
ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు రోజా తన సుదీర్ఘ సినీ ప్రస్థానంపై అనేక ఆసక్తికర విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 90వ దశకంలో హీరోయిన్‌గా తన కేరీర్ టాప్ లో ఉన్నప్పుడు ఎదురైన సవాళ్లు, సహనటులతో తన అనుబంధం, అలాగే తన సినీ జీవితంలోని ప్రత్యేక మైలురాళ్లను వివరించారు రోజా. ఆ సమయంలో నటి మీనాతో తనకు గట్టి పోటీ ఉండేదని రోజా గుర్తుచేసుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో తామిద్దరే ముఖ్య నటీమణులుగా వెలుగొందామని, ఆన్‌స్క్రీన్ పై పోటీ పడుతున్నా, ఆఫ్-స్క్రీన్ లో మంచి స్నేహితులమని తెలిపారు. రంభ వంటివారు తమకు జూనియర్స్ అని, రమ్యకృష్ణ, నగ్మా వంటివారు సీనియర్స్ అని పేర్కొన్నారు రోజా. చిరంజీవితో తనకు అద్భుతమైన అనుబంధం ఉందని రోజా వెల్లడించారు. బయట గుర్తుపట్టేస్తారని, చిరంజీవి, సురేఖ, తాను కలిసి మారువేషాల్లో ఖైరతాబాద్‌లోని ఓ ప్రసిద్ధ బిర్యానీ సెంటర్‌కు వెళ్లి బిర్యానీ తినేవారమని గుర్తు చేసుకున్నారు.
ముఠామేస్త్రి సినిమాలో మామ మామ పాట చిత్రీకరణ సమయంలో చిరంజీవి తన నటనను, డాన్స్‌ను ప్రశంసించారని తెలిపారు. సురేఖ కూడా తన డాన్స్ అంటే ఇష్టమని, చిరంజీవికి సమానంగా బాగా చేస్తావని మెచ్చుకునేవారని రోజా చెప్పారు. బాలకృష్ణతో చాలా సినిమాలు చేశానని, చిరంజీవితో మూడు సినిమాలు చేశానని తెలిపారు. సహనటులతో ఎప్పుడూ ఎలాంటి విభేదాలు రాలేదని, అందరితో స్నేహపూర్వకంగా ఉండేదాన్ని అని అన్నారు. జెలసీకి తావు లేకుండా, ఉన్నంతవరకు హ్యాపీగా నవ్వుతూ ఉంటానని, అదే తన సీక్రెట్ అని రోజా వివరించారు.
వెంకటేష్‌తో తనకు గ్యాప్ వచ్చిందనే ప్రచారంపై రోజా క్లారిటీ ఇచ్చారు. తాను వెంకటేష్‌తో ఒక్క సినిమా మాత్రమే చేశానని, అది వ్యక్తిగత కారణం కాదని చెప్పారు. తమిళంలో విజయకాంత్ నటించిన ఒక సినిమా హిట్ అయిందని, దానిని తెలుగులో చామంతి పేరుతో రీమేక్ చేయాలనుకున్నారని తెలిపారు. మొదట డైరెక్టర్ సెల్వతో ఒక సినిమాకు పూజ జరిపిన తర్వాత, సెల్వకు తెలియకుండానే అదే షెడ్యూల్, కాస్టింగ్‌తో (వెంకటేష్, విజయశాంతి) ఆ రీమేక్‌ను తెరకెక్కించడానికి ప్రయత్నించారని, దీనివల్ల సెల్వ మనస్తాపం చెందారని రోజా వెల్లడించారు. ఇది సెల్వ, నిర్మాత నర్సారెడ్డి, వెంకటేష్‌లకు సంబంధించిన విషయమని, తనతో వెంకటేష్‌కు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.