
తెలుగు సినీ చరిత్రలో ఒక విలక్షణ నటుడిగా, అమ్మాయిల కలల రాకుమారుడిగా కీర్తి ప్రతిష్టలు పొందిన వ్యక్తి హరనాథ్. పూర్తి పేరు బుద్ధరాజు అప్పల వెంకట రామ హరనాథరాజు. తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో జమీందారీ కుటుంబంలో 1936 సెప్టెంబర్ 2న జన్మించిన ఆయన చిన్ననాటి నుంచే రాజసంతో, ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో పెరిగారు. కాకినాడలోని పీఆర్ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ఆయనకు భారీ అభిమానగణం ఏర్పడింది. మోటార్ సైకిల్‌పై స్టైల్‌గా రావడం, స్నేహితులతో కలిసి ఉండడం, గొడవల్లో ముందుండడం వంటి పనులు ఆయనలో హీరోకు ముందున్న హీరోయిజాన్ని చూపించాయి. నాటకాల పట్ల గల అభిరుచి హరనాథ్‌ను సినిమా రంగం వైపు నడిపించింది. డైరెక్టర్ రామిణీడు ఇచ్చిన అవకాశంతో 1959లో మాయింటి మహాలక్ష్మి చిత్రంతో వెండితెర అరంగేట్రం చేశారు. అనతికాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. మొదటి సినిమా హీరోయిన్ జమునతో ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి 30కి పైగా చిత్రాల్లో నటించారు. జమున కూడా హరనాథ్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేవారని చెప్పుకునేవారు. ఒక దశలో ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్ వంటివారు జమునకు అవకాశం ఇవ్వనప్పుడు, హరనాథ్ ఆమెకు వరుస అవకాశాలు కల్పించారు.
హరనాథ్ కెరీర్‌లో ఎన్.టి.ఆర్‌తో ఆయనకు గల అనుబంధం ఎంతో ముఖ్యమైనది. 1961లో ఎన్.టి.ఆర్. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామ కళ్యాణంలో శ్రీరాముడి పాత్రకు హరనాథ్‌ను ఎంపిక చేశారు. ఈ చిత్రం కోసం ఎన్.టి.ఆర్. పెట్టిన కఠిన షరతులను (త్రాగకపోవడం, మాంసాహారం తినకపోవడం, కిరీటం నేల పెట్టకపోవడం వంటివి) హరనాథ్ పాటించారు. ఎన్.టి.ఆర్. రావణాసురుడిగా, హరనాథ్ శ్రీరాముడిగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఎన్.టి.ఆర్. హరనాథ్‌ను తన తమ్ముడిలా భావించేవారు. హరనాథ్ వ్యసనాలకు బానిసైనప్పుడు, ఆయన కుటుంబం కోరిక మేరకు ఎన్.టి.ఆర్. ఆయనకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయితే, హరనాథ్ తన వ్యక్తిగత వ్యసనాలకు లోబడిపోయారు. దీని వలన ఆయనకు రావలసిన అవకాశాలు శోభన్ బాబు, కృష్ణ వంటి నటులకు వెళ్లిపోయాయి.
Also Read: 28 రోజుల్లో షూటింగ్ కంప్లీట్.. కట్ చేస్తే కలెక్షన్ల సునామీ.. అన్నగారి బ్లాక్ బాస్టర్
వ్యసనాల కారణంగా షూటింగ్‌లకు వెళ్లడం కష్టమై, సెట్‌లలో కూడా మందు తాగే పరిస్థితి ఏర్పడిందని వెటరన్ ఫిల్మ్ జర్నలిస్టులు చెబుతుంటారు. ఇది ఆయన కెరీర్‌కు తీవ్ర విఘాతం కలిగించింది. అయినప్పటికీ, ఆయన నటన పట్ల అంకితభావం, సహజత్వం అద్భుతంగా ఉండేవి. వ్యక్తిగత జీవితంలో భార్య భానుమతి దేవి ఆయనకు ఎంతో అండగా నిలిచారు. ఆయన వ్యసనాల పట్ల ఆమె ఎంతో ఓర్పుతో వ్యవహరించారు. వారికి పద్మజ అనే కూతురు, శ్రీనివాస్ బుద్ధరాజు అనే కుమారుడు ఉన్నారు. పద్మజ చిన్న వయసులోనే మరణించగా, అల్లుడు జీవీజీ రాజు సినీ నిర్మాణ రంగంలో ఉన్నారు, కుమారుడు శ్రీనివాస్ వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు.
చివరి రోజుల్లో సినిమారంగం నుంచి అవకాశాలు తగ్గి, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. ఆరోగ్యం క్షీణించి, ప్రేగులు దెబ్బతినడంతో 1989 నవంబర్ 1న తన 53వ ఏట కన్నుమూశారు. ఆయన చివరి చిత్రం చిరంజీవితో కలిసి నటించిన నాగు. తన వ్యసనాల వలన తనను తాను బాధించుకున్నారే తప్ప, ఇతరులకు ఎప్పుడూ హాని చేయలేదని, స్నేహానికి ప్రాణమిచ్చేవారని ఆయనను అభిమానించేవారు చెబుతారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.