
మూవీ రివ్యూ: ఆదికేశవ
నటీనటులు: వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్, రాధికా శరత్ కుమార్, అపర్ణ దాస్ తదితరులు
ఎడిటర్: నవీన్ నూలి
సినిమాటోగ్రాఫర్: డుడ్లీ, ప్రసాద్ మూరెళ్ళ
సంగీతం: జీవి ప్రకాష్ కుమార్
నిర్మాతలు: సాయి సౌజన్య, సూర్యదేవర నాగ వంశీ
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: శ్రీకాంత్ ఎన్ రెడ్డి
ఉప్పెన తర్వాత సరైన సక్సెస్ లేని పంజా వైష్ణవ్ తేజ్ తాజాగా ఆదికేశవ అంటూ యాక్షన్ సినిమాతో వచ్చాడు. మరి ఈ సినిమాతో మెగా మేనల్లుడు కోరుకున్న ఆ మాస్ సక్సెస్ వచ్చిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
బాలు అలియాస్ రుద్ర కోటేశ్వర రెడ్డి (వైష్ణవ్ తేజ్) హైదరాబాదులో తన కుటుంబంతో పాటు ఉంటాడు. చిత్ర (శ్రీలీల) కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. మరోవైపు రాయలసీమలో చెంగా రెడ్డి (జోజు జార్జ్) మైనింగ్ పేరుతో క్వారీ భూముల అన్నింటినీ ఆక్రమిస్తూ ఉంటాడు. ఇదే క్రమంలో గుడి దగ్గరికి కూడా వస్తాడు. ఈ సమయంలోనే బాలుకు తన తల్లిదండ్రుల గురించి ఒక నిజం తెలుస్తుంది. రాయలసీమ వెళ్లాల్సి వస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది.. ఆ మైనింగ్ కారణంగా జరిగిన నష్టాలు ఏంటి.. వాటిని రుద్రకాళేశ్వర్ రెడ్డి ఎలా ఆపాడు అనేది మిగిలిన కథ.
కథనం:
తెలుగు ఇండస్ట్రీలో ఫ్యామిలీ యాక్షన్ సినిమాలు చాలా వచ్చాయి. ఇలాంటి జోనర్ మనకు కొత్త కాదు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి కూడా ఇదే కథతో వచ్చాడు. ఎన్నో సినిమాల్లో చూసిన ఫార్ములానే తన సినిమాలో కూడా అప్లై చేసాడు శ్రీకాంత్. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ చూస్తుంటే తెలుగు ఇండస్ట్రీకి మరో బోయపాటి దొరికినట్టే అనిపిస్తుంది. యాక్షన్ మాస్ సన్నివేశాలు అంత భయంకరంగా తెరకెక్కించాడు శ్రీకాంత్. ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్ టైన్మెంట్ పైనే ఫోకస్ చేసాడు దర్శకుడు. ఇంటర్వెల్ ముందు వరకు పూర్తిగా కామెడీ ఫ్యామిలీ ఎమోషన్స్ మీద ఫోకస్ చేశాడు. ఆ తర్వాత అసలు యాక్షన్ డ్రామా మొదలైంది. ఎప్పట్లాగా ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్ ఇచ్చి ఆ తర్వాత రాయలసీమలో కథ మొదలు పెట్టాడు.
అక్కడి నుంచి కథ మరో మలుపు తీసుకుంది. పూర్తిగా యాక్షన్ జోనర్ లోనే వెళ్ళిపోయింది. అందరికీ తెలిసిన కథ కావడంతో కథనం మీద ఎక్కువగా దృష్టి పెట్టాడు దర్శకుడు శ్రీకాంత్. గాని అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసిన కథ. దానికి తోడు మైనింగ్ క్వారీ అంటే సాంబ సినిమా ఎక్కువగా గుర్తుకు వస్తుంది. సెకండ్ ఆఫ్ చాలావరకు సాంబ సన్నివేశాలు రిపీట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఒక క్వారీ, దాన్ని తవ్వుకునే విలన్, అది అడ్డుకోవడానికి వచ్చే హీరో ఇదే సింపుల్ గా చెప్పాలంటే ఆది కేశవ కథ. ఫస్టాఫ్ వరకు మాత్రం శ్రీలీలా, తేజ్ మధ్య సన్నివేశాలు కాస్త బెటర్. పాటలలో ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది. ఊర మాస్ సినిమాలు చూసే వాళ్లకు అయితే ఆది కేశవ పర్లేదు అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళు భరించడం కష్టమే. పైగా యాక్షన్ సన్నివేశాలు మితిమీరి ఉన్నాయి. ట్రోలింగ్ కు పనికి వచ్చేలా ఇందులో చాలా సీన్స్ తెరకెక్కించాడు దర్శకుడు శ్రీకాంత్.
నటీనటులు:
వైష్ణవ్ తేజ్ నటుడిగా బాగా మెరుగయ్యాడు. గత సినిమాలతో పోలిస్తే ఇందులో స్క్రీన్ మీద చాలా ఫ్రీగా కనిపించాడు. కెరీర్ లో ఫస్ట్ టైమ్ కమర్షియల్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. శ్రీలీల మరోసారి మాయ చేసింది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. విలన్ గా మలయాళ నటుడు జోజు జార్జ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ప్రతి నాయకుడిగా రెచ్చిపోయాడు. రాధికా శరత్ కుమార్ ఉన్నంత వరకు బాగానే చేసింది. సుదర్శన్, అపర్ణ ఇలా ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ టీమ్:
జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం బాగుంది. లీలమ్మో పాట థియేటర్లో బాగా పేలింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇచ్చాడు. ఎడిటర్ నవీన్ నూలి గురించి చెప్పనక్కర్లేదు. కేవలం రెండు గంటల నడివితో వచ్చింది ఈ సినిమా. సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. శ్రీకాంత్ రొటీన్ స్టోరీతో రావడమే కాదు అంతకంటే రొటీన్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఇక్కడే దర్శకుడిగా ఆయన పూర్తి మార్కులు వేయించుకోలేకపోయాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
పంచ్ లైన్:
ఆదికేశవ.. పంజా బాబు మాస్ మేనియా..