Mogilaiah:అయ్యో.. పద్మశ్రీ మొగిలయ్యకు అవమానం.. షాకింగ్ వీడియో షేర్ చేసిన వేణు ఊడుగుల

పద్మశ్రీ అవార్డు గ్రహీత, మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యకు అవమానం జరిగింది. దీనికి సంబంధించి రాజు వెడ్స్ రాంబాయి నిర్మాత, ప్రముఖ డైరెక్టర్ వేణు ఊడుగుల ఒక షాకింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Mogilaiah:అయ్యో.. పద్మశ్రీ మొగిలయ్యకు అవమానం.. షాకింగ్ వీడియో షేర్ చేసిన వేణు ఊడుగుల
Mogilaiah, Venu Udugula

Updated on: Dec 17, 2025 | 8:16 PM

పద్మశ్రీ అవార్డు గ్రహీత, మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యకు చిత్ర పటానికి దారుణ అవమానం జరిగింది. హైదరాబాద్‌లోని ఓ ఫ్లై ఓవర్ పిల్లర్‌పై మొగిలయ్య గౌరవార్థం గీసిన బొమ్మపై రాజ‌కీయ నాయకుల పోస్ట‌ర్ల‌తో పాటు, సినిమాలకు సంబంధించిన‌ పోస్టర్లను అంటించారు. వీటిని చూసిన మొగిలయ్య తీవ్రంగా కలత చెందారు.. ఎవరినీ ఏమనలేక స్వయంగా ఆయనే ఆ పోస్టర్లను తొలగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు సినీ ప్రముఖులు దీనిపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలో మొగిలయ్య తన చిత్రపటంపై అంటించిన పోస్టర్లను తొలగిస్తున్న వీడియోపై డైరెక్టర్ వేణు ఉడుగుల స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ లో తన ఆవేదనకు అక్షర రూపమిస్తూ ఒక పోస్ట్ పెట్టారు.

‘పద్మశ్రీ పొందిన ముఖం కూడా మనలో కొందరికి ఖాళీ గోడలా కనిపిస్తే, ఇది అవమానం కాదు. మన సాంస్కృతిక స్పృహ ఎక్కడో బలహీనపడుతోందని చెప్పే నిశ్శబ్ద సంకేతం. మొగిలయ్య గారు తన బొమ్మపై అంటించిన పోస్టర్లను తానే తొలగించుకుంటున్న ఆ సందర్భం చాలా విచారకరం. నిజానికి ఇది ఎవరి మీద ఆరోపణ కాదు. మనలోని నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం ఈ సంఘటన’ అని వేణు ఉడుగుల పోస్ట్ పెట్టారు. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం, తెలంగాణ చీఫ్ సెక్రెటరీ, జీహెచ్‌ఎంసీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లను ట్యాగ్ చేశారు. మరి దీనిపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

కాగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు వేణు ఊడుగుల పోస్టుకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మొగిలయ్య లాంటి కళాకారులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని కళాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..