పాతాళభైరవి అంజిగాడు గుర్తున్నాడా.. విషాదభరితం.. ఈ హాస్యనటుడి జీవితం..

పాతాళభైరవి చిత్రంలో సన్నగా, రేవతలా ఉండే అంజిగాడు పాత్రధారి వళ్లూరి బాలకృష్ణ నటజీవితం అద్భుతం. కలకత్తాలో అవకాశాల కోసం పడిన కష్టాలు, విలక్షణమైన నటన, ప్రత్యేకమైన నవ్వు, మాయాబజార్ వంటి చిత్రాల్లో బహుముఖ పాత్రలు, మాండలికాలపై పట్టు అతని ప్రత్యేకతలు. తెలుగు సినిమాకు ఆయన అందించిన సేవలు అనిర్వచనీయం.

పాతాళభైరవి అంజిగాడు గుర్తున్నాడా.. విషాదభరితం.. ఈ హాస్యనటుడి జీవితం..
Patalabhairavis Anjigadu

Updated on: Aug 18, 2026 | 9:38 PM

తెలుగు సినిమా చరిత్రలో అంజిగాడు అనగానే గుర్తొచ్చే పేరు వళ్లూరి బాలకృష్ణ. పాతాళభైరవి చిత్రంలో ఎన్టీఆర్ స్నేహితుడిగా, తన విలక్షణమైన హాస్యంతో, ఒక ప్రత్యేకమైన నవ్వుతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి, ఆ పాత్రకు ప్రాణం పోశారు. అప్పట్లో పాతాళభైరవి సినిమా ఎంత విజయం సాధించిందో, అందులో అంజిగాడి పాత్ర కూడా అంతే పాపులర్ అయింది. అసలు పేరు వళ్లూరి బాలకృష్ణ మరుగునపడి అంజిగాడుగానే పరిశ్రమలో కొనసాగారు. బాలకృష్ణ పుట్టింది ఏలూరులో. ఆయన నటజీవితం 12వ ఏటనే ప్రారంభమైంది. ఐదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న బాలకృష్ణ, ఆ రోజుల్లో లవకుశ నాటకాల్లో ముని బాలకుడి వేషం వేశారు. 1937 నాటి మాట ఇది. సినిమాల్లో నటించాలనే తపనతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కలకత్తాకు రైలెక్కి వెళ్లారు. టికెట్ లేకపోవడంతో చాలా చోట్ల రైలు దిగాల్సి వచ్చినా, పట్టువదలని విక్రమార్కుడిలా కలకత్తా చేరుకున్నారు. అక్కడ నాలుగైదు హిందీ ముక్కలతో కాలం గడుపుతూ, హజ్రా రోడ్డులోని ఓ మార్వాడీ సత్రంలో ఆశ్రయం పొందారు. ఈస్ట్ ఇండియా కంపెనీ స్టూడియోలో షూటింగ్‌లు జరుగుతాయని తెలుసుకొని, 10 కిలోమీటర్లు నడిచి అక్కడికి చేరుకున్నారు. బాలయోగిని తమిళ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో, ఆకలితో బాలసరస్వతిని ఇడ్లీ అడిగి, ఆమె వెంట స్టూడియోలోకి వెళ్లారు. అక్కడ మ్యూజిక్ ఆర్కెస్ట్రాలో తెలుగు వారిని కలవడం, మాస్టర్ రాజేశ్వరరావు తండ్రి సాలూరి సన్యాసిరాజు ద్వారా విజయదశమి లేక కీచకవధ అనే చిత్రంలో చిన్న వేషం సంపాదించడం ఆయనకు తొలి అడుగు. ఆ చిత్రానికి 15 రూపాయలు పారితోషికం అందుకున్నారు. అందుకున్న డబ్బుతో ఇంటికి తిరిగి వెళ్లక, కలకత్తాలోనే ఉండి మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.

