సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, హీరో మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో ఘట్టమనేని కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. ఈనేపథ్యంలో కృష్ణ ఫ్యామిలీని మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. గురువారం వారి ఇంటికి వెళ్లిన ఆయన మహేశ్, కృష్ణలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఇందిరా దేవి మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. కాగా బుధవారం అనారోగ్యంతో ఇందిరా దేవి తుదిశ్వాస విడిచారు. దీంతో కృష్ణ ఫ్యామిలీతో పాటు అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సినీ, రాజకీయ ప్రముఖులు మహేశ్ ఇంటికి వెళ్లి ఇందిరా దేవి పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగార్జున, మోహన్‌బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, మంచు విష్ణు తదితరులు ఇందిరా దేవి మహేశ్ కుటుంబాన్ని పరామర్శించారు. కొందరు అంత్యక్రియలకు కూడా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా ఇందిరా దేవి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ‘ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతోగానో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. సూపర్ స్టార్ కృష్ణ , సోదరుడు మహేష్ బాబుకి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను’ అని పోస్ట్ పెట్టారు. కాగా చిరంజీవి తన తాజా చిత్రం గాడ్‌ఫాదర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా నిన్న అనంతపురంలో సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీంతో ఇందిరా దేవి అంత్యక్రియల్లో మెగాస్టార్ పాల్గొనలేకపోయారు. ఈక్రమంలోనే గురువారం మహేశ్ ఇంటికెళ్లారు. కృష్ణ, మహేశ్‌బాబులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూ ?, సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబు కి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..