
తెలుగు సినిమా చరిత్రలో విలన్ పాత్రలకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, రాచఠీవిని తీసుకువచ్చిన ఘనత రాజనాలదే. అంతకుముందు విలన్ పాత్రలు పోషించిన నటులు ఉన్నప్పటికీ, తమదైన ముద్రను వేయలేకపోయారు. రాజనాల రంగప్రవేశంతో విలనీకి ఒక కొత్త కోణం ఏర్పడింది. ఆయన ఒకానొక దశలో అగ్ర హీరోలతో సమానంగా పారితోషికం అందుకున్నారంటే ఆయన డిమాండ్ ఎంత ఉండేదో అర్థం చేసుకోవచ్చు. మద్రాసులో ఆయనకు ఐదు భవంతులు, ఐదు కార్లు ఉండేవి, కావలిలో 32 ఎకరాల స్థలం కూడా ఉండేది. అయితే, చివరి రోజుల్లో ఆర్థిక అవసరాల నిమిత్తం ఈ ఆస్తులను కోల్పోయి, కష్టాలను ఎదుర్కొన్నారు. మద్రాసులోని టీ.నగర్‌తో రాజనాల జీవితం ముడిపడి ఉండేది. ఆంధ్రా నుంచి నిత్యం ఎవరో ఒకరు ఆయన ఇంటికి వస్తూ ఉండేవారు. కనీసం పాతిక మందికి తక్కువ కాకుండా రోజు ఆయన ఇంట్లో భోజనం చేసేవారు. అందుకే ఆయన ఇంటిని “రాజనాల సత్రం” అని పిలిచేవారు. ఆయన మొదటి భార్య శోభ, వచ్చిన వారందరికీ లేదనకుండా వండి వడ్డించే అన్నపూర్ణమ్మ లాంటి వారు. షూటింగ్‌లో ఉన్నప్పుడు కూడా పది మందికి సరిపడే భోజనం ఆయన ఇంటికి వచ్చేది. మంచి తెలివితేటలున్న పేద విద్యార్థులకు డబ్బు సహాయం చేయడంలో రాజనాల ఎప్పుడూ ముందుండేవారు. రాజనాల కేవలం కరుడుగట్టిన విలన్ పాత్రలు మాత్రమే కాకుండా, లోతైన తాత్వికత కలిగిన వ్యక్తి. జీవితం అంటే ఏమిటి? అని ప్రశ్నిస్తే, “చీకటి నుంచి చీకటిలోకి సంధించిన బాణం” అని వివరించేవారు. గర్భం అనే చీకటి నుంచి మరణం అనే చీకటిలోకి సాగే ప్రయాణం ఇది, మధ్యలో వచ్చే వెలుగు ఒక మాయ అని ఆయన సిద్ధాంతం. లక్నో విశ్వవిద్యాలయంలో ఎంఏ ఫిలాసఫీ చేసిన ఆయనకు పుస్తక పఠనం ఒక హాబీ. మద్రాసులో లక్షల రూపాయల విలువైన పుస్తకాలతో సొంత లైబ్రరీని ఏర్పాటు చేసుకున్నారు. ఫిలాసఫీ, న్యూమరాలజీ, జ్యోతిష్యం వంటి అనేక విషయాలపై ఆయనకు పట్టు ఉండేది.