శ్రీ రామా ఫిలిమ్స్ వారి చిత్రనళీయం సినిమా కోసం కలకత్తా వచ్చినప్పుడు, వారి లాడ్జికి వెళ్లి వంటవాడి వేషం సంపాదించారు. ఆ ట్రూప్‌లో ఆర్ట్ డైరెక్టర్ ఎస్వీఎస్ రామారావు పరిచయం ద్వారా మద్రాస్ చేరుకున్నారు. మద్రాసులో మొదట్లో నాటకాల్లో నటించినా, విజయా సంస్థ నిర్మించిన పాతాళభైరవి ఆయన జీవితాన్ని మార్చేసింది. ఈ చిత్రంలో అంజిగాడి పాత్రతో పాటు చెట్టు మీద ఉండే భూతం వేషాన్ని కూడా పోషించారు. ఆయన విలక్షణమైన నటన, హాస్యం, పిచ్చి నవ్వు దర్శకుడు కేవీ రెడ్డిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాతాళభైరవి తర్వాత బాలకృష్ణ పెళ్లి చేసి చూడు, మిస్సమ్మ వంటి చిత్రాల్లో నటించారు. మిస్సమ్మలో అక్కినేని డిటెక్టివ్ రాజు అసిస్టెంట్ పాత్రలో ఒక్క డైలాగ్‌ కూడా లేకుండా, నోట్ బుక్‌లో నోట్ చేసుకుంటూ చేసే నటన ప్రేక్షకులను అలరించింది. మాయాబజార్ చిత్రంలో కీలకమైన సారథి పాత్రతో పాటు, ఘటోత్కచుడు ద్వారకానగరంలో ప్రవేశించినప్పుడు ద్వారపాలకుడిగా కూడా కనిపించి తన బహుముఖ నటనను ప్రదర్శించారు. రేలంగి, శాస్త్రి, శర్మలతో వచ్చే సన్నివేశాల్లో ఆయన హాస్యం కడుపుబ్బ నవ్వించింది. బాలకృష్ణకు మిమిక్రీ, మాండలికాలపై అద్భుతమైన పట్టు ఉండేది. ఆంధ్రదేశంలోని అన్ని జిల్లాల యాసలను స్పష్టంగా మాట్లాడి తోటి నటీనటులను ఆశ్చర్యపరిచేవారు. నాటకాల ద్వారా ఇదంతా నేర్చుకున్నానని చెప్పేవారు. విఠలాచార్య, భావనారాయణ చిత్రాల్లో బాలకృష్ణకు స్థానం తప్పకుండా ఉండేది. ఎన్టీఆర్ కూడా ఆయనను ఎంతగానో ప్రోత్సహించేవారు. అయితే, పద్మనాభం, రాజబాబు వంటి హాస్యనటుల పోటీ పెరగడంతో బాలకృష్ణకు అవకాశాలు తగ్గాయి. దీంతో మద్యానికి బానిసయ్యారు. ఒకసారి షూటింగ్‌కు తాగి రావడంతో దర్శకుడు వేషం లేదని పంపించగా, ఎన్టీఆర్ జోక్యం చేసుకొని మందలించి, తన నిప్పులాంటి మనిషి చిత్రంలో బాలకృష్ణకు అవకాశమిచ్చారు. శోభన్ బాబు నటించిన బలిదానం బాలకృష్ణ చివరి చిత్రం. డబ్బింగ్‌ చెప్పకుండానే 1982 నవంబర్ 6న అనారోగ్యంతో కన్నుమూశారు. దాదాపు 400 చిత్రాల్లో నటించిన బాలకృష్ణ మరణానంతరం పద్మనాభం, పోతురాజు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. భార్య, ఏడుగురు కుమార్తెలను విడిచి వెళ్లిన బాలకృష్ణ, తెలుగు సినిమాకు తనదైన ముద్రను వేసి చిరస్మరణీయుడిగా నిలిచారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us