస్ 3 పార్ట్‌లు ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్యామిలీ మ్యాన్-2లో సమంత నటించారు. అక్కడే వీళ్ల బంధం బలపడింది. సిటాడెల్ -హనీబన్నీ టైమ్‌లో వీళ్ల మధ్య సమ్‌థింగ్ అంటూ వార్తలొచ్చాయి.
శుభం సినిమాకి సమంత ప్రొడ్యూసర్ అయితే.. రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఆ టైమ్‌లోనే వీళ్ల రిలేషన్‌ని అంతా కన్ఫామ్ చేశారు. మొన్న దీపావళిని రాజ్ ఫ్యామిలీతోనే జరుపుకుంది సమంత. ఆ తర్వాత నుంచి ఇద్దరూ కలిసి ఫంక్షన్లలో కూడా కనిపించారు. రీసెంట్‌గా సమత ఇల్లు కొన్నారు. ఆ గృహప్రవేశానికి సంబంధించిన ఫొటోల్లో కూడా రాజ్ ప్రముఖంగా ఉన్నారు. పూజల్లో ఇద్దరూ కలిసే పాల్గొన్నారు. ఇక లేటెస్ట్‌గా రక్త బ్రహ్మాండ్ సిరీస్ చేస్తున్నారు రాజ్. అందులో కూడా సమంత కీలక పాత్రలో నటిస్తున్నారు.