యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒక మూవీ విడుదలైన వెంటనే.. మరో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇటీవలే కల్కి 2898 ఏడీ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డార్లింగ్.. కొద్ది రోజుల క్రితం డైరెక్టర్ హను రాఘవపూడి సినిమా లాంఛ్ చేశాడు. మైత్రీ మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ హీరోగా.. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. స్వతంత్ర పోరాటకాలం, రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రం రూపొందించనున్నారని తెలుస్తోంది. పూజా కార్యక్రమాలు జరిగిన రోజే ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో చాలా హింట్స్ కూడా ఇచ్చేశారు. ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ అని ఆ పోస్టర్ లో కనిపించడంతో ఆ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేశారనే టాక్ కూడా నడిచింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా గురించి మరో అప్డేట్ రాలేదు.
సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్తుందని అప్పుడు టాక్ నడిచింది. తాజాగా ఈ ప్రాజెక్ట్ మీద ఇప్పుడు మళ్లీ చర్చలు జరుగుతున్నాయి. వచ్చే వారం నుంచే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని.. తమిళనాడులోని కారైకుడిలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుందని అంటున్నారు. ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్, నాటి రోజులను తలపించేలా సినిమా కథకు కావాల్సిన సెట్స్ కూడా వేస్తున్నారని అంటున్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.
అలాగే త్వరలోనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న స్పిరిట్ మూవీ కూడా స్టార్ట్ చేయనున్నారట. ఇక ఇవే కాకుండా కల్కి 2, సలార్ 2 చిత్రాలను కూడా స్టార్ట్ చేసే యోచనలో ఉన్నారట మేకర్స్. అలాగే బాలీవుడ్ లో తెరకెక్కుతున్న సింగం చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.