
మూవీ రివ్యూ: ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్
నటీనటులు: నితిన్, శ్రీలీల, రావు రమేష్, డాక్టర్ రాజశేఖర్, సుధేవ్ నాయర్, రోషిని, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, హైపర్ ఆది తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఏ విల్సన్, సాయి శ్రీరామ్, యువరాజ్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
సంగీతం: హరీష్ జైరాజ్
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: వక్కంతం వంశీ
భీష్మ తర్వాత సరైన సక్సెస్ కోసం చాలా రోజులుగా వేచి చూస్తున్నాడు నితిన్. మధ్యలో వచ్చిన సినిమాలు వచ్చినట్లే పోతున్నాయి కానీ ఒక్కటి కూడా నితిన్ నమ్మకాన్ని నిలబెట్టడం లేదు. దాంతో తనకు కలిసొచ్చిన ఎంటర్‌టైన్మెంట్ జోనర్‌లోనే వక్కంతం వంశీతో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా చేసాడు నితిన్. మరి ఈ చిత్రం అయినా ఆయన నమ్మకం నిలబెట్టిందా.. అసలు సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..
కథ:
అభినయ్ (నితిన్) తెలుగు ఇండస్ట్రీలో ఓ జూనియర్ ఆర్టిస్ట్. ప్రతీ సినిమాలోనూ వెనకాలే తప్ప ముందుండడు. జీవితంలో సెటిల్ అవ్వడమే అని తండ్రి (రావు రమేష్) ఎప్పుడూ తిడుతూనే ఉంటాడు. అలాంటి అభి జీవితంలోకి అనుకోకుండా లిఖిత (శ్రీలీల) వస్తుంది. అభినయ్ తెలివి తేటలు నచ్చి.. తన కంపెనీకి ఏకంగా CEOను చేస్తుంది. అదే సమయంలో ఓ దర్శకుడి నుంచి హీరోగా అభికి అవకాశం వస్తుంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌తో ఆ కథ రాసుకుంటాడు దర్శకుడు. ఆ తర్వాత జరిగిన కొన్ని అనుకోని కారణాలతో సినిమా ఛాన్స్ మిస్ అయిపోతుంది.. కానీ సినిమాలో ఉన్న సైథాన్ పాత్రకు మాత్రం రియల్ లైఫ్‌లో పోషించాల్సి వస్తుంది. ఆ క్రమంలోనే మెయిన్ విలన్ నీరో (సుధేవ్ నాయర్)తో తలపడాల్సి వస్తుంది. అసలు వీళ్ళ మధ్యలోకి ఐజీ విజయ్ చక్రవర్తి (రాజశేఖర్) ఎందుకొచ్చాడు అనేది అసలు కథ.
కథనం:
తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు.. తెలియని పని టచ్ చేయకూడదని గురూజీ చెప్పాడు కదా.. నితిన్ కూడా ఇప్పుడు ఇదే చేస్తున్నాడేమో అనిపించింది ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ చూసాక. ఈయన్ని మాస్ సినిమాలు మోసం చేసాయేమో కానీ ఎంటర్‌టైన్మెంట్ మాత్రం ఎప్పుడూ మోసం చేయలేదు. అందుకే ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‌లో పూర్తిగా ఫన్ మీదే వెళ్లిపోయాడు నితిన్. ట్రైలర్‌లో చూపించినంత కామెడీ లేదు కానీ సినిమాలో మాత్రం పర్లేదు. అక్కడక్కడా హిలేరియస్ సీక్వెన్సులు పడ్డాయి. ఫస్టాఫ్‌లో హీరోలపై చేసే స్పూఫ్‌లు, రావు రమేష్ నితిన్ ట్రాక్ బాగున్నాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఏం నడుస్తుంది.. పవన్ సినిమాల సంగతేంటి.. బాలయ్య ఫ్యాన్స్‌ను కొడతాడంట కదా అంటూ చేసిన స్పూఫ్‌లు బాగా నవ్విస్తాయి. అన్నింటికంటే నరేష్, పవిత్ర లోకేష్ సీక్వెన్స్ కూడా అదిరిపోయింది. ఫస్టాఫ్ అంతా కామెడీతోనే నడిపించేసాడు దర్శకుడు. సెకండాఫ్ హీరో, విలన్ ట్రాక్ కొత్తగా అనిపిస్తుంది. ఇక అత్తయ్య, మామయ్య అనే ఎపిసోడ్ మాత్రం కడుపులు చెక్కలే. రాజశేఖర్‌ను ఉన్నంత వరకు బాగా వాడుకున్నారు. ఆయన కారెక్టర్ చిన్నదే అయినా.. ఇంపాక్ట్ ఫుల్ ఉంది. కొత్త కథ కాదు కాబట్టి ఉన్న కథనే స్క్రీన్ ప్లేతో కవర్ చేసాడు వక్కంతం వంశీ. ఈ కథ కాస్త కిక్ 2కు దగ్గరగా అనిపించింది. చాలా వరకు ఆ కథలోని ఛాయలు ఇందులోనూ కనిపిస్తాయి. అదే కథకు ఎంటర్‌టైన్మెంట్ మిక్స్ చేసి.. కామెడీతో కవర్ చేసాడేమో అనిపిస్తుంది దర్శకుడు వక్కంతం. కొన్ని సీక్వెన్సుల వరకైతే ఎక్స్ ట్రా ఆర్డినరీ ఫన్ ఉంటుంది. అక్కడక్కడా పొలిటికల్ సెటైర్స్ అదిరిపోయాయి. కాకపోతే ఎమోషన్స్ వైజ్ మాత్రం ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ వెనకబడిపోయాడేమో అనిపించింది. కథ రొటీన్ కావడంతో పూర్తిగా హీరో కారెక్టరైజేషన్ మీదే వెళ్లిపోయాడు దర్శకుడు వంశీ. అది కొన్నిసార్లు ప్లస్ అయింది.. మరికొన్నిసార్లు మైనస్ కూడా అయింది. హీరో హీరోయిన్ మధ్య ట్రాక్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. అసలెందుకు హీరో ప్రేమలో హీరోయిన్ పడిపోతుందో అర్థం కాదు. లాజిక్స్ లేకుండా చూస్తే మాత్రం కచ్చితంగా కనెక్ట్ అయ్యే కామెడీ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‌లో ఉంది.
నటీనటులు:
నితిన్ కామెడీ ఇరక్కొట్టాడు.. కంఫర్ట్ జోన్‌లో కుమ్మేసాడంతే. జూనియర్ ఆర్టిస్టుగా స్క్రీన్ మీద చాలా బాగున్నాడు. శ్రీలీల తన వరకు బాగానే చేసింది. డాన్సుల్లో మరోసారి ఆకట్టుకుంది. రావు రమేష్ కారెక్టర్ బాగుంది. నితిన్‌తో ఈయన చేసిన ప్రతీ సీన్ నవ్వు పుట్టిస్తుంది. రోషిణి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. రాజశేఖర్ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపించాడు. ఆయన్ని కూడా ఎంటర్‌టైనింగ్‌గానే చూపించాడు దర్శకుడు. సంపత్ రాజ్, సుధేవ్ నాయర్ తమ తమ పాత్రల వరకు ఓకే..
టెక్నికల్ టీం:
హరీష్ జైరాజ్ సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. ఒకట్రెండు పాటలు ఓకే. ఆర్ఆర్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఈ సినిమాకు ఆర్థర్ ఏ విల్సన్, సాయి శ్రీరామ్, యువరాజ్ పని చేసారు. ఎడిటింగ్ పర్లేదు.. కానీ అక్కడక్కడా లెంత్ ఎక్కువైంది. దర్శకుడి స్వేచ్ఛ కాబట్టి ఎడిటర్ తప్పు లేదు. నా పేరు సూర్య ఎఫెక్ట్‌తో ఈ సారి పూర్తిగా కామెడీకే పరిమితం అయిపోయాడు వక్కంతం వంశీ. తన కంఫర్ట్ జోన్‌లోకి వచ్చాడు. ఇందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు కూడా.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా ఎక్స్ ట్రా ఆర్డనరీ మ్యాన్.. ఆర్డనరీ స్టోరీతో ఎక్స్ ట్రా ఆర్డనరీ ఫన్