
ప్రముఖ చిత్ర నిర్మాత, రాజకీయ నాయకుడు ప్రసాద్ వి పొట్లూరి (PVP) తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు, అంతర్గత లోపాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. పీవీపీ మాట్లాడుతూ.. ఒక సినిమా విజయం సాధిస్తే దాని క్రెడిట్ ప్రధానంగా హీరో, దర్శకులకు దక్కుతుంది. కానీ, అదే సినిమా పరాజయం పాలైతే, మొత్తం భారం నిర్మాతపైనే పడుతుందని అన్నారు. వందల కోట్ల రూపాయలు వెచ్చించి సినిమాలు నిర్మిస్తున్నప్పుడు, ఆ డబ్బు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుంచి వస్తుందని, కాబట్టి వారి పట్ల నిజాయితీ, బాధ్యత ఉండాలని పీవీపీ అన్నారు. అలాగే బ్రహ్మోత్సవం చిత్ర నిర్మాణ సమయంలో ఎదురైన అనుభవాలను వివరిస్తూ, చిత్రీకరణ ప్రారంభానికి ముందే పూర్తి స్క్రిప్ట్ సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో తాను దర్శకుడికి ఒక ఈమెయిల్ పంపానని PVP వెల్లడించారు.
“మంచి స్క్రిప్ట్ ఉన్నప్పటికీ, నిర్లక్ష్యం క్రమశిక్షణ లేకపోవడం వల్లే ఆ సినిమా దెబ్బతిందని,. దానిని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాము. అది నా బాధ,” అని ఆయన అన్నారు. పరిశ్రమలో డబ్బుకు విలువ లేదని, ముఖ్యంగా దర్శకులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చలనచిత్ర పరిశ్రమ దర్శకులు-హీరో ఆధారితంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. 1930లు, 40లు, 50ల నుండి 70ల వరకు నిర్మాతల నియంత్రణలో ఉన్న పరిశ్రమ, ఇప్పుడు పూర్తిగా మారిపోయిందన్నారు. నిర్మాతలు ఒకప్పుడు నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉండగా, ఇప్పుడు వారిని దోపిడీదారులుగా చూస్తున్నారని ఆయన అన్నారు.
హీరోల గురించి మాట్లాడుతూ, చాలా మంది హీరోలు తమ తదుపరి సినిమా నిర్మాణ వ్యయాన్ని మునుపటి సినిమా సాధించిన లాభాల కంటే ఎక్కువగా ఉండేలా చూసుకుంటారని పీవీపీ ఆరోపించారు. దీనివల్ల నిర్మాతలు ఎల్లప్పుడూ నష్టాల్లోనే మిగిలిపోతున్నారని ఆయన అన్నారు. సినీ ప్రముఖుల పిల్లలు సొంత ప్రొడక్షన్ హౌస్‌ల ద్వారా సినీ రంగంలోకి రాకపోవడానికి ఇదే కారణమని, వారికి ఈ వాస్తవం తెలుసునని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.