పద్మశ్రీ పొందిన తొలి హాస్యనటుడు రేలంగి గురించి ఆసక్తికర విషయాలు..

రేలంగి వెంకట్రామయ్య, తెలుగు సినిమా హాస్యానికి మకుట రారాజు. పద్మశ్రీ పొందిన తొలి హాస్యనటుడిగా గుర్తింపు పొందారు. తనదైన ప్రత్యేకమైన టైమింగ్, సహజమైన హాస్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆయన దాతృత్వం, నిగర్వ స్వభావం, తోటి నటీనటులపై చూపిన ఆదరణ ప్రశంసనీయం. కళామతల్లి సేవలో నిస్వార్థంగా గడిపిన మహానటుడు రేలంగి.

పద్మశ్రీ పొందిన తొలి హాస్యనటుడు రేలంగి గురించి ఆసక్తికర విషయాలు..
Relangi Venkatramaiah

Updated on: May 07, 2026 | 6:58 PM

తెలుగు సినిమా స్వర్ణయుగంలో ఎస్వీ రంగారావు, గుమ్మడి వంటి మహానటులతో పాటు రేలంగి వెంకట్రామయ్య పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. వీరు తెలుగు వారు గర్వించదగ్గ కళామూర్తులు. రేలంగిని తెలుగు సినిమా హాస్యానికి మొగటలేని మహారాజుగా అభివర్ణిస్తారు. తను నవ్వకుండానే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అరుదైన కళాకారుడు ఆయన. రేలంగి నటనలో ఒక ప్రత్యేకమైన టైమింగ్ ఉండేది, కేవలం మామూలుగా మాట్లాడినా కూడా జనానికి నవ్వు వచ్చేది. ఏదైనా విషయాన్ని సీరియస్‌గా చెబుతూ, చివరకు ఒక తేలికపాటి మాటతో అందరినీ నవ్వించడం ఆయన శైలి. తన కెరీర్ ప్రారంభంలో మద్రాసులో మైళ్ళ కొద్దీ నడిచిన రేలంగి, ఒక స్థాయికి చేరుకున్నాక అనేకమందికి తన కారులో లిఫ్ట్ ఇచ్చేవారు. తన సినీ ప్రయాణంలో అండగా నిలిచిన సైకిల్‌ను కూడా ఆయన భద్రంగా దాచుకున్నారు. అవకాశాలు రాకపోతే ఈ ఆస్తిపాస్తులు వదిలేసి, ఈ సైకిల్ తొక్కుకుంటూ మా తాడేపల్లిగూడెం వెళ్ళిపోతా అని సరదాగా అనేవారు. ప్రేక్షకులు రేలంగి సినిమా కోసం థియేటర్లకు పోటెత్తేవారు, ఆయన తెరపై కనిపించగానే విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేసేవారు. కొందరైతే హీరో ఎవరని కూడా పట్టించుకోకుండా, రేలంగి ఉంటే చాలు సినిమా చూసేవారు.

తెలుగు సినిమా హాస్యానికి రేలంగే తొలి హీరో. రేలంగి గొప్ప విజన్ ఉన్న నటుడు. కొన్ని సీరియస్ సన్నివేశాలలో తన ఉనికి ఆ సన్నివేశానికి భంగం కలిగిస్తుందని భావించి, దర్శకులకు అందులో తనను లేకుండా చూడమని చెప్పేవారు. ఇది ఒక కళాకారుడి నిజమైన పరిణతికి నిదర్శనం. వ్యక్తిగత జీవితంలో రేలంగి దయాగుణం, నిగర్వ స్వభావం ఎన్నోసార్లు వ్యక్తమయ్యాయి. చిన్న స్థాయి నుంచి పెద్ద నటుడి వరకు ఎదిగినా ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. షూటింగ్ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్లను, చిన్న ఆర్టిస్టులను తన కారులో ఇంటికి దించి, వారి పట్ల ఆదరణ చూపేవారు. తన ఇంట్లో ప్రతిరోజూ కనీసం 25 మందికి భోజనం పెట్టేవారు. చదువుకోవాలనుకున్న వారికి ఫీజులు కట్టి ప్రోత్సహించేవారు. ఆయన చేసిన గుప్తదానాలకు లెక్కే లేదు. సావిత్రి, సి.ఎస్.ఆర్. వంటి నటీనటుల పట్ల ఆయనకు అమితమైన గౌరవం ఉండేది. రమణారెడ్డి, అల్లు రామలింగయ్య వంటి తోటి హాస్యనటులకు పెద్ద దిక్కుగా నిలిచారు. గిరిజతో కలిసి కొంటె కోణంగిగా, సూర్యకాంతం భర్తగా నటించి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఆలంబన అయ్యారు.

చిత్రాల పేర్లను గుర్తుంచుకోవడంలో రేలంగికి పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. తనకు వేషం ఇచ్చిన నిర్మాత పేరును మాత్రం గుర్తుపెట్టుకునేవారు. విజయా సంస్థ నిర్మించిన దాదాపు అన్ని చిత్రాల్లో నటించిన ఆయన, గుండమ్మ కథ సినిమాలో లేకపోవడంపై నిర్మాత చక్రపాణిని సరదాగా ప్రశ్నించేవారు. 1969 అక్టోబర్‌లో కూచిపూడిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగం ఒక మలుపు. 34 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉండి, 205 చిత్రాల్లో నటించినా ప్రభుత్వం తనను గుర్తించలేదని హాస్యంగా వ్యాఖ్యానించారు. ఈ మాటలను ఆలకించిన అప్పటి ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి జలగం వెంగళరావు చొరవతో, ప్రభుత్వం 1970లో రేలంగికి పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. హాస్యనటులలో ఈ గౌరవాన్ని పొందిన తొలి వ్యక్తి రేలంగి కావటం విశేషం. ఆ తరువాత అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు కూడా ఈ అవార్డు అందుకున్నారు. జీవిత చరమాంకంలో మద్రాసును వదిలి స్వగ్రామమైన తాడేపల్లిగూడెంలో స్థిరపడ్డారు. 1975 నవంబర్ 27న ఆయన తుదిశ్వాస విడిచారు. మరణించే ముందు నేలపై పడుకోబెట్టమని కోరి, క్షణాల్లో శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయిన రేలంగిని మృత్యువుని ఎరిగిన మృత్యుంజయుడు అని అభివర్ణిస్తారు. ఆయన మరణంపై సినీలోకం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. రేలంగి అంటే హాస్యం, హాస్యం అంటేనే రేలంగి అన్నంతగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరించిన అరుదైన కళాకారుడు రేలంగి వెంకట్రామయ్య.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us