Naga Vamsi: ఐబొమ్మ రవిగాడినే రాబిన్‌హుడ్ చేసేశారు.. తప్పు మాది కాదు.. ప్రేక్షకులదే: నాగవంశీ

సినిమావోళ్ల గల్లాపెట్టెలు మునుపటిలా నిండట్లేదంటే.. బాక్సాఫీసులు బొత్తిగా ఖాళీ ఐపోతున్నాయంటే.. థియేటర్లు ఖాళీ సీట్లతో బోసిపోతున్నాయంటే.. అసలు కారణం ఏమై ఉంటుంది..? ఓటీటీలు, పైరసీలు కాదు.. మరోటేదో ఉంది. ఏమిటది? ఫిలిమ్ ఇండస్ట్రీ రెవిన్యూకి గండికొట్టే ఆ విలన్లు ఎవరై ఉంటారు?

Naga Vamsi: ఐబొమ్మ రవిగాడినే రాబిన్‌హుడ్ చేసేశారు.. తప్పు మాది కాదు.. ప్రేక్షకులదే: నాగవంశీ
Naga Vamsi

Updated on: Dec 02, 2025 | 8:49 AM

అదీ మేటర్..! తప్పు మాది కాదు.. మీదే..! మీ మెదళ్లలోనే ఏదో పురుగు చేరింది.. అనేశారు ప్రొడ్యూసర్ నాగవంశీ. వారానికి వంద సినిమాలు రిలీజైనా చూసి తరించేవాళ్లు నైన్‌టీస్‌లో ఆడియన్స్. మరి, ఆ మేజిక్ ఇప్పుడేమైది, ఎక్కడికి పోయింది.. అన్న ప్రశ్నకు ఆయనిచ్చిన ఎమోషనల్ రియాక్షన్ ఇది. నైన్‌టీస్‌లో ఆడియెన్స్ వేరు, ఇప్పటి ఆడియన్స్ వేరు.. ఇండస్ట్రీకి ద్రోహం చేసే పైరసీగాళ్లకే రాబిన్‌హుడ్స్‌గా ఎలివేషన్లిస్తున్నారంటే.. తప్పెక్కడ జరుగుతున్నట్టు? అన్నది నాగవంశీ పాయింట్. తప్పంతా సోషల్ మీడియాదే. నాసిరకం రీల్స్ చూసీచూసీ మన మెదళ్లను వాటికే అప్పగించేస్తున్నామా? అదే రియల్ ఎంటర్టైన్‌మెంట్ అనుకుని ఆ భ్రమల్లోనే బతికేస్తున్నామా? సినిమా ఒరిజినాలిటీని, థియేటర్లో సినిమా చూస్తే దక్కే ఫీల్‌ని చేతులారా పోగొట్టుకుంటున్నామా? ఎపిక్ మూవీ టీమ్ ప్రమోషనల్ ఈవెంట్‌లో కనిపించిన ఎమోషన్స్ ఇవి. మొత్తానికి తత్వం బోధపడినట్టుంది సగటు సినిమా ప్రొడ్యూసర్‌కి.

మరొక్క మాటలో చెప్పాలంటే ప్రేక్షకుల బుర్రలు బాగా పాడైపోయాయి. పైరసీ బకాసురుడు ఐబొమ్మ రవికే కటౌట్లు కట్టి, హ్యాష్‌ట్యాగులు పెట్టి పైకి లేపే రేంజ్‌కి చేరింది ఆడియన్స్ మైండ్‌సెట్. మేం కరెక్టే.. ఆడియన్సే విలన్లు… సోషల్ మీడియాతోనే దెబ్బయిపోతున్నాం… అని కడుపు చించుకుని కాళ్లమీద పడేసుకున్నారు నాగవంశీ. తర్వాత సర్దుకున్నారు. టంగ్ స్లిప్పయిందంటూ లెంపలేసుకున్నారు. పైరసీతో వసూళ్లు తగ్గాయన్న బాధ కంటే, తమ కడుపుకొట్టిన ఖల్‌నాయక్ ఐబొమ్మ రవిని హీరోగా చేసిన సోషల్ మీడియాతోనే ప్రొడ్యూసర్ల కడుపు తరుక్కుపోయేలా చేసినట్టుంది.