Ram Charan: వారసత్వం భారం కాదు.. గొప్ప అవకాశం! మెగాస్టార్ తనయుడిగా ఉండటంపై రామ్ చరణ్ బోల్డ్ కామెంట్స్!

ఒకవైపు తండ్రి మెగాస్టార్‌గా ఇండస్ట్రీని శాసిస్తుంటే, మరోవైపు బాబాయి పవర్ స్టార్‌గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. రాజకీయాల్లోనూ రాణిస్తూ డిప్యూటీ సీఎంగా సేవలందిస్తున్నారు. ఇలాంటి అతిపెద్ద సినీ కుటుంబం నుండి వారసుడిగా రావడం అంటే అది అదృష్టమా లేక తట్టుకోలేని ఒత్తిడా?

Ram Charan: వారసత్వం భారం కాదు.. గొప్ప అవకాశం! మెగాస్టార్ తనయుడిగా ఉండటంపై రామ్ చరణ్ బోల్డ్ కామెంట్స్!
Ram Charan

Updated on: Jan 19, 2026 | 11:05 PM

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆ స్టార్ హీరో ఇప్పుడు తన మనసులోని అసలు మాటను బయటపెట్టారు. వారసత్వం గురించి చాలామంది హీరోలు ‘ఒత్తిడి’ అని చెబుతుంటే, ఈయన మాత్రం చాలా స్పష్టంగా అది తనకున్న ఒక ‘అందమైన అడ్వాంటేజ్’ అని తేల్చి చెప్పారు. అంతేకాదు, ఆస్కార్ స్థాయికి ఎదిగినా తనను తాను అంత సీరియస్‌గా తీసుకోనని చెబుతూ తన రోజువారీ దినచర్య గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్, వ్యక్తిత్వం గురించి వెల్లడించిన ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

వారసత్వంపై క్లారిటీ..

ఇటీవల ఒక ప్రముఖ షోలో పాల్గొన్న రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా పుట్టడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఓపెన్ గా మాట్లాడారు. “సినిమా కుటుంబం నుండి రావడం అనేది ఒక అద్భుతమైన అవకాశం. ఇంట్లో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు మనకు విషయాలు త్వరగా అర్థమవుతాయి. యాక్టింగ్ స్కూల్‌కు వెళ్లి కొత్తగా నేర్చుకునే వారికంటే, ఇలాంటి వాతావరణంలో పెరిగిన వారికి అభ్యాసం అనేది చాలా వేగంగా జరుగుతుంది” అన్నారు చరణ్. తనపై ఎప్పుడూ ఆ వారసత్వం భారం కాలేదని, దాన్ని కేవలం ఒక అవకాశంగానే చూశానని ఆయన స్పష్టం చేశారు.

వారసత్వం వల్ల ఎంట్రీ సులభం కావచ్చు కానీ, ప్రేక్షకులు ఆమోదించడం అనేది అతిపెద్ద సవాలు అని రామ్ చరణ్ అభిప్రాయపడ్డారు. “నాకు ఆరంభంలో పెద్దగా కష్టం అనిపించలేదు కానీ, నన్ను ఒక నటుడిగా అంగీకరించడం ప్రేక్షకులకు కష్టమై ఉండవచ్చు. ఎందుకంటే వారి అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ కాలక్రమేణా మనం చేసే పని ద్వారా వారి అభిప్రాయాలు మారుతాయని నేను నమ్ముతాను” అని ఆయన నిజాయితీగా చెప్పుకొచ్చారు.

సక్సెస్ మంత్ర..

‘ఆర్ఆర్ఆర్’ వంటి భారీ విజయం తర్వాత కూడా చరణ్ అంత ప్రశాంతంగా ఉండటానికి కారణం ఆయన పాటిస్తున్న ఒక క్రమశిక్షణే. “నేను నన్ను అంత సీరియస్‌గా తీసుకోను. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే నా పని మీద దృష్టి పెడతాను. అది పూర్తికాగానే నేను చేసే పనిని పూర్తిగా మర్చిపోతాను. సక్సెస్ గురించి అతిగా ఆలోచించను” అని చరణ్ తన సింపుల్ లైఫ్ స్టైల్ గురించి వివరించారు. ఈ అలవాటే తనను ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుతుందని ఆయన తెలిపారు.

రామ్ చరణ్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘పెద్ది’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను మార్చి 27, 2026న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత చరణ్ నుండి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం, వారసత్వాన్ని గౌరవిస్తూనే తనకంటూ ఒక సొంత ముద్ర వేసుకోవడం రామ్ చరణ్ ప్రత్యేకత. తనను తాను ఒక సాధారణ వ్యక్తిగా భావిస్తూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న తీరు నిజంగా అభినందనీయం.