Puri Jagannadh: ఆ ఘటనతో లావణ్యను వదిలేద్దాం అనుకున్న.. ఓపెన్‌గా చెప్పిన పూరి

దర్శకుడు పూరీ జగన్నాథ్ తన భార్య లావణ్యను మొదటిసారి చూసినప్పటి సంఘటనను, ఆకస్మిక ప్రపోజల్‌ను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో, ఓ హోటల్‌లో లావణ్య చెప్పిన తందూరి చికెన్ ఆర్డర్‌తో ఆమెను పోషించలేమోనని ఆయన భయపడ్డారు. స్నేహితుల సహాయంతో అతి సామాన్యంగా జరిగిన వారి పెళ్లి కథ ఆకట్టుకుంటుంది.

Puri Jagannadh: ఆ ఘటనతో లావణ్యను వదిలేద్దాం అనుకున్న.. ఓపెన్‌గా చెప్పిన పూరి
Puri Jagannadh - Lavanya

Updated on: Jan 20, 2026 | 6:12 AM

ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా భార్య లావణ్యతో పెళ్లికి ముందు జరిగిన సంఘటనల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో లావణ్యను మొదటిసారి చూసినప్పుడు, ఆమెను చూసి ఒక గంటన్నర పాటు ఆమెపైనే ఫోకస్ పెట్టినట్లు పూరీ జగన్నాథ్ తెలిపారు. ఆ సమయంలో ఆమె తన భార్యకు సరిపోతుందని భావించానని ఆయన చెప్పారు. అప్పటికి తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా, వెయ్యి రూపాయల జీతంతో, గోస్ట్ డైరెక్షన్ చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించారు. లావణ్య దృష్టిని ఆకర్షించలేకపోయినా, తన వద్ద ఉన్న ఒక విజిటింగ్ కార్డును ఆమెకు ఇచ్చి, “నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే ఫోన్ చెయ్, లేకపోతే వద్దు” అని నేరుగా చెప్పినట్లు వివరించారు. ఒక వారం తర్వాత లావణ్య ఫోన్ చేయడంతో వారి ప్రేమ ప్రయాణం మొదలైంది.

డేటింగ్‌కు వెళ్ళిన ప్రతిసారి స్నేహితుల దగ్గర పది, ఇరవై రూపాయలు అప్పు తీసుకొని ఖర్చు చేసేవారని పూరీ జగన్నాథ్ గుర్తు చేసుకున్నారు. ఒకసారి ఓ మోస్తరు హోటల్‌కు వెళ్ళినప్పుడు, లావణ్య పూర్తి తందూరి కోడిని ఆర్డర్ చేసింది. అప్పటివరకు పూరీ జగన్నాథ్ తందూరి కోడి రుచి చూడలేదు. తన జేబులో బిల్లుకు సరిపడా డబ్బులు ఉన్నాయో లేదో అని ఆందోళన చెందుతూ, కోడిని అలా లైట్‌గా తింటున్నట్లు నటించానని ఆయన చెప్పారు. లావణ్య కోడిని మొత్తం తినేసిన తర్వాత, ఆమెను పోషించడం తన వల్ల కాదేమోనని, ఈ పెళ్లిని మానుకుందామని కూడా అనుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత “ఇకపై మీటింగ్స్ వద్దు, పెళ్లి చేసుకుంటే ఫోన్ చెయ్, కోళ్లను పెట్టలేను” అని ఆమెకు స్పష్టం చేసినట్లు వివరించారట. ఈ సంఘటన తర్వాత లావణ్య ఇంట్లో విషయం చెప్పి, వారు మళ్ళీ కలుసుకోవడం, ప్రేమించుకోవడం కొనసాగింది.

పూరీ జగన్నాథ్ తాను ఏం సంపాదించట్లేదని, కేవలం 200 రూపాయలు మాత్రమే ఉన్నాయని లావణ్యకు చెప్పినప్పుడు, “నీ దగ్గర రూపాయి లేకపోయినా నేను నీతో వస్తాను” అని ఆమె బదులిచ్చింది. కుటుంబాలకు భారం కాకూడదని భావించి, స్నేహితుల సహాయంతో నిరాడంబరంగా గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఒక స్నేహితుడు పురోహితుడిని, మరొకరు తాళిబొట్టు, బట్టలు, ఇంకొకరు కూల్‌డ్రింక్‌లు తీసుకురావడంతో లంచ్ బ్రేక్‌లో అసిస్టెంట్ డైరెక్టర్లందరూ కలిసి వివాహాన్ని జరిపించారు. ఆ తర్వాత తమ తల్లిదండ్రులకు ఫోన్ చేసి, పెళ్లైపోయిందని, ఇక పెళ్లి చేయాల్సిన అవసరం లేదని చెప్పినట్లు పూరీ జగన్నాథ్ వివరించారు. ఆ “తందూరి కోడి” సంఘటన తర్వాత లావణ్య ఇప్పటివరకు మళ్ళీ చికెన్ తినలేదని ఆయన వెల్లడించారు.

Also Read: అభిమానులను మోసం చేశావ్ ఉదయ్ కిరణ్.. ఫీనిక్స్ పక్షిలా లేచి వస్తానని చెప్పి..