Ram Gopal Varma: డాగ్ లవర్స్.. నా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? షాకింగ్ వీడియో షేర్ చేసిన ఆర్జీవీ

వీధి కుక్కలకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాపయి. జంతు ప్రేమికులు సుప్రీం ఆదేశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక వీడియోను షేర్ చేస్తూ డాగ్ లవర్స్ కు కొన్ని ప్రశ్నలు సంధించారు.

Ram Gopal Varma: డాగ్ లవర్స్.. నా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? షాకింగ్ వీడియో షేర్ చేసిన ఆర్జీవీ
Ram Gopal Varma

Updated on: Aug 16, 2025 | 6:36 PM

దేశ రాజధాని ఢిల్లీతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని కుక్కలను వీధి కుక్కలను వీలైనంత త్వరగా షెల్టర్లకు తరలించాలని సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీం తీర్పుపై జంతు ప్రేమికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మరికొందరు మాత్రం సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నారు. అయితే జంతు ప్రేమికుల ఆందోళనలపై మరోసారి స్పందించిన సుప్రీం కోర్టు.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కాగా సదా, జాన్వీ కపూర్, సోనాక్షి సిన్హా, అడివి శేష్ లాంటి సెలబ్రిటీలు కూడా సుప్రీం తీర్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక హీరోయిన్ సదా వీధి కుక్కలను తరలించవద్దని బోరున ఏడుస్తూ వీడియో కూడా షేర్ చేసింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ విషయంపై స్పందించాడు. గతంలో వీధి కుక్కల దాడిలో చనిపోయిన ఓ చిన్నారికి సంబంధించిన వీడియోని ఎక్స్‌లో షేర్‌ చేస్తూ.. ‘సుప్రీంకోర్టు తీర్పుపై ఏడుస్తున్న డాగ్‌ లవర్స్‌ ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇక్కడ ఒక నగరం మధ్యలో పట్ట పగలే నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి’ అని రాసుకొచ్చాడు. దీంతో పాటు గతంలో వీధి కుక్కల దాడులో చనిపోయిన, తీవ్రంగా గాయపడిన చిన్నారులకు సంబంధించిన పలు వీడియోలను వరుసగా ఎక్స్ లో షేర్ చేశారు రామ్ గోపాల్ వర్మ.

ఇదే సందర్భంగా ట్విట్టర్ వేదికగా డాగ్ లవర్స్ కు వరుసగా ప్రశ్నలు సంధించారు. 1. వీధి కుక్కలు రోడ్లపై ప్రజలను కరిచి చంపుతున్నాయి. కానీ జంతు ప్రేమికులు మాత్రం ట్వీట్లు చేయడంలో బిజీగా ఉన్నారు. 2. ధనవంతులు తమ ఇళ్లల్లో పెట్ డాగ్స్ ను పెంచుకుంటున్నారు. కానీ వీధి కుక్కలు మాత్రం పేద వారిని కొరికి చంపుతున్నాయి. డాగ్ లవర్స్ ఎవ్వరూ దీనిపై మాట్లాడరేమి? 3. ఒక మనిషిని చంపితే అది హత్య. అదే కుక్క చంపితే యాక్సిడెంట్. ఇదెలా? 4.జంతు ప్రేమికులు వీధి కుక్కల కోసం ఏడుస్తున్నారు.. కానీ వాటి చేతిలో చనిపోయిన మనుషుల గురించి ఎందుకు ఏడవడం లేదు. 5. జంతు ప్రేమికులు “వీధి కుక్కలను చంపవద్దు” అని చెప్పే బదులు మీరు వాటిని ఎందుకు దత్తత తీసుకోకూడదు. మీరు అలా చేయరు.. ఎందుకంటే అవి మురికిగా ఉంటాయి. వ్యాధులు సోకి ఉంటాయి. వీటిని ఇంట్లోకి తీసుకెళితే మీ పిల్లలు ప్రమాదంలో పడతారనే కదా? 6. గేటెడ్ కమ్యూనిటీల లోపలకు వీధికుక్కలు రావు.. కానీ గేట్లు లేని ఇళ్ల దగ్గరే అవి ఎక్కువగా ఉంటాయి. 7. కుక్కలకే కాదు, బహుశా ఈ సమాజంలో అన్ని జంతువులకు జీవించే హక్కు ఉండవచ్చు.. కానీ అది మానవ జీవితాలను పణంగా పెట్టి కాదు.. ఇలా చాలా ప్రశ్నలనే సంధించారు ఆర్జీవీ.

ఆర్జీవీ షేర్ చేసిన వీడియో ఇదే..

 

ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. చాలా మంది నెటిజన్లు ఆయనకు సపోర్టుగా పోస్టులు పెడుతున్నారు.

డాగ్ లవర్స్ కు రామ్ గోపాల్ వర్మ సంధించిన ప్రశ్నలు ఇవే..