Allu Aravind: తల్లి మరణం మరువకముందే అల్లు అరవింద్‌‌ను వెంటాడిన మరో విషాదం

తల్లి మరణం దుఃఖం నుంచి కోలుకోకుండానే.. అల్లు అరవింద్ జీవితంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్ననాటి స్నేహితుడు, గీతా ఆర్ట్స్‌తో అనుబంధం ఉన్న సి. నాగరాజు కన్నుమూయడం ఆయనను మళ్లీ దుఃఖంలో ముంచెత్తింది. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం ...

Allu Aravind: తల్లి మరణం మరువకముందే అల్లు అరవింద్‌‌ను వెంటాడిన మరో విషాదం
Allu Aravind

Updated on: Sep 07, 2025 | 9:26 PM

అల్లు అరవింద్ మరోసారి విషాదంలో మునిగిపోయారు. ఇటీవల తల్లి మరణం ఆయన్ను కలిచివేసిన సంగతి తెలిసిందే. మరోసారి దుఃఖంలో ముంచెత్తే సంఘటన చోటుచేసుకుంది. ఆయన చిన్ననాటి స్నేహితుడు, గీతా ఆర్ట్స్‌తో అనుబంధం ఉన్న సి. నాగరాజు అనారోగ్యంతో కన్నుమూశారు. చిన్నతనం నుంచి అల్లు అరవింద్‌కు అత్యంత సన్నిహితుడైన నాగరాజు.. అరవింద్‌తో కలసి ఉండేందుకు హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. గీతా ఆర్ట్స్ నిర్మించిన ‘మాస్టర్’ సినిమా నుంచే ఆయనకు సంస్థతో అనుబంధం మొదలైంది. ఆ తర్వాత గీతా ఆర్ట్స్ నిర్మించిన పలు విజయవంతమైన చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా సేవలు అందించారు.

ప్రస్తుతం నాగరాజు వయసు 76 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు ఆస్ట్రేలియాలో స్థిరపడి ఉండగా.. ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. అనంతరం నాగరాజు అంత్యక్రియలు హైదరాబాద్‌లోనే నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని అల్లు అరవింద్ స్వయంగా పర్యవేక్షించారు.

దర్శకుడు రవిరాజా పినిశెట్టి, బన్నీ వాసు, వంశీ నందిపాటి, బండ్ల గణేష్, సురేష్ కొండేటి తదితర సినీ ప్రముఖులు హాజరై నాగరాజుకు నివాళులర్పించారు. అల్లు అరవింద్‌కు ఆప్తుడైన నాగరాజు మరణం సినీ వర్గాల్లో తీవ్ర విచారాన్ని కలిగించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..