
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాలలో మొగుడు కావాలి ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. తమ్మారెడ్డి భరద్వాజ చరిత చిత్ర పతాకంపై నిర్మించిన ఈ సినిమా, చిరంజీవి సోలో హీరోగా 100 రోజులు ఆడిన తొలి విజయవంతమైన చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. 1979లో విడుదలైన కోతలరాయుడుతో చిరంజీవిని హీరోగా నిలబెట్టిన భరద్వాజ, ఆ తర్వాత చిరంజీవితో నిర్మించిన మరో చిత్రమే మొగుడు కావాలి. కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం హిందీ చిత్రం మంఛాలి ఆధారంగా తెరకెక్కింది. వాస్తవానికి ఈ చిత్రానికి రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాలి. అప్పట్లో దర్శకరత్న దాసరి నారాయణరావు, నిర్మాత భరద్వాజ మధ్య వచ్చిన కొన్ని మనస్పర్థల కారణంగా రేలంగి ఈ సినిమాకు పనిచేయలేకపోయారు. దీంతో భరద్వాజ కట్టా సుబ్బారావును దర్శకుడిగా ఎంపిక చేశారు. ఇది సుబ్బారావుకు మూడవ సినిమా కాగా, చిరంజీవితో ఆయనకు తొలి చిత్రం.
ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..
మొగుడు కావాలి చిత్రం షూటింగ్‌లో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ చిలుకా పలికే బంగారమా అనే పాట చిత్రీకరణ సమయంలో లెగ్ మూమెంట్స్ ఎక్కువగా ఉండటంతో చిరంజీవి మోకాళ్ళకు క్యాప్స్ కావాలని నిర్మాత భరద్వాజకు చెప్పారు. అయితే కాస్ట్యూమ్స్ వారు పొరపాటున చేతికి తొడిగే క్యాప్స్ తీసుకువచ్చారు. ఆ రాత్రి జరుగుతున్న షూటింగ్‌లో మోకాళ్ళకు క్యాప్స్ లేకపోవడంతో చిరంజీవి మోకాళ్ళు కొట్టుకుపోయి చర్మం బయటికి వచ్చింది. అయినప్పటికీ, బాధ భరిస్తూ పాటను పూర్తి చేశారు. అప్పటికే మరుసటి రోజు రాత్రి లవ్ ఇన్ సింగపూర్ చిత్రం కోసం సింగపూర్ వెళ్లాల్సి ఉండటంతో, షూటింగ్ ఆపవద్దని చిరంజీవి భరద్వాజను కోరారు. ఇది చిరంజీవి అంకితభావానికి నిదర్శనం.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..
1980 జూన్ 10న హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ చిత్రం అన్నపూర్ణ, భాగ్యనగర్ స్టూడియోల్లో చిత్రీకరణ జరుపుకుంది. ఈ చిత్రంలో గాయత్రితో పాటు సువర్ణ మరో కథానాయికగా నూతన ప్రసాద్ సరసన నటించారు. గాయత్రి ప్రముఖ కన్నడ నటుడు శంకర్ నాగ్ భార్య కాగా, సువర్ణ తమిళ నటుడు జయం రవికి కూతురిని ఇచ్చిన అత్తగారు. సత్యానంద్ హిందీ చిత్రం మంఛాలికి కొన్ని మార్పులు చేసి మొగుడు కావాలి చిత్రానికి అద్భుతమైన స్క్రిప్ట్ అందించారు. వేటూరి రాసిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోగా, జె.వి. రాఘవులు బాణీలు సమకూర్చారు. 1980 నవంబర్ 25న విడుదలైన ఈ చిత్రం చిరంజీవికి 23వ సినిమా. అంతకుముందు చిరంజీవి నటించిన పున్నమి నాగు 98 రోజులు ఆడినా, షిఫ్టులపై 100 రోజులు పూర్తి చేసుకుంది. కానీ మొగుడు కావాలి గుంటూరులోని నాజ్, అప్సరా థియేటర్లలో డైరెక్ట్ గా 100 రోజులు ఆడి, చిరంజీవి కెరీర్‌లో తొలి సోలో 100 రోజుల చిత్రంగా నిలిచింది. విజయవాడ, విశాఖపట్నం కేంద్రాల్లో షిఫ్ట్స్ పై, హైదరాబాద్, రాజమండ్రి, కాకినాడ కేంద్రాల్లో ఉదయం ఆటలతో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం తర్వాత చిరంజీవిని అభిమానించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది, ఆయనకు మెగాస్టార్‌గా ఎదుగుతున్న దశలో ఇది ఒక కీలకమైన విజయం.
ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..