
15 ఏళ్ల క్రితం థియేటర్లలో విడుదలైనప్పుడు ‘ఆరెంజ్’ ఒక డిజాస్టర్. ప్రేక్షకులు రామ్ చరణ్ నుంచి ‘మగధీర’ లాంటి మాస్ మసాలా ఆశించారు.. కానీ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ మాత్రం ఒక క్లిష్టమైన ఫిలాసఫీని చూపించాడు. అయితే ఆశ్చర్యకరంగా అదే సినిమా ఇప్పుడు రీ-రిలీజ్ అవుతుంటే థియేటర్లు కిక్కిరిసిపోతున్నాయి.. కలెక్షన్ల రికార్డులు బద్దలవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం.. నాడు ప్రేక్షకులకు అర్థం కాని ఆ సినిమాలోని నిజాయితీ నేటి యువతకు తమ సొంత జీవితపు అద్దంలా అనిపించడమే. అప్పట్లో లాంగ్ టైమ్ లవ్ ఎప్పటికీ నిలబడదు అన్న హీరో మాటలు చేదుగా అనిపించాయి.. కానీ నేడు ఆ మాటల్లోని ప్రాక్టికాలిటీని ఈ జనరేషన్ పూర్తిగా అర్థం చేసుకుంది. అందుకే ఇది ఫ్లాప్ మూవీ కాదు.. కాలం దాచుకున్న ఒక క్లాసిక్ అని అర్థమవుతుంది. ఈ సినిమాలో హీరో రామ్ పాత్ర చెప్పే లవ్ గ్రాఫ్ కాన్సెప్ట్ చాలా బోల్డ్. నేను నిన్ను జీవితాంతం ప్రేమిస్తాను అని అబద్ధం చెప్పడం కంటే.. ప్రేమించినంత కాలం నిజాయితీగా, గాఢంగా ప్రేమిస్తాను అని చెప్పడం గొప్ప అని ఈ సినిమా నిరూపిస్తుంది.
ప్రేమలో ఎమోషన్స్ ఎప్పుడూ ఒకేలా ఉండవని, అవి తగ్గుతూ పెరుగుతూ ఉంటాయని చెప్పే ధైర్యం అప్పట్లో ఏ సినిమా చేయలేదు. నేటి బ్రేకప్స్, సిచుయేషన్-షిప్స్ చూస్తున్న యువతకు రామ్ క్యారెక్టరైజేషన్ చాలా దగ్గరగా అనిపిస్తోంది. అబద్ధపు హామీలతో బంధాన్ని లాక్కొచ్చే కన్నా, ఉన్నంత కాలం స్వచ్ఛంగా ప్రేమించాలనే పాయింట్ ఈ జనరేషన్ మెంటాలిటీకి పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యింది. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కచ్చితంగా తన సమయం కంటే 15 ఏళ్లు అడ్వాన్స్‌డ్‌గా ఆలోచించాడు. 2010లో ఆడియన్స్ హ్యాపీ ఎండింగ్స్, జన్మజన్మల బంధాలు వంటి ఫాంటసీ ప్రేమకథలకు అలవాటు పడి ఉన్నారు. కానీ భాస్కర్ మాత్రం ప్రేమలోని అభద్రతా భావాన్ని, కాలంతో పాటు వచ్చే మార్పును ముఖం మీదే కొట్టినట్లు చూపించాడు. ఆ రోజుల్లో అది కన్ఫ్యూజన్ అనిపించింది.. కానీ ఇప్పుడు అది మెచ్యూరిటీ అనిపిస్తోంది.
జెనీలియా పాత్ర జాను కోరుకునే ఫాంటసీ లవ్, రామ్ చూపించే రియలిస్టిక్ లవ్ మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా బలం. భాస్కర్ రాసిన ఈ కథలో లాజిక్ కంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ, అందుకే ఇది ఇప్పుడు ఇంతగా ఆదరణ పొందుతోంది. ఇక ఈ సినిమాను ఒక మ్యూజికల్ మ్యాజిక్ అని చెప్పక తప్పదు. హారిస్ జయరాజ్ అందించిన సంగీతం ఆరెంజ్ ఆత్మ. రూబా రూబా, నేను నువ్వంటూ, ఓ రేంజ్ వంటి పాటలు ఇప్పటికీ ఫ్రెష్‌గా వినిపిస్తాయి. కేవలం ఆడియో మాత్రమే కాదు, విజువల్‌గా కూడా ఈ సినిమా ఒక పెయింటింగ్‌లా ఉంటుంది. ఆస్ట్రేలియా లొకేషన్లు, రామ్ చరణ్ స్టైలింగ్, గ్రాఫిటీ ఆర్ట్ వర్క్.. ఇవన్నీ సినిమాకు ఒక ప్రత్యేకమైన వైబ్ తీసుకొచ్చాయి. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని స్క్రీన్ ప్లే, మనసును తాకే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను యువతకు ఎప్పుడూ దగ్గరగానే ఉంచుతున్నాయి.
రీ-రిలీజ్ లో జనం పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారంటే ఆ మ్యూజిక్ ఎంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చు. చివరగా చెప్పాలంటే.. ఆరెంజ్ నేర్పించిన పాఠం ఏంటంటే.. ఒరిజినల్ లవ్ అంటే ఎదుటివారిని మోసం చేయకుండా ఉండటం, మనసులో ఏముందో అది చెప్పడం. ప్రేమిస్తున్నప్పుడు ఆ ఇంటెన్సిటీ ఎంత ఉందో, అది తగ్గినప్పుడు కూడా అంతే నిజాయితీగా ఒప్పుకోవడమే అసలైన ప్రేమ అని ఈ సినిమా చాటిచెప్పింది. ఇది నిరాశ కాదు, ప్రేమను ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించే తత్వం. అందుకే 15 ఏళ్ల తర్వాత కూడా రామ్ చరణ్ ఆరెంజ్ ఒక ఓటమిలా కాకుండా, గెలిచిన ఒక అద్భుతమైన ప్రయోగంలా, ప్రేమకు కొత్త నిర్వచనంలా నిలిచిపోయింది. రెండు సార్లు కాదు.. పదిసార్లు రీ రిలీజ్ చేసినా కూడా ఆరెంజ్ సినిమాకు అదే ఆదరణ లభిస్తూనే ఉంటుంది. ఫిబ్రవరి 6న విడుదలైన ఈ చిత్రం.. మరోసారి థియేటర్లలో మ్యాజిక్ చేస్తుంది. అందుకే ఆరెంజ్ టైమ్ లెస్ క్లాసిక్‌గా మారిపోయింది.