
శివశంకర్ మాస్టర్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పది భాషల్లో వేలకొద్దీ పాటలకు కొరియోగ్రఫీ చేశారు శివశంకర్ మాస్టర్. మగధీర చిత్రంలోని ‘ధీర ధీర’ పాటకు జాతీయ పురస్కారం అందుకున్నారు. బెంగళూర్ అంతర్జాతీయ గ్లోబల్ ట్రస్ట్ ఈయన్ను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. అంతేకాదు దాదాపు 30కి పైగా చిత్రాల్లో వైవిధ్య నటనతో నవ్వులు పంచారు. ఈయన పుట్టిపెరిగింది తమిళనాడులో అయినా.. పేరు, హోదా, గౌరవం వచ్చింది మాత్రం తెలుగునేలపైనే. బుల్లితెరపైనా తనదైన మార్క్ వేశారు శివశంకర్ మాస్టర్. ఓంకార్ హోస్ట్ గా వచ్చిన ఛాలెంజ్ డ్యాన్స్ షోకు ఆయన జడ్జిగా వ్యవహించారు. ఆయన వద్ద శిష్యరికం చేసిన ఎంతో మంది కొరియోగ్రాఫర్‌లు ప్రస్తుతం టాప్ డ్యాన్స్ మాస్టర్స్‌గా రాణిస్తున్నారు. 2021 నవంబర్ 28న ఆయన కరోనా సంబంధిత సమస్యలతో కన్నుమూశారు. ఆఖరీ మజిలీలో ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్సకు డబ్బులు లేకపోవడంతో.. చిరంజీవి, ధనుష్‌తో పాటు సోనూ సూద్, మంచు విష్ణు లాంటి వారి సాయం చేశారు. ఆయన చనిపోయిన తర్వాత పరిస్థితి ఇంకా దుర్భరం.
కరోనా పీక్ టైం కావడంతో చాలామంది భయంతో ఆయన్ను ఆఖరి చూపు చూసేందుకు కూడా రాలేదు. అతి కొద్ది మంది మాత్రమే వచ్చి నివాళులు అర్పించారు. ఇందులో ఎవర్నీ తప్పుబట్టడానికి లేదు. అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. అయితే.. కనీసం పాడె మోసేందుకు కూడా మనుషులు లేకపోవడంతో.. ప్రముఖ హోస్ట్ ఓంకార్, ఆయన సోదరుడు, నటుడు అశ్విన్.. ఆయన్ను తమ తండ్రి సమానులుగా భావించి.. ఆ తంతులో పాలు పంచుకున్నారు.
దివంగత శివశంకర్ మాస్టర్ మరణం నాటి పరిస్థితులను అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. శివశంకర్ మాస్టర్ తమను ఎప్పుడూ “నాన్న” అని పిలిచేవారని, నటుడిగా తమను ప్రోత్సహించేవారని అశ్విన్ తెలిపారు. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఓంకార్‌గారు నిర్వహించిన ఛాలెంజ్ షో మాస్టర్‌కు పెద్ద బ్రేక్ ఇచ్చిందని, ఆయనలో కృతజ్ఞతా భావం ఎక్కువ అని చెప్పారు. శివశంకర్ మాస్టర్ కరోనా సమయంలో హైదరాబాద్‌లో మరణించినప్పుడు, ఇండస్ట్రీ నుంచి తగినంత మంది రాలేకపోయారని, కేవలం 10-20 మంది మాత్రమే ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారని అశ్విన్ ఆవేదన చెందారు. తాము ఆయన పాడె మోసిన సంఘటనను అశ్విన్ వివరించారు. తాము సాధారణంగానే నివాళులు అర్పించడానికి వెళ్లినప్పటికీ, పాడె మోసేవారు లేకపోవడంతో తామే ఆ బాధ్యతను స్వీకరించామని తెలిపారు. శివశంకర్ మాస్టరే తమకు ఆ అవకాశాన్ని ఇచ్చారని భావించి, ఎంతో సంతోషంగా ఆ కార్యం పూర్తి చేశామని అశ్విన్ పేర్కొన్నారు.
Shivashankar Master FuneralAlso Read: నాటు కోళ్లకు ఈ ఆకులు వేస్తే.. అసలు వైరస్ అన్నదే రాదు..