నందమూరి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితం. నందమూరి తారక రామారావు సినిమాలు, రాజకీయాల్లో రాణించి, తెలుగునాట ఆయన ఇంటిపేరు చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశారు. ఎన్టీయార్ వారసులు కూడా సినిమాలు, రాజకీయాల్లో రాణించారు. వారిలో ఎన్టీఆర్ వారసుడు నందమూరి మోహన కృష్ణ తనయుడు నందమూరి తారకరత్న ఒకరు.
1983లో జనవరి 8వ తేదీన నందమూరి మోహనకృష్ణ, సీత దంపతులకు చెన్నైలో జన్మించారు నందమూరి తారకరత్న. తారకరత్న నాన్న మోహనకృష్ణ, ఎన్టీయార్ నిర్మించిన కొన్ని సినిమాలకు డీఓపీగా, అంటే కెమెరామెన్‌గా పనిచేశారు. ఈ దంపతులకు తారకరత్న ఒక్కరే సంతానం. చెన్నైలో ఏడో తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చేయడంతో నందమూరి కుటుంబం కూడా ఇక్కడికి షిఫ్ట్ అయ్యింది. ఇక్కడ జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్‌లో హైస్కూల్ విద్య, గుంటూరు విజ్ఞాన్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడు. బైక్ రైడింగ్, స్నేహితులతో కలిసి సినిమాలకు వెళ్లడం తారక్‌కి అలవాటు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదివారు. ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే 2002 ఒకటో నంబర్ కుర్రాడుతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారక్‌రత్న.
ఇక 2012లో దయ సినిమా షూటింగ్ సమయంలో నందమూరి తారకరత్నకు అలేఖ్యరెడ్డి పరిచయమైంది. నందీశ్వరుడు సినిమాకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. ఆ పరిచయం కొంత కాలానికి ప్రేమగా మారింది. కులాంతర వివాహం కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. దాంతో హైదరాబాద్ శివారులోని సంఘీ టెంపుల్‌లో తారకరత్న-అలేఖ్యరెడ్డి రహస్యంగా వివాహం చేసుకున్నారు. తారకరత్న కుటుంబం నుంచి ఒక్క వ్యక్తి కూడా హాజరుకాలేదు. కేవలం తారకరత్న స్నేహితులు, సన్నిహితులు మాత్రమే వచ్చారు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడంతో ఎవరూ రాలేదు.
తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి రిటైర్డ్ ఆర్డీవో మధుసూదన్ రెడ్డి కుమార్తె. ఎంపీ విజయసాయిరెడ్డికి స్వయనా కోడలు వరుస అవుతుంది. తారకరత్న- అలేఖ్యరెడ్డిది లవ్ మ్యారేజ్ కావడంతో నందమూరి ఫ్యామిలీ వారిని కొంతకాలం దూరం పెట్టింది. ఆ తర్వాత అంతా కలిసిపోయారు. ప్రస్తుతం ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇక ఇప్పుడు తారక మరణ వార్తతో నందమూరి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆయన కోలుకోవాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు పూజలు చేశారు. కానీ వారి పూజలు ఫలించలేదు.. తారక రత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.