దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కశ్మీర్ ఫైల్స్ సినిమాపై 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జ్యూరీ హెడ్ నాదవ్ లాపిడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రచారానికి మాత్రమే పనికి వచ్చే చిత్రమని, వల్గర్‌గా ఉందని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ముగింపు వేడుకల్లో నాదవ్ లాపిడ్ పెదవి విరిచారు. ప్రతిష్టాత్మకమైన చలన చిత్రోత్సవాల్లో ఇలాంటి సినిమాను ప్రదర్శిస్తుండడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. అసలా సినిమాను ఇఫీ కాంపిటీషన్ విభాగంలో ప్రదర్శనకు ఎలా అనుమతించారంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరుల సమక్షంలోనే నిర్వాహకులను నిలదీశారు.
కళాత్మక, కాంపిటీటివ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇలాంటి మూవీని ప్రదర్శించడంతో తనతో బాటు అనేకమంది షాక్ అయ్యారన్నారు. దీన్ని ఎంపిక చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. భారతీయ చలన చిత్రోత్సవాల పనోరమా సెక్షన్ లో ఈ చిత్రాన్ని నవంబర్ 22న ప్రదర్శించారు. అయితే ఇజ్రాయెల్ కే చెందిన కాన్సల్ జనరల్ కొబ్బి షొషానీ.. ఆయన వ్యాఖ్యలతో విభేదించారు. కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని తాను చూశానని, ఇందులో వల్గారిటీ ఏమీ లేదని ఆయన కొట్టిపారేశారు. ఇదిలావుంటే, 1990ల్లో కశ్మీర్ హిందూ పండిట్ల మూకుమ్మడి హత్యాకాండ, భారీ వలసలు నేపథ్యంలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని తెరకెక్కించారు.