ఎన్టీఆర్ ఆపేయమన్నా కృష్ణ వినలేదు..! ఒకే కథ, ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్.. కట్ చేస్తే

ఎన్టీఆర్‌కు వీరాభిమాని అయినప్పటికీ, సూపర్‌స్టార్ కృష్ణ తన సినిమాతో ఆయనకు సవాల్ విసిరారు. ఎన్టీఆర్ పోటీగా ఓ సినిమాను రిలీజ్ చేశారు కృష్ణ. ఆ చిత్రం, భారీ బడ్జెట్, అద్భుతమైన నటీనటులు, సాంకేతిక విలువలతో రూపొందింది. ఎన్టీఆర్ మాటను ఎదిరించి, ఆయనకు పోటీగా సూపర్‌స్టార్ కృష్ణ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమా ఏందంటే

ఎన్టీఆర్ ఆపేయమన్నా కృష్ణ వినలేదు..! ఒకే కథ, ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్.. కట్ చేస్తే
Ntr, Krishna

Updated on: Jul 27, 2026 | 7:13 AM

తెలుగు చిత్రసీమలో ఎన్నటికీ మరిచిపోలేని వివాదాలలో ఒకటి ఎన్టీఆర్ అలాగే సూపర్‌స్టార్ కృష్ణల మధ్య జరిగింది. ఈ వివాదానికి మూలకారణమైన చిత్రాలలో కురుక్షేత్రం ఒకటి. ఎన్టీఆర్‌కు కృష్ణ వీరాభిమాని అయినప్పటికీ, ఒక ప్రత్యేక సందర్భంలో వీరి మధ్య తలెత్తిన విభేదాలు తెలుగు సినీ చరిత్రలో ఒక అధ్యాయంగా నిలిచాయి. ఎన్టీఆర్‌కు పోటీగా కృష్ణ నిర్మించిన చిత్రాలలో కురుక్షేత్రం ప్రముఖమైనది. 1977 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కురుక్షేత్రం పౌరాణిక చిత్రాల యుగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందింది. ప్రముఖ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు తెరకెక్కించిన ఈ చిత్రంలో కృష్ణ అర్జునుడిగా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. శోభన్ బాబు శ్రీకృష్ణుడిగా ప్రశాంతమైన పాత్రలో ఆకట్టుకోగా, కృష్ణంరాజు కర్ణుడి విషాద జీవితాన్ని భావోద్వేగంగా పలికించారు. కైకాల సత్యనారాయణ, గుమ్మడి, జమున, విజయనిర్మల, అంజలీదేవి వంటి గొప్ప నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. మహాభారతంలోని సుభద్ర పరిణయం, రాజసూయం, మాయా జూదం, కౌరవ పాండవ సంగ్రామం, పాండవ విజయం వంటి ప్రధాన ఘట్టాలను రెండు గంటల 48 నిమిషాల నిడివితో తెరకెక్కించారు.

ఇది కూడా చదవండి : అప్పుడు తండ్రితో.. ఇప్పుడు కొడుకుతో..! ఆ స్టార్ హీరో సినిమాలో నయన తార.?

కురుక్షేత్రం కేవలం నటీనటుల ప్రదర్శనలకే పరిమితం కాలేదు. సూపర్‌స్టార్ కృష్ణ భారీగా బడ్జెట్‌ను కేటాయించి, అద్భుతమైన సెట్ వర్క్స్, యుద్ధ సన్నివేశాలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజస్థాన్, అంబాలా వంటి ప్రదేశాలలో చిత్రీకరణ జరపడం, అక్కడికి ఎంతో మంది ఆర్టిస్టులను తీసుకెళ్లి షూటింగ్ చేయడం సినిమా నిర్మాణ విలువలకు నిదర్శనం. సాలూరి రాజేశ్వరరావు సంగీతం, పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా పౌరాణిక వాతావరణాన్ని గొప్పగా ఆవిష్కరించింది. పి.ఎల్. రాయ్ ఛాయాగ్రహణం, భారీ సెట్లు, యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ అప్పటి సాంకేతిక ప్రమాణాలకు మించి ఉన్నత స్థాయిలో ఉన్నాయి. పౌరాణిక చిత్రాలను తీయడంలో కమలాకర కామేశ్వరరావుకు ఉన్న అనుభవం ప్రతీ ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపించింది.

ఇది కూడా చదవండి : ఆ హీరో నైటీ వేసుకోవడానికి వెనకడుగేశాడు.. అందుకే నేనే ఆ పాత్ర చేశా

కురుక్షేత్రం విడుదల సమయంలోనే ఎన్టీఆర్ స్వీయ నిర్మాణంలో, దర్శకత్వంలో, నటించిన దాన వీర శూర కర్ణ కూడా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. రెండు సినిమాలు మహాభారత నేపథ్యంతో రూపొందడంతో సహజంగానే సినీ వర్గాల్లో, అభిమానుల్లో భారీ పోటీ నెలకొంది. పలు ఇంటర్వ్యూలలో కృష్ణ, చలపతిరావు వంటి నటులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఎన్టీఆర్ స్వయంగా కృష్ణను పిలిచి కురుక్షేత్రం సినిమా నిర్మాణం నిలిపివేయమని కోరారు. దాన వీర శూర కర్ణ అప్పటికే చాలావరకు పూర్తవడంతో, ఒకే కాన్సెప్ట్‌తో రెండు సినిమాలు ఎందుకు అని ఎన్టీఆర్ ప్రశ్నించినట్లు తెలిపారు. అయితే, కృష్ణ మాత్రం సినిమాను పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలలో తిరుగులేని నటుడు కావడంతో, ఆయనను ఈ విషయంలో ఓడించాలనే కృష్ణ పట్టుదలతో ఉన్నారని అప్పట్లో సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. 1977 జనవరి 14న ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి. ఈ పోటీ కారణంగా ఎన్టీఆర్, కృష్ణ అభిమానుల మధ్య తీవ్రమైన చర్చలు, గొడవలు కూడా చోటు చేసుకున్నాయి. బాక్సాఫీస్ దగ్గర దాన వీర శూర కర్ణ భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించగా, కురుక్షేత్రం తెలుగులో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కర్ణాటకలో పర్వాలేదనిపించుకున్న ఈ చిత్రం, హిందీలో డబ్ అయి విడుదలైనప్పుడు మాత్రం భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద వెనుకబడినప్పటికీ, కురుక్షేత్రం తన సాంకేతిక విలువలు, భారీ నిర్మాణం, అద్భుతమైన నటీనటుల ప్రదర్శనల కారణంగా తెలుగు పౌరాణిక చిత్రాల చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

ఇది కూడా చదవండి : అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు..! అందరం ఒకే కుటుంబంలా ఉండేవాళ్లం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us