ఎంఎస్ నారాయణతో బ్రహ్మానందం గొడవ.. అసలు విషయం చెప్పిన ఎంఎస్ కూతురు

ఎం.ఎస్ నారాయణ.. అసలు పేరు సూర్యనారాయణ. 1995లో పెదరాయుడు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తన కామెడీ, నటనతో ఆకట్టుకున్న ఆయన ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్నారు. తెలుగులో దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించారు. నటుడిగానే కాకుండా రచయితగానూ రాణించారు. అంతకుముందు కొన్ని సినిమాలకు రచయితగా పనిచేశారు. అలాగే కొన్ని నాటకాలు రాశారు.

ఎంఎస్ నారాయణతో బ్రహ్మానందం గొడవ.. అసలు విషయం చెప్పిన ఎంఎస్ కూతురు
Ms Narayana

Updated on: Feb 10, 2026 | 2:12 PM

ప్రముఖ దివంగత హాస్యనటుడు ఎంఎస్ నారాయణ కూతురు శశి కిరణ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన తండ్రికి, హాస్యనటుడు బ్రహ్మానందం మధ్య ఉన్న సంబంధంపై  ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. వారిద్దరి మధ్య ఎలాంటి వ్యక్తిగత గొడవలు లేవని, కేవలం వృత్తిపరమైన ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉండేదని ఆమె స్పష్టం చేశారు. బ్రహ్మానందం ఎంఎస్ నారాయణను ఎంతగానో గౌరవించేవారని, ఎంఎస్ నారాయణ మరణించినప్పుడు బ్రహ్మానందం ఎంతో ఎమోషనల్ అయ్యారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఎంఎస్ నారాయణ, బ్రహ్మానందం మధ్య వృత్తిపరమైన పోటీ ఎప్పుడూ ఉండేదని శశి కిరణ్ అన్నారు. బ్రహ్మానందం ఇండస్ట్రీలో సీనియర్ అని, తన తండ్రి 46 ఏళ్ల వయసులో హాస్యనటుడిగా పరిశ్రమలోకి వచ్చారని ఆమె తెలిపారు.

అలాగే ఆమె మాట్లాడుతూ.. మాకు తెలిసినంతవరకు గొడవలు, బహిరంగంగా కొట్టుకోవడాలు వంటివి ఎప్పుడూ జరగలేదు. పోటీ ఉండేది కానీ అదే సమయంలో మంచి బంధం కూడా ఉండేది, అని శశి కిరణ్ పేర్కొన్నారు. తన తండ్రి బ్రహ్మానందంను బ్రహ్మన్నయ్య అని పిలిచేవారని, కోట శ్రీనివాసరావుతో కూడా మంచి బంధం ఉండేదని తెలిపారు. వారి అనుబంధానికి నిదర్శనంగా, షూటింగ్ తర్వాత బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ ఫోన్‌లో మాట్లాడుకునేవారని శశి కిరణ్ చెప్పారు. ఇంటి భోజనం ఇష్టపడే ఎంఎస్ నారాయణకు, షూటింగ్‌కు వచ్చేటప్పుడు ఆయనకు ఇష్టమైన వంటలను బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, గిరిబాబు లాంటివారు తెచ్చేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. గిరిబాబు ఇంటి నుంచి చింతకాయ పచ్చడి ఎంఎస్ నారాయణకు బాగా ఇష్టమని, దానిని జాగ్రత్తగా దాచుకొని తినేవారని తెలిపారు.

బ్రహ్మానందం ఇంట్లో డ్రైవర్లు ఎంఎస్ నారాయణ ఇంటికి వెళ్లడం, అలాగే తమ ఇంట్లో వారు బ్రహ్మానందం ఇంటికి వెళ్లడం వంటివి తరచుగా జరిగేవని, ఇది వారి బలమైన వ్యక్తిగత బంధాన్ని తెలియజేస్తుందని శశి కిరణ్ వివరించారు. బ్రహ్మానందం భార్య తన సొంత గ్రామానికి చెందినవారు కావడం వల్ల కూడా వారికి మరింత దగ్గరి సంబంధం ఉండేదని ఆమె తెలిపారు. కాగా బ్రహ్మానందం కూడా ఎంఎస్ నారాయణకు తనకు ఉన్న అనుబంధాన్ని పలు ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.