ప్రతిజ్ఞ చిత్రంలో విలన్‌గా పరిచయమైన రాజనాలకు మొదట్లో అలాంటి వేషాలంటే ఇష్టం ఉండేది కాదు. “వద్దంటే డబ్బు”, “బీదల ఆస్తి” వంటి చిత్రాల్లో ఆయన తండ్రి పాత్రలు పోషించారు. “వద్దంటే డబ్బు” చిత్రంలోనే తొలిసారిగా ఎన్టీఆర్‌తో కలిసి నటించిన రాజనాల, అందులో ఎన్టీఆర్ మామ పాత్రలో కనిపించారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ ఆయన్ని ఆప్యాయంగా “మామాజీ” అని పిలవడం ప్రారంభించారు. ఈ పిలుపు సినిమా పూర్తయినా మారలేదు. ఎన్టీఆర్ తన స్వంత చిత్రం “జయసింహ”లో రాజనాలతో విలన్ పాత్ర చేయించి, ఆ తరహా పాత్రలకు ఆయనే సమర్థుడని నిరూపించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రాజనాల కత్తియుద్ధం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. “జయసింహ” తర్వాత రాజనాలకు ఎక్కువగా విలన్ పాత్రలే వచ్చాయి. విఠలాచార్య చిత్రాల్లో రామారావు, రాజనాల కత్తియుద్ధాలు ఎంతగానో ఆకట్టుకునేవి. ఎన్టీఆర్ సొంత చిత్రాలైన “శ్రీకృష్ణ పాండవీయం”, “గులేబకావళి కథ”, “వరకట్నం” లలో రాజనాల ఉండటానికి ఎన్టీఆర్ సిఫార్సులు ప్రధాన కారణం. రాజనాల తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. రెండు హిందీ చిత్రాలతో పాటు, “మయాడా మాగ్నిఫిషియంట్” అనే ఆంగ్ల సినిమాలో ఇండియన్ చీఫ్‌గా నటించారు. విదేశీ చిత్రాల్లో నటించిన తొలి భారతీయ నటుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆంగ్ల భాషను అనర్గళంగా మాట్లాడగలగడం దీనికి కారణం. షేక్స్‌పియర్ నాటకాల్లోని సంభాషణలను ఆయన గంభీరంగా చెప్పేవారు. ఎంజిఎం సంస్థ “మయాడా మాగ్నిఫిషియంట్” చిత్రం షూటింగ్ కోసం భారతదేశానికి వచ్చినప్పుడు, రాజనాల ప్రతిభ గురించి తెలుసుకుని ఆయనకు ఒక ముఖ్యమైన భారతీయ పాత్రను ఇచ్చింది. హిందీ విలన్లు కె.ఎన్.సింగ్, అజిత్, ప్రాణ్ వంటి వారు రాజనాలని “గురుజీ” అని గౌరవించేవారు. రాజ్ కపూర్, షమ్మీ కపూర్ అంటే కూడా రాజనాలకి ఎంతో ఇష్టం ఉండేది.
Also Read: నూటొక్క జిల్లాల అందగాడు నూతన ప్రసాద్ విషాద గాథ
1971లో రాజనాల మొదటి భార్య శోభ 32 ఏళ్లకే మరణించారు. ఈ దుర్ఘటనతో ఆయన తీవ్రంగా కుంగిపోయారు. దాదాపు ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్ స్వయంగా వచ్చి ఆయనను పరామర్శించి, అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకున్నారు. పిల్లలు చిన్నవారు కావడంతో 1971లో భూదేవిని వివాహం చేసుకున్నారు. 1972లో “శ్రీకృష్ణాంజనేయ యుద్ధం” తర్వాత ఆయనకు సినిమా అవకాశాలు తగ్గడం ప్రారంభించాయి. ఆ తర్వాత పదేళ్లు నటించినా, మునుపటి వైభవం లేదు. అయినప్పటికీ, ఎన్టీఆర్ “దానవీర శూరకర్ణ”, “చాణక్య చంద్రగుప్త” చిత్రాల్లో పాత్రలు ఇచ్చి ఆదుకున్నారు. హీరో కృష్ణ “అల్లూరి సీతారామరాజు” చిత్రంలో మంచి వేషం ఇచ్చారు. రాజనాల నటించిన 1350 చిత్రాల్లో తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీతో పాటు ఒక హాలీవుడ్ సినిమా కూడా ఉంది. 1984 నుంచి 1994 వరకు దాదాపు సినిమాలకు దూరంగా ఉండి, వృత్తి కోసం తపించిన వ్యక్తి భుక్తి కోసం పరితపించాల్సి వచ్చింది. 1993లో హైదరాబాద్‌కు మారిన తర్వాత, దర్శకులు కృష్ణారెడ్డి “నెంబర్ వన్”, ఇ.వి.వి. సత్యనారాయణ “హలో బ్రదర్” చిత్రాల్లో ఆయన కోసం ప్రత్యేక పాత్రలు సృష్టించారు. హీరో కృష్ణ ఇచ్చిన “తెలుగు వీర లేవరా” రాజనాల చివరి చిత్రం. 1998 మే 21న మద్రాసులో తన కుమార్తె వద్ద అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన ఆసుపత్రి బిల్లు రూ.1,80,000 కాగా, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ నిధులతో దానిని చెల్లించి, ప్రత్యేక వాహనంలో రాజనాల పార్థివ దేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. తెరపై ఆయన విలన్‌గా కనిపించినా, నిజ జీవితంలో ఒక హీరోగానే జీవించారు. ఆయన చెప్పినట్లుగా, రాజనాల జీవితం “చీకటి నుంచి చీకటిలోకి సంధించిన బాణం”, మధ్యలో సినీ జీవితం ఒక వెలుగు, అంతే.
(ఈ కథనంలోని సమాచారం.. సీనియర్ జర్నలిస్టుల అనుభవాలు, ఇంటర్నెట్ నుంచి సేకరించాం)