కుప్పంలో తారకరత్న కుప్పకూలిన మొదటి 45 నిమిషాలు అత్యంత కీలకంగా మారాయి. ఆ సమయంలో ఆయన స్పృహలో లేకపోవడం.. గుండె నుంచి బ్రెయిన్‌కి ఆక్సీజన్ అందలేదు. చాలా సేపు సీపీఆర్ చేసిన తర్వాత తారకరత్న పల్స్ అందింది. ఆరోజు రాత్రికే హుటాహుటిన ఆయనను బెంగళూరుకు తరలించారు కుటుంబ సభ్యులు. నారాయణ హృదయాలయలో చికిత్స అందించారు. గుండెకు బెలూన్ అమర్చి శ్వాసకు, రక్తప్రసరణకు ఎలాంటి అడ్డంకి లేకుండా చూశారు. అయితే బ్రెయిన్ డ్యామేజ్ ఎక్కువగా ఉండడం వల్ల తారకరత్న కోమాలోనే ఉండిపోయారు. షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గుల వల్ల వైద్యం కష్టతరం అయింది.
తారకరత్న కోలుకోడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేశారు కుటుంబ సభ్యులు. విదేశీ వైద్యులను రప్పించి ట్రీట్మెంట్ ఇచ్చారు. తారకరత్న బాబాయి నందమూరి బాలకృష్ణ ట్రీట్మెంట్‌ను దగ్గరుండి చూసుకున్నారు. కుప్పంలో ఆయన అస్వస్థతకు గురైన దగ్గర్నుంచి.. అన్నిరకాల ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నారు. అయితే బ్రెయిన్ డ్యామేజీతోపాటు.. ఇన్ఫెక్షన్ పెరగడంతో ఆయన ఆరోగ్యం విషమించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో 23 రోజుల పోరాటం తర్వాత తుదిశ్వాస విడిచారు నందమూరి తారకరత్న.
ఫిబ్రవరి 22, 1983లో జన్మించిన తారకరత్నపై తన కుటుంబ ప్రభావం బాగా పడింది. ఆయన కూడా తాత, బాబాయ్‌లా సినిమాల్లోకి రావాలని కోరుకున్నారు. 2003లో ఒకటో నెంబర్ కుర్రాడుతో తెరంగేట్రం చేసిన తారకరత్న.. పలు చిత్రాల్లో హీరోగా నటించారు. యువరత్న, తారక్, భద్రాద్రి రాముడు, అమరావతి, నందీశ్వరుడు వంటి చిత్రాల్లో నటించారు. అమరావతి సినిమాలో విలన్‌గా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. గతేడాది 9అవర్స్ వెబ్ సిరీస్‌తో కొత్త పాత్రలోకి మారారు. ఇక ఆయన కెరీర్ అద్భుతంగా ఉంటుందనుకుంటున్న సమయంలో ఈ విషాద సంఘటన జరిగిపోయింది.