
ఒకవైపు పక్కా మాస్ అవతారంలో గొడ్డలి పట్టుకుని కనిపిస్తూనే, మరోవైపు క్యూట్ ఫ్యామిలీ డ్రామాలో తండ్రి పాత్రతో కన్నీళ్లు పెట్టిస్తారు. కోవిడ్ తర్వాత ఇండస్ట్రీలో ఒక డిఫరెంట్ వేవ్‌ను క్రియేట్ చేస్తూ, సక్సెస్ ఫుల్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేస్తున్న ఆ నటుడు ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాతో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమయ్యారు. ఆయన నటనలో ఎంత న్యాచురాలిటీ ఉంటుందో, ఆయన ప్లానింగ్‌లో అంత క్లారిటీ ఉంటుంది.
ఇంతకీ ఆ స్టార్ ఎవరో తెలుసా.. నేచురల్ స్టార్ నాని. కోవిడ్ సంక్షోభం తర్వాత టాలీవుడ్ అగ్ర హీరోలు వేగం తగ్గించినా, నాని మాత్రం గేర్ మార్చారు. 2021 డిసెంబర్ 24న ‘శ్యామ్ సింగరాయ్’ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని, అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. కేవలం 168 రోజుల వ్యవధిలోనే 2022 జూన్ 10న ‘అంటే సుందరానికీ..’ అంటూ ఒక డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్‌తో వచ్చారు. ఫలితం ఏదైనా సరే, ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా వెరైటీ సబ్జెక్టులను ఎంచుకోవడంలో నాని రూటే సెపరేటు.
Natural Star Nani
2023లో నాని తన నట విశ్వరూపాన్ని చూపించారు. మార్చి 30న ‘దసరా’ తో మునుపెన్నడూ లేని మాస్ లుక్‌లో కనిపించి 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించారు. ఆ తర్వాత సరిగ్గా 252 రోజుల గ్యాప్‌తో డిసెంబర్ 7న ‘హాయ్ నాన్న’ అంటూ ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో వచ్చి క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించారు. ఇలా మాస్, క్లాస్ ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకుంటూ తన మార్కెట్‌ను విస్తరించుకుంటున్నారు.
గతేడాది మే 1న విడుదలైన ‘HIT 3’ నాని కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. ఇందులో అర్జున్ సర్కార్ ఐపీఎస్ పాత్రలో నాని పవర్ ఫుల్ యాక్టింగ్‌కు బాక్సాఫీస్ షేక్ అయింది. నాని కెరీర్‌లోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ‘HIT 2’, ‘కోర్టు’ వంటి సినిమాలతో కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ నాని సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నారు.
ప్రస్తుతం అందరి కళ్లు నాని తన ఫేవరెట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న ‘ది ప్యారడైజ్’ పైనే ఉన్నాయి. నాని కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన చిత్రంగా ఇది రూపుదిద్దుకుంటోంది. మొదట మార్చి 26న విడుదల కావాల్సి ఉన్నా, షూటింగ్ ఆలస్యం వల్ల సమ్మర్ బరిలో నిలిచే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం నాని తన లుక్ ను కంప్లీట్ గా మార్చేసి సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు.
దసరా తర్వాత ఈ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఒక సినిమా విడుదలైన ఏడాదిలోపే మరో సినిమాతో సిద్ధంగా ఉండటం అంటే అది మామూలు విషయం కాదు. నాని పక్కా ప్రణాళిక, కష్టపడే తత్వమే ఆయన్ని టాలీవుడ్‌లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. మరి ‘ది ప్యారడైజ్’ తో నాని ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తారో చూడాలి